తీజ్ బుట్టలతో గిరిజన యువతులు
-
మొలకల పండగ తీన్‌మార్
-
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక
-
నల్లమలలో మెలకల పండగ సదండి
-
తండాల్లో అలరిస్తున్న ఉత్సవాలు
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక తీజ్ (మొలకల) .. ఈ పండగలో యువతులే పాల్గొనడం ఓ ప్రత్యేకత.. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి గిరిజన తండాలో రెండు, మూడేళ్లకోసారి ఈ పండగ జరుపుకోవడం ఆనవాయితీ. నల్లమలలో పవిత్రమైన మొలకల పండగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు..
– అచ్చంపేట / అమ్రాబాద్
జిల్లాలోని నల్లమల, ఏజెన్సీ తండాలతోపాటు వంగూరు, కల్వకుర్తి, ఆమనగల్లు మండలాల్లో మొలకల పండగ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉత్సవాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో తండాలన్నీ కళకళలాడుతున్నాయి. అచ్చంపేట మండలంలోని దర్శన్‌గడ్డ, శంకరయ్యగుట్టతండా, గుంపన్‌పల్లి, సిద్దాపూర్, అక్కారం, ఆంజనేయులుతండా; అమ్రాబాద్ మండలంలోని జ్యోత్యనాయక్‌తండా, రాయలగండి, ఇప్పలపల్లి; బల్మూర్ మండలంలోని బాణాల, నర్సాయిపల్లి; వంగూరు మండలంలోని ఆయా తండాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల తీజ్ ఉత్సవాలు బంజారాజాతి వంశపారంపర్యంగా వస్తోంది. పాత పద్ధతుల పోకడలకు స్వస్తి పలుకుతున్న నేటి తరుణంలో అవి కనుమరుగు కాకుండా పరిరక్షించుకుంటామని లంబాడీలు నిరూపిస్తున్నారు. ఇందులోభాగంగా సేవాలాల్ మారాజ్ (సేవాభాయి) దండి మేరమ్మ (అమ్మవారు) పూజ కార్యక్రమాలు, భజన భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. సేవాభాయి, అమ్మవార్ల వద్ద పూజలు నిర్వహించిన గిరిజనులు ఆయురారోగ్యాలతో కుటుంబాలు బాగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి ఇళ్లకు పూజ సామగ్రి తీసికెళ్లి వ్యవసాయ పొలాలు, పశువుల పాకలు, ఇళ్లలో ఉంచుతారు. మొదటిరోజు దుసురు తీగలతో అల్లిన బుట్టల్లో ఇసుక, ఎరువులను నింపి అందులో గోధుమలు వేసి తీజ్ వేడుకలను ప్రారంభిస్తారు. ఉపవాస దీక్షలతోపాటు బాలికలు జాగరణ చేసి ఎంతో నిష్టతో ఉండి ప్రత్యేకతను చాటుకుంటారు. గిరిజన సేవా సంఘం, ఉద్యోగుల సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో పెద్దఎత్తున నాలుగు సార్లు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఉద్దేశం
యుక్త వయసులో గిరిజన యువతులు విద్య, ఉద్యోగ, సంసారిక జీవితం, పుట్టినింటితోపాటు మొట్టినిల్లు అషై ్టశ్వర్యాలు, సుఖశాంతులతో తల తూగాలంటూ ఏటా మొలకల పండగను నిర్వహిస్తారు. ఇది పెద్దమనుషులతో యువతులు ఆశ్వీరాదం పొందుట కోసం జరుపుకొంటారు. ప్రతి గిరిజన యువతికి పెళ్లి జరిగేనాటికి తీజ్ పండగను ఆ కుటుంబ సభ్యులు నిర్వహించడం ఆనవాయితీ.
పండగ విశిష్టత
ఈ పండగను గిరిజనులు తొమ్మిదిరోజుల పాటు జరుపుకొంటారు. బుట్టల్లో ఇసుక, ఎరువులు పోసి అందులో నానబెట్టిన గోధుమలను చల్లుతారు. గిరిజన యువతులు ఆ బుట్టల్లో విత్తనాలను వేసి మొలకలను పెంచుతారు. ఈ మొలకల బుట్టలను ప్రత్యేకమైన మంచంపైన ఉంచి రోజుకు మూడు పూటలా నీళ్లు పోస్తూ పెంచుతారు. మొలకలకు నీరు పోసే యువతులు తొమ్మిదిరోజుల పాటు రొట్టెలు, ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. బుట్టలు ఎందరు ఉంచినా అందులో ఐదుగురు యువతులు మాత్రమే నిష్టతో పూజ చేస్తారు. గిరిజన మహిళలు నిత్యం పూజలు చేస్తూ కార్యక్రమాలు చేపడతారు. చివరిరోజున వారు మొలకల బుట్టలను నెత్తిపై పెట్టుకుని చెరువు వద్దకు చేరుకుంటారు. అప్పటికే అక్కడ వరుస క్రమంలో పెద్దమనుషులు సంప్రదాయరీతిలో రుమాలలు తలకు కట్టుకొని కూర్చుంటారు. యువతులు బుట్టలను తలపై పెట్టుకుని పాటలు పాడుతూ పెద్దమనషుల వద్దకు వస్తారు. తలపై ఉన్న బుట్టల్లోని మొలకలను కొన్నింటిని పెద్దమనషుల తలపాగాలలో వేస్తారు. అక్కడ బుట్టలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అనంతరం చెరువులో వదులుతారు. ఆరోజు పండగలో పాల్గొన్న అందరూ యువతులతోపాటు రొట్టెలు, ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత పెద్దమనుషులను కూర్చొబెట్టి కాళ్లు కడిగి వారితో ఆశీర్వాదం పొందుతారు. అలాగే యువతులను పీటలపై కూర్చోబెట్టి పెద్దమనుషులు వారి కాళ్లు కడిగి ఆశీర్వదిస్తారు. అమ్రాబాద్ మండలం రాయలగండిలో శనివారం తీజ్ ముగింపు ఉత్సవాలు జరిగాయి. యువతులు తీజ్ బుట్టలతో నిమజ్జనానికి తరలివెళ్లారు.