కాలువపై నిర్మాణం
-
రాముని చెరువు మత్తడి కాలువలపై అక్రమ నిర్మాణాలు
-
కాలువకు ఆనుకునే షాపింగ్
-
కాంప్లెక్స్‌లు.. ఎల్తైన భవనాలు
-
భవిష్యత్తులో కూలిపోయే ప్రమాదం
-
దర్జాగా కబ్జాదారుల ఆక్రమణల పర్వం
-
కనుమరుగవుతున్న కాలువ
సాక్షి, మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలో భూ కబ్జాదారులు బరితెగిస్తున్నారు. కబ్జాకు కాదేది అనర్హం.. అన్న చందంగా కన్పించిన ఖాళీ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. చెరువులు.. కుంటల స్థలాల మాట అటుంచితే.. చివరకు కాలువలను సైతం విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే మంచిర్యాల పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలు కనుమరుగు కాగా, పట్టణంలో ఉన్న మురుగు కాలువలపైనా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. జోరుగా జరుగుతున్న ఆక్రమణల పర్వంపై స్పందించాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు.
మంచిర్యాల నడిబొడ్డున.. ప్రధాన రోడ్డుపై రాముని చెరువు మత్తడి కాలువపై అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా బల్దియా అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. కనీసం అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఓ పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులు.. కాలువల ఆక్రమణ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలని ఇది వరకే జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. అయినా.. మంచిర్యాలలో మాత్రం కబ్జాదారులపై అధికారులు మెతక వైఖరి అవలంబిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కనుమరుగవుతున్న కాలువ..
రాముని చెరువు పార్కు సమీపంలోని మత్తిడి నుంచి నీరు రాళ్లవాగులో కలిసేలా సుమారు 2 కి.మీ పొడవు, 15 మీటర్ల వెడల్పుతో కాలువను నిర్మించారు. కాలువ ద్వారా నీళ్లు పట్టణంలోని ప్రధాన వీధులైన జన్మభూమినగర్, ఇస్లాంపుర, రెడ్డికాలనీల మీదుగా రాళ్లవాగులో కలుస్తాయి. కాలువ పట్టణంలోని ప్రధాన రహదారి, కాలనీలోని నివాస గృహాలకు ఆనుకొని ఉండడంతో వ్యాపారులు, ప్రజలు కాలువను ఆక్రమించుకున్నారు. అనేక మంది కాలువపై స్లాబు వేసి నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఆ కాలువ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో కూడా తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది.
నిబంధనల ప్రకారం.. కాలువ నుంచి రెండు మీటర్ల స్థలం వదిలి నిర్మాణం చేపట్టాలి. కానీ.. కాలువకు ఆనుకొనే భవంతుల నిర్మాణం చేపట్టారు. కాలువ ఉధృతి పెరిగితే.. నీళ్లు భవంతుల పునాదులకు చే రి భవనాలు కూలిపోయే ప్రమాదమున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అనేక ప్రాంతాల్లో.. భవనాలకు ఇరువైపులా రోడ్డు ఉన్నా.. ప్రధాన రోడ్డు నుంచి రాకపోకలు సాగించేలా కాలువపై అక్రమంగా స్లాబులు నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు కిలోమీటరున్నర మేర కాలువపై అక్రమ నిర్మాణాలు జరిగాయి. భవిష్యత్తులో కాలువను శుభ్రం చేయాలన్నా.. ఏదైనా మరమ్మతు చేపట్టాలన్నా అక్రమ నిర్మాణాలు అడ్డంకిగా మారనున్నాయి.
చర్యలు తప్పవు
రాముని చెరువు మత్తడి కాలువపై జరుగుతున్న అక్రమ నిర్మాణ విషయం నా దృష్టికి రాలేదు. కాలువలపై ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఉండవు. ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే.. చర్యలు తీసుకుంటాం.
– తేజావత్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్, మంచిర్యాల