ప్రసాదరావుకు పోయిన నగదును అందజేస్తున్న దృశ్యం
దొరికిన రూ.75 వేల నగదు బ్యాంకు అధికారులకు అప్పగింత
గార్డు వెంకటరావు నిజాయితీ
జి.సిగడాం : వాండ్రంగి స్టేట్‌బ్యాంకు గార్డు జి.వెంకటరావు తన నిజాయితీతో అందరి మన్ననలు పొందాడు. వివరాల్లోకి వెళ్తే...వాండ్రంగి సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎం గదిలో సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో పొందూరు మండలం మజ్జిలపేటకు చెందిన గురుగుబిల్లి ప్రసాదరావు తన ఇంటి నుంచి రూ.75వేలతో ఏటీఎంకు వచ్చి మరో రూ.25వేలు ఏటీఎం నుంచి తీసి మెుత్తం రూ.లక్ష ఒకరికి అప్పు తీర్చాలనుకున్నాడు. అయితే ఏటీఎం పనిచేయకపోవడంతో రూ.75 వేలు బ్యాగును మరచిపోయి...వేరే ఏటీఎంకు వెళ్లిపోయాడు. ఇంతలో స్టేట్‌బ్యాంకులో పని చేస్తున్న గార్డు జి.వెంకటరావు ఏటీఎం పరిశీలించేందుకు వచ్చి బ్యాగును గమనించాడు. వెంటనే బ్యాగును స్థానిక బ్యాంకు మేనేజర్ ప్రసాదరావు, సీఈవో సతీష్‌కు అందజేశారు. ఆ బ్యాగులో రూ.75 వేల నగదు ఉంది. బ్యాగులో ఉన్న సమాచారం మేరకు ప్రసాదరావుకు విషయాన్ని తెలియజేశారు. ఆయనకు ఆ బ్యాగుతో పాటు నగదు మెుత్తాన్ని అందజేశారు. ప్రసాదరావు పొందూరు మండలం కొల్లిపేట పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. గార్డు వెంకటరావు నిజాయితీకి మేనేజర్ ప్రసాదరావు, సీఈవో సతీష్, సర్పంచ్ బూరాడ వెంకటరమణ, మాజీ సర్పంచ్ సనపల త్రినాధరావు తదితరులు అభినందించారు.