ఎక్కడికెళ్లాలో..
చిలమత్తూరు : చిలమత్తూరు మండలం యగ్నిశెట్టిపల్లికి చెందిన గంగమ్మ, నరసింహప్ప కుమారుడు అంజప్ప దివ్యాంగుడు. ఇతన పింఛన్ మొత్తం ఈ నెల బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఏ బ్యాంకులో జమ చేశారో మాత్రం తెలీదు. పంచాయతీ కార్యదర్శిని అడుగుదామంటే అందుబాటులో లేరు. దీంతో అతన్ని తల్లి గంగమ్మ శుక్రవారం ఇలా ఈడ్చే బండిపై మండల కేంద్రానికి తీసుకొచ్చింది. అయితే.. ఏ బ్యాంకుకు వెళ్లాలి.. పింఛన్ ఎక్కడ తీసుకోవాలి.. ఏయే ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలనే అంశాలు తెలియక తల్లి, కుమారుడు రోడ్లన్నీ తిరిగారు.
దిక్కుతోచక చివరకు నిరాశతో స్వగ్రామానికి పయనమయ్యారు. ‘ఇంతకుముందు దేమకేతేపల్లికి వెళ్లి కార్యదర్శి చేతుల మీదుగా పింఛన్ తీసుకునేవాళ్లం. ఇప్పుడు బ్యాంకులో ఇస్తారంట. ఎక్కడిస్తారో మాత్రం తెలీదు. ఈ పద్ధతులేంటో మాకు అర్థం కావడం లేద’ని గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నోట్ల రద్దు తర్వాత అన్ని వర్గాలఽతో పాటు దివ్యాంగులూ నానా అవస్థలు పడుతున్నారనడానికి ఈ సంఘటనే నిదర్శనం.