nalamala
-
పర్యాటక ప్రాంతంగా నల్లమల
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆత్మకూరు రూరల్: నల్లమలను పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగలూటి అటవీ రేంజ్లో ( బైర్లూటి)లో ఏర్పాటు చేసిన పర్యావరణ పర్యాటక కేంద్రాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగోడు రిజర్వాయర్, సిద్దాపురం చెరువులో బోటింగ్ అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. నాగలూటి చెంచు గూడేనికి రహదారి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం శ్రీశైలం శాసన సభ్యుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, శాసన మండలి సభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. డీఎఫ్ఓ సెల్వం ప్రసంగించారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి జంగిల్ సఫారి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఆహమ్మద్ హుసేన్, ఎకో – టూరిజం సీసీఎఫ్ రమణారెడి, ఎఫ్డీపీటీ శర్వణ్ , ఆత్మకూరు ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ బబిత, డీఎఫ్ఓలు యశోదాబాయి, జయచంద్రారెడ్డి, ఏసీఎఫ్ సాయిబాబా, ఆర్డీవో హుసేన్ సాహెబ్, డీఎస్పీ వినోద్ కుమార్, తహసీల్దార్ రాజశేఖరబాబు, ఎంపీడీవో శశికళ తదితరులు పాల్గొన్నారు. -
గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్
ఆత్మకూరు: నాగలూటి రేంజ్ పరిధిలోని బైర్లూటీ చెక్‌పోస్టు సమీపంలో నల్లమల జంగిల్ క్యాంప్ రహదారి వెంట అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను నాగలూటి రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దోర్నాలకు చెందిన శ్రీనివాసులు, ఒంగోల్‌కు చెందిన రమేష్, నరసింహులు అడవిలో వెళ్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకుని వివరాలు తెలుసుకున్నారు. తాము శ్రీశైలానికి కాలినడక వెళ్తున్నామని మొదట నమ్మించే ప్రయత్నం చేశారు. ఫారెస్ట్ రేంజ్ర్ గట్టిగా మందలించడంతో ముగ్గురు వ్యక్తులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో పూర్తిస్థాయిలో విచారించారు. తాము ఒంగోలు ప్రాంతానికి చెందిన వారమని కారులో వచ్చామని చెప్పారు. కారు ఉన్న ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లగా, అందులో మెటల్ డిటెక్టర్ ఉండడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులను నందికొట్కూరు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా రిమాండ్‌కు ఆదేశించారు. శ్రీనివాసులు కుటుంబీకులకు సమాచారం అందించగా ఆయన తల్లి కోర్టుకు వద్దకు చేరుకుని, తమ కుమారుడని అన్యాయంగా అరెస్ట్ చేశారని విలపించింది. -
నల్లమల జంగిల్ క్యాంప్ ప్రారంభం
ఆత్మకూరు: అటవీశాఖ ఆధ్వర్యంలో బైర్లూటీ చెక్‌పోస్టు వద్ద రూ. 92లక్షలతో నిర్మించిన నల్లమల జంగిల్ క్యాంప్‌ను ఈ నెల 29న ప్రారంభిస్తున్నట్లు బైర్లూటీ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నల్లమల జంగిల్ క్యాంప్ నల్లమలను వీక్షించాలనే పర్యాటకులకు ఎంతో అనువుగా ఉంటుందన్నారు. 1.34 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంప్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మార్నింగ్ వాక్ ఉంటుందని, సిద్దాపురం చెరువు వరకు లేదా గంగిరేవు వాగు వరకు ఈ నడక ఉంటుందన్నారు. పర్యాటకులకు కాటేజీ, భోజన సదుపాయం కలి్పస్తున్నామన్నారు. ఈ క్యాంప్ ప్రారంభం సందర్భంగా 28, 29 తేదీల్లో బైర్లూటీ వద్ద ఆర్చరీ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నల్లమల జంగిల్ క్యాంప్‌ను ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రానున్నట్లు తెలిపారు. -
పులుల లెక్కింపుపై సమీక్ష
ఆత్మకూరు: నల్లమల అటవీ పరిధిలో నాలుగో విడత పులుల లెక్కింపుపై కర్నూలు సీసీఎఫ్ జేఎస్ఎన్ మూర్తి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బైర్లూటీ చెక్‌పోస్టు సమీపంలోని అటవీశాఖకు చెందిన జంగిల్ క్యాంపులో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది రెండుసార్లు పులుల లెక్కింపు జరుగుతుందని, ఇందులో తొలి విడత 45 రోజులు, మరో రోజు 45 రోజుల చొప్పున టైగర్లను గుర్తించడం జరుగుతుందన్నారు. పులుల లెక్కింపు ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారా, నీరు నిల్వ ఉన్న కుంటల వద్ద, సెలయేర్లు, చల్లని ప్రదేశాలలో పులుల లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుండ్ల బ్రహ్మేశ్వరం అరణ్యపరిధిలో బఫర్ ఏరియాపై నిర్ణయం తీసుకునేందుకు అ«ధికారులతో సమీక్షించారు. బఫర్ ఏరియా ఏర్పాటు చేస్తే కలిగే వివిధ అంశాలపై అధికారులతో ఆయన ప్రధానంగా చర్చించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ ఎస్డీ శర్వణన్, గుంటూరు సీఎఫ్ రామ్మోహన్రావు, ఆత్మకూరు డీఎఫ్ఓ సెల్వం, నంద్యాల డీఎఫ్ఓ శివప్రసాద్, మార్కాపురం డీఎఫ్ఓ జయచంద్ర, గిద్దలూరు డీఎఫ్ఓ ఖాదర్‌బాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలలో కూబింగ్‌కు ‘స్పెషల్’ బృందాలు
కర్నూలు: నల్లమల అటవీ ప్రాంతంలో కూంబింగ్ కోసం స్పెషల్ పార్టీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో సివిల్ , ఏఆర్ సిబ్బంది నిర్వహించిన కవాతును ఎస్పీ పరిశీలించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లను జిల్లా కేంద్రానికి పిలిపించి వారి వయస్సు, వ్యక్తిగత వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కోసం స్పెషల్ పార్టీ బృందాలుగా వారిని ఏర్పరిచి.. ఫిట్నెస్ కోసం మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్ఐలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు వీవీఐపీల కదలికల సమాచారాలను యూనిట్ ఆఫీసర్లకు అందించాలన్నారు. వీఐపీలకు రక్షణ కల్పించాలన్నారు. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒబేసిటీ తరగతులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, వెంకటాద్రి, సీఐలు నాగరాజురావు, మధుసూదన్‌రావు, ఆర్ఐలు జార్జ్, రంగముని, రామకృష్ణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లమల సిగలో అగ్ని శిఖ
ఆత్మకూరు రూరల్: మూడు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. పచ్చటి నల్లమల అడవులను తాకుతూ.. కొండల మీదుగా వెళ్తున్న మేఘాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగలూటి–బైర్లూటి ప్రాంతంలో ఔషధ మొక్క శంకర పుష్పి(అగ్ని శిఖ) అత్యంత రమణీయంగా కనువిందు చేస్తోంది. అరవిరిసిన అగ్నిశిఖ పుష్పాలపై నీటి బిందువులు ఎర్రని ముత్యాలను తలపిస్తున్నాయి. ఆగి ఆగి కురుస్తున్న వర్షం.. అగ్నిశిఖ అందం నల్లమల సౌందర్యాన్ని రెట్టింపు చేస్తోంది. -
తీజ్.. హమార్!
మొలకల పండగ తీన్మార్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక నల్లమలలో మెలకల పండగ సదండి తండాల్లో అలరిస్తున్న ఉత్సవాలు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక తీజ్ (మొలకల) .. ఈ పండగలో యువతులే పాల్గొనడం ఓ ప్రత్యేకత.. శ్రావణ మాసం సందర్భంగా ప్రతి గిరిజన తండాలో రెండు, మూడేళ్లకోసారి ఈ పండగ జరుపుకోవడం ఆనవాయితీ. నల్లమలలో పవిత్రమైన మొలకల పండగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.. – అచ్చంపేట / అమ్రాబాద్ జిల్లాలోని నల్లమల, ఏజెన్సీ తండాలతోపాటు వంగూరు, కల్వకుర్తి, ఆమనగల్లు మండలాల్లో మొలకల పండగ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉత్సవాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో తండాలన్నీ కళకళలాడుతున్నాయి. అచ్చంపేట మండలంలోని దర్శన్‌గడ్డ, శంకరయ్యగుట్టతండా, గుంపన్పల్లి, సిద్దాపూర్, అక్కారం, ఆంజనేయులుతండా; అమ్రాబాద్ మండలంలోని జ్యోత్యనాయక్తండా, రాయలగండి, ఇప్పలపల్లి; బల్మూర్ మండలంలోని బాణాల, నర్సాయిపల్లి; వంగూరు మండలంలోని ఆయా తండాల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల తీజ్ ఉత్సవాలు బంజారాజాతి వంశపారంపర్యంగా వస్తోంది. పాత పద్ధతుల పోకడలకు స్వస్తి పలుకుతున్న నేటి తరుణంలో అవి కనుమరుగు కాకుండా పరిరక్షించుకుంటామని లంబాడీలు నిరూపిస్తున్నారు. ఇందులోభాగంగా సేవాలాల్ మారాజ్ (సేవాభాయి) దండి మేరమ్మ (అమ్మవారు) పూజ కార్యక్రమాలు, భజన భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. సేవాభాయి, అమ్మవార్ల వద్ద పూజలు నిర్వహించిన గిరిజనులు ఆయురారోగ్యాలతో కుటుంబాలు బాగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి ఇళ్లకు పూజ సామగ్రి తీసికెళ్లి వ్యవసాయ పొలాలు, పశువుల పాకలు, ఇళ్లలో ఉంచుతారు. మొదటిరోజు దుసురు తీగలతో అల్లిన బుట్టల్లో ఇసుక, ఎరువులను నింపి అందులో గోధుమలు వేసి తీజ్ వేడుకలను ప్రారంభిస్తారు. ఉపవాస దీక్షలతోపాటు బాలికలు జాగరణ చేసి ఎంతో నిష్టతో ఉండి ప్రత్యేకతను చాటుకుంటారు. గిరిజన సేవా సంఘం, ఉద్యోగుల సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలో పెద్దఎత్తున నాలుగు సార్లు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉద్దేశం యుక్త వయసులో గిరిజన యువతులు విద్య, ఉద్యోగ, సంసారిక జీవితం, పుట్టినింటితోపాటు మొట్టినిల్లు అషై ్టశ్వర్యాలు, సుఖశాంతులతో తల తూగాలంటూ ఏటా మొలకల పండగను నిర్వహిస్తారు. ఇది పెద్దమనుషులతో యువతులు ఆశ్వీరాదం పొందుట కోసం జరుపుకొంటారు. ప్రతి గిరిజన యువతికి పెళ్లి జరిగేనాటికి తీజ్ పండగను ఆ కుటుంబ సభ్యులు నిర్వహించడం ఆనవాయితీ. పండగ విశిష్టత ఈ పండగను గిరిజనులు తొమ్మిదిరోజుల పాటు జరుపుకొంటారు. బుట్టల్లో ఇసుక, ఎరువులు పోసి అందులో నానబెట్టిన గోధుమలను చల్లుతారు. గిరిజన యువతులు ఆ బుట్టల్లో విత్తనాలను వేసి మొలకలను పెంచుతారు. ఈ మొలకల బుట్టలను ప్రత్యేకమైన మంచంపైన ఉంచి రోజుకు మూడు పూటలా నీళ్లు పోస్తూ పెంచుతారు. మొలకలకు నీరు పోసే యువతులు తొమ్మిదిరోజుల పాటు రొట్టెలు, ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. బుట్టలు ఎందరు ఉంచినా అందులో ఐదుగురు యువతులు మాత్రమే నిష్టతో పూజ చేస్తారు. గిరిజన మహిళలు నిత్యం పూజలు చేస్తూ కార్యక్రమాలు చేపడతారు. చివరిరోజున వారు మొలకల బుట్టలను నెత్తిపై పెట్టుకుని చెరువు వద్దకు చేరుకుంటారు. అప్పటికే అక్కడ వరుస క్రమంలో పెద్దమనుషులు సంప్రదాయరీతిలో రుమాలలు తలకు కట్టుకొని కూర్చుంటారు. యువతులు బుట్టలను తలపై పెట్టుకుని పాటలు పాడుతూ పెద్దమనషుల వద్దకు వస్తారు. తలపై ఉన్న బుట్టల్లోని మొలకలను కొన్నింటిని పెద్దమనషుల తలపాగాలలో వేస్తారు. అక్కడ బుట్టలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అనంతరం చెరువులో వదులుతారు. ఆరోజు పండగలో పాల్గొన్న అందరూ యువతులతోపాటు రొట్టెలు, ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత పెద్దమనుషులను కూర్చొబెట్టి కాళ్లు కడిగి వారితో ఆశీర్వాదం పొందుతారు. అలాగే యువతులను పీటలపై కూర్చోబెట్టి పెద్దమనుషులు వారి కాళ్లు కడిగి ఆశీర్వదిస్తారు. అమ్రాబాద్ మండలం రాయలగండిలో శనివారం తీజ్ ముగింపు ఉత్సవాలు జరిగాయి. యువతులు తీజ్ బుట్టలతో నిమజ్జనానికి తరలివెళ్లారు. -
19న శ్రీశైలానికి హెలికాఫ్టర్ సర్వీసు
· రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలు రాక · హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి టికెట్ రూ.14,840 శ్రీశైలం : శ్రీశైలమహాక్షేత్రానికి భక్తుల సౌకర్యార్థం హెలికాఫ్టర్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త బుధవారం రాత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీశైలాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా హెలికాఫ్టర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెవెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ వివిధ హెలికాప్టర్ల కంపెనీలతో మాట్లాడిన తరువాత న్యూఢిల్లీ సమ్మిట్ ఏవియేషన్ కంపెనీ ఈ సర్వీసుల నిర్వహణకు ఆసక్తి చూపించి ముందుకు వచ్చింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు, రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, సమ్మిట్ ఏవియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ బాటియాలు ఇక్కడికి చేరుకుంటారని ఈఓ తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వచ్చేందుకు 45 నిమిషాలు పడుతుందని, టికెట్ రూ. 14,840గా సమ్మిట్ ఏవియేషన్ సంస్థ నిర్ణయించిందని తెలిపారు. ప్రయాణంలో కృష్ణానది, నల్లమల అడవులు , ప్రకతి సౌందర్యాలను వీక్షించవచ్చునని ఈఓ వెల్లడించారు. పుష్కరాల తరువాత ఈ హెలికాఫ్టర్ సర్వీసులను హైదరాబాద్, విజయవాడ నుంచి కూడా శ్రీశైలానికి నడిపేందుకు సమ్మిట్ ఏవియేషన్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాలను ఇరా నరులా మొబైల్ నెం 09650388989 సమ్మిట్ ఏవియేషన్ సంస్థ వారిని సంప్రదిం^è వచ్చునని అన్నారు.