- మార్కులకు, తెలివికి సంబంధం లేదు
- నిరంతర సాధనతో లక్ష్యం చేరుకోవచ్చు
- ‘సాక్షి’ ‘ఆర్‌కే’ స్టడీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో
- జరిగిన గ్రూప్స్ అవగాహన సదస్సులో వక్తలు ఉద్బోధ
- వందలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు
కసితో నాస్తి దుర్భిక్షం
Published Wed, Jan 18 2017 11:21 PM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
కృషితో నాస్తి దుర్భిక్షం కాదు .. కసితో నాస్తి దుర్భిక్షం, ఒక పోస్టుకు వేల మంది పోటీ పడుతున్న నేపథ్యంలో ఒక్క కృషి ఉంటే సరిపోదని, కసితో చదవాలని వక్తలు ఉద్బోధించారు. ప్రణాళిక, నిరంతర సాధనతోనే విజయం సాధ్యమవుతుందని సూచించారు. బుధవారం ‘సాక్షి’ ‘ఆర్‌కే’ స్టడీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో జరిగిన గ్రూప్స్ అభ్యర్థుల అవగాహన సదస్సుకు హాజరైన నన్నయ్య యూనివర్సిటీ అకడమిక్ డీ¯ŒS ఎస్‌టేకీ, ఇంటర్ బోర్డు ఆర్‌ఐవో ఎ.వెంకటేష్, ఆర్‌కే స్టడీ సెంటర్ ఫౌండర్ రామకృష్ణ, గండేపల్లి ఈవోపీ ఆర్‌డీ బి.మహేశ్వర ప్రతాప్, బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి, స్టడీ సెంటర్ ఫ్యాకల్టీ అధ్యాపకులు పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో సోదాహరణంగా వివరించారు. మంచి స్టడీ మెటీరియల్‌తోపాటు, ‘సాక్షి’ భవిత, ఇతర పుస్తకాలు చదివినప్పుడే అన్ని అంశాలపై పట్టు సాధించగలమని పేర్కొన్నారు. అపజయం చెందామని నిరుత్సాహ పడకూడదని, దాని వెంటే విజయం ఉంటుందన్న విషయం అనుక్షణం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు దానిపై అవగాహన పెంచుకోవడం తప్పనిసరని, లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగా ఉండాలని, అప్పడే విజయం సాధించగలమని వివరించారు. ఉద్యోగం సాధించేందుకు డబ్బుతో పనిలేదని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారిలో ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. గ్రూప్స్‌తోపాటు ఇతర పోటీ పరీక్షలూ రాయాలని సూచించారు. ఇంటర్ బోర్డు ఆర్‌ఐవో ఎ.వెంకటేష్ మాట్లాడుతూ అకడమిక్‌లో 95 శాతం వచ్చిన విద్యార్థి, పోటీ పరీక్షల్లో విజయం సాధించలేడన్నారు. తెలివితేటలకు మార్కులకు సంబంధంలేదన్నారు. ఒక అంశాన్ని చదివేటప్పుడు అవగాహన చేసుకుంటూ చదివితే దానిపై పట్టు సాధించగలమని వివరించారు. చదివిన విషయాన్ని నోట్స్ రాసుకోవాలని గండేపల్లి ఈవోపీఆర్‌డీ బి.మహేశ్వర ప్రతాప్ సూచించారు. అభ్యర్థులు బృందంగా ఏర్పడి చదివితే మంచి ఫలితాలు వస్తాయని ఆర్‌కే స్టడీ సెంటర్ వ్యవస్థాపకులు రామకృష్ణ పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థుల సందేహాలకు విద్యా నిపుణులు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌కే స్టడీ సెంటర్ ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
Advertisement