గుప్త నిధుల వేటగాళ్ల అరెస్ట్
ఆత్మకూరు: నాగలూటి రేంజ్ పరిధిలోని బైర్లూటీ చెక్‌పోస్టు సమీపంలో నల్లమల జంగిల్ క్యాంప్ రహదారి వెంట అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను నాగలూటి రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దోర్నాలకు చెందిన శ్రీనివాసులు, ఒంగోల్‌కు చెందిన రమేష్, నరసింహులు అడవిలో వెళ్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకుని వివరాలు తెలుసుకున్నారు. తాము శ్రీశైలానికి కాలినడక వెళ్తున్నామని మొదట నమ్మించే ప్రయత్నం చేశారు.
ఫారెస్ట్ రేంజ్‌ర్ గట్టిగా మందలించడంతో ముగ్గురు వ్యక్తులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో పూర్తిస్థాయిలో విచారించారు. తాము ఒంగోలు ప్రాంతానికి చెందిన వారమని కారులో వచ్చామని చెప్పారు. కారు ఉన్న ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లగా, అందులో మెటల్ డిటెక్టర్ ఉండడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులను నందికొట్కూరు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా రిమాండ్‌కు ఆదేశించారు. శ్రీనివాసులు కుటుంబీకులకు సమాచారం అందించగా ఆయన తల్లి కోర్టుకు వద్దకు చేరుకుని, తమ కుమారుడని అన్యాయంగా అరెస్ట్ చేశారని విలపించింది.