chilamattor
-
ఇదేమి దౌర్భాగ్యం..?
ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థులు చిలమత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రతి రోజూ అన్నం తిని తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న మరుగుదొడ్ల వద్దకు వెళ్లి ప్లేట్లను శుభ్రం చేసుకొని నీళ్లు తాగి వస్తుంటారు. ఈ దృశ్యాలను చూస్తున్న వారంతా రోజూ అయ్యో పాపం అని అనుకుంటుంటే... అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రం చీమకుట్టినట్లైనా లేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని దాదాపు 800 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో పంచాయతీవారు ఏర్పాటు చేసిన కుళాయిల్లో నీరురాకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనం వస్తుందో... లేదో చూడాలి. - చిలమత్తూరు -
ఫెర్రర్ సేవలు చిరస్మరణీయం
చిలమత్తూరు : పేదల దేవుడు ఫెర్రర్ అని, ఆయన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక ప్రభుత్వ డీవీఅండ్‌ఆర్ జూనియర్ కళాశాల ఆవరణలో ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్ విగ్రహావిష్కరణ శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విశాల ఫెర్రర్ విగ్రహావిష్కరణ చేసి పూలమాల వేసి, నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో విద్య, వైద్యం, పొదుపు మహిళా సంఘాల నిర్వహణ, నీటిని నిల్వ చేయడం కోసం ఎన్నో పథకాలు నిర్వహించిన మహనీయుడన్నారు. ప్రభుత్వ డీవీఅండ్‌ఆర్ జూనియర్ కళాశాల భవన నిర్మాణాల కోసం రూ.కోటి విరాళంగా ఇచ్చిన ఘనత ఆర్డీటీకి దక్కిందన్నారు. జిల్లాలో పలు కళాశాలలు, పాఠశాలల కోసం భవనాలు, కమ్యూనిటీ భవనాలు నిర్మించి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అనంతరం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ నౌజియాబాను, సర్పంచ్ శ్రీకళ, సంస్థ రీజినల్ డైరెక్టర్లు కృష్ణవేణి, రాజశేఖర్‌రెడ్డి, మీనాక్షి, సుదర్శన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
చిలమత్తూరు : చిలమత్తూరు బీసీ కాలనీలో పూసల మంజునాథ్(25) ఉరేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ జమాల్ బాషా తెలిపారు. ఆయన కథనం మేరకు... కాలనీకి చెందిన రాజప్ప, రమాదేవి దంపతుల రెండో కుమారుడైన మంజునాథ్ కొడికొండ చెక్‌పోస్టులోని జంగీ డాబాలో పని చేసేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించాడు. అయితే బెంగళూరులో ఉంటున్న అతని తమ్ముడు ఈశ్వర్ మాట్లాడాలని అన్నకు ఫోన్ చేయగా స్పందన లేదు. దీంతో కాలనీకి చెందిన మరో వ్యక్తికి ఫోన్ చేయగా.. ఆయన మంజునాథ్ కోసం వారి ఇంటి వద్దకు వెళ్లాడు. అయతే ఇంటికి తాళం వేసి ఉండగా, దుర్వాసన రావడంతో అనుమానంతో కిటీకీ తెరచి చూడగా ఉరికి వేలాడుతున్నట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. -
చోరీకి యత్నం.. కాలనీవాసుల దేహశుద్ధి
చిలమత్తూరు : రాత్రి నిద్రలో ఉన్న మహిళల మెడలో గొలుసులు చోరీకి యత్నించిన ఓ వ్యక్తిని కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేసిన సంఘటన గురువారం చిలమత్తూరు ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎస్సీ కాలనీలో ఓ అద్దె గదిలో కర్ణాటక ఉదుగూరు గ్రామానికి చెందిన బాషా నివాసం ఉంటున్నాడు. ఆ గది పక్కనే ఇంట్లో నివాసం ఉంటున్న మహిళలు గత బుధవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తుండగా బాషా వారి మెడలో గొలుసులు లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే గమనించిన మహిళలు గట్టిగా అరవడంతో బాషా పరారయ్యాడు. కాగా బాషా తెల్లవారుజామున అదే కాలనీలో తిరుగుతుండగా కాలనీవాసులు పట్టుకుని విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. -
చూసొద్దాం...
సైబీరియాకు చెందిన ఎర్రకాళ్ల కొంగలు ప్రతి ఏటా క్రమం తప్పకుండా సంతానోత్పత్తికి చిలమత్తూరు మండలం వీరాపురానికి వస్తుంటాయి. ఈ ఏడాది కూడా ఆలస్యంగానైనా వందల సంఖ్యలో కొంగలు వచ్చాయి. అరుదైన ఈ కొంగల సందడి చూడాలనుకుంటే జిల్లా కేంద్రం నుంచి 124 కిటోమీటర్ల దూరం ప్రయాణించి కొడికొండ చెక్‌పోస్టు మీదుగా వీరాపురం చేరుకోవచ్చు. హిందూపురం నుంచి వచ్చే సందర్శకులు లేపాక్షి ఆలయాన్ని చూసుకుని అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చిలమత్తూరు మీదుగా వీరాపురం వెళ్లవచ్చు. అంతేకాక వీరాపురం నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఎల్లోడు గ్రామ సమీపంలో ఆదినారాయణ కొండ స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ప్రకృతి రమణీయత ఒడిలో ఈ ఆలయం సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుందనడంలో సందేహం లేదు. - చిలమత్తూరు (హిందూపురం) -
లక్కీ స్కీం ముంచింది!
- తక్కువ మొత్తానికి విలువైన వస్తువులను ఎర - డబ్బులు కట్టించుకుని ఉడాయించిన నిర్వాహకులు - ఆందోళనల్లో లబ్ధిదారులు చిలమత్తూరు : ‘తక్కువ మొత్తం.. విడతల వారీగా చెల్లిస్తే చాలు... విలువైన వస్తువులు మీ సొంతం’ అంటూ వల విసిరారు. ఇది నిజమని నమ్మిన అమాయకులకు చివరకు కుచ్చు టోపీ పెట్టారు. లక్కీ స్కీమ్ పేరుతో ప్రజలను బురిడీ కొట్టించిన ఓ సంస్థ నిలువునా ముంచి బోర్డు తిప్పేసిన ఉదంతం చిలమత్తూరులో వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు... హిందూపురం షిరిడీసాయి నగర్, శ్రీకంఠపురం, ఆర్.వి.రెడ్డి పేరుతో కొన్ని కార్డులు ముద్రించి హిందూపురం సహా పరిసర మండలాల్లోని గ్రామాల్లో లక్కీ స్కీం గురించి విస్తృత ప్రచారం చేశారు. స్కీం ఏంటంటే... మొదటి రోజు రూ.2, రెండో రోజు రూ.3, మూడో రోజు రూ.4, ఇలా రోజుకో రూపాయి వంతున పెంచుకుంటూ నెల రోజల పాటు చెల్లించాలి. మూడో రోజు డబ్బు కట్టకపోతే డ్రాలో పేరు ఉండదు. స్కీమ్ మధ్యలో ఏ కారణంగా డబ్బులు కట్టకపోతే అప్పటి వరకు కట్టిన మొత్తం వాపసు ఇచ్చేది ఉండదు. ఇదీ ఆ స్కీం కథ. రెండ్రోజులకోసారి డ్రా తీసినప్పుడు విజేతలకు విలువైన స్టీల్ సామానులు, కాపర్ డిష్ సెట్, ప్రెషర్ కుక్కర్, సీలింగ్ ఫ్యాన్, రైస్ కుక్కర్, అల్యూమినియం పాత్ర... ఇలా ఇస్తామని నమ్మ బలికారు. డ్రాలో లక్కీగా రాని వారికి నెల రోజుల్లో సామానులు ఇస్తామని మాటిచ్చారు. 1, 2, 3, 4 రూపాయాలే కదా చెల్లిద్దామనుకుని పేద, మధ్య తరగతి వర్గాల వారు వేలాది మంది ఎగబడ్డారు. నమ్మకంతో ఉంటూనే.. మొదట్లో ప్రజలను నమ్మించడానికి కొంత మందికి విలువైన సామానులను నిర్వాహకులు పంపిణీ చేశారు. ఇలా చేయడంతో మరింత మంది నమ్మి డబ్బులు కట్టేందుకు ముందుకు వచ్చారు. అంతే ఆ తరువాత స్కీమ్ నిర్వాహకులు అదృశ్యమయ్యారు. తామంతా మోసపోయామని బాధితులు గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
చిలమత్తూరు (హిందూపురం) : తాగునీటి సమస్య పరిష్కారం కోసం చిలమత్తూరు మండలం వడ్డిచెన్నంపల్లి గ్రామస్తులు శుక్రవారం రోడ్డెక్కారు. గ్రామంలో దాదాపు 160 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. తాగునీటి అవసరాలు తీర్చడానికి రెండు బోర్లు ఉన్నాయి. ఇందులో ఒకటి పూర్తిగా పాడైంది. మరొక బోరుకు మోటారు సక్రమంగా లేకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న అధికారులు ఇంతవరకూ దాని గురించి పట్టించుకోలేదు. ఓపిక నశించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన తెలిపారు. ట్యాంకరు ద్వారా నీరు ఎందుకు సరఫరా చేయలేదంటూ సర్పంచ్ శ్రీకల, కార్యదర్వి సతీష్‌ను నిలదీశారు. నూతన బోరు వేయించే వరకు కదిలేది లేదని భీష్మించారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని నచ్చజెప్పడానికి ప్రయత్నించినా గ్రామస్తులు వినలేదు. సర్పంచ్, కార్యదర్శి గ్రామ పెద్దలతో మాట్లాడి ప్రస్తుతానికి ట్యాంకర్లు పంపుతామని, వారం రోజుల్లో కొత్త బోరు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. సమస్య పరిష్కరించండి చిలమత్తూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కాలనీకి ఇంతవరకు బోరు ఏర్పాటు చేయలేదని అధికారులతో వాగ్వాదం చేశారు. కొత్త బోరు వేయిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. -
పింఛన్ల పంపిణీలో ‘గోల్మాల్’
చిలమత్తూరు : మండలంలోని వితంతు, వృద్ధాప్య, చేనేత, వికలాంగ పింఛన్ల పంపిణీలో భారీ స్థాయిలో గోల్మాల్ జరిగింది. ఈ విషయం బయటకు పొక్కకుండా డీఆర్డీఏ అధికారులు రహస్యంగా విచారిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల వ్యాప్తంగా 11 పంచాయతీల్లో 5,900 మంది పింఛన్‌దారులకు రూ.63,40,500 నెలకు పంపిణీ చేస్తున్నారు. అయితే కార్యాలయంలో పింఛన్లు పంపిణీ చేసే ఉద్యోగి అధికారులను, కార్యదర్శులను బురిడీ కొట్టించి మిగిలిన సొమ్మును వెనక్కి పంపుతున్నట్టు నమ్మిస్తూ వచ్చాడు. ఇలా మూడు నెలలుగా సుమారు రూ.7.50 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం. ఉదాహరణకు గత నెల రూ.4,70,200 మిగిలి ఉంటే జమ చేసే స్లిప్‌లో రూ.200 రాసి స్టాంప్ పడిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రాసుకునే విధానం పాటించినట్టు తెలుస్తోంది. బయట పడిందిలా సదరు ఉద్యోగి కుంభకోణం మండలంలోని దేమకేతేపల్లి పంచాయతీలో పింఛన్లు పంపిణీలో బయట పడింది. పింఛన్లు పంపిణీ చేసే కార్యదర్శి, అసిస్టెంట్ వద్ద నుంచి రూ.2 లక్షల మొత్తాన్ని పంపిణీ 10వ తేదీ వరకు జరుగుతుందని అంతలోపు ఇస్తానని బదులు తీసుకున్నాడు. పంపిణీ తేదీ ముగుస్తున్నా చెల్లించకపోతే బండారం బయట పడింది. దీంతో గత నెలల నుంచి బ్యాంకుకు సరిగా చెల్లించాడా లేదా అని రసీదు, స్టేట్మెంట్లు తీసుకుని ఆరా తీస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు రోజులుగా సదరు ఉద్యోగి కార్యాలయానికి రావడం లేదు. దీనిపై డీఆర్డీఏ అధికారులు రహస్యంగా కార్యాలయానికి వచ్చి వారం రోజుల క్రితం విచారణ చేపట్టినట్లు తెలిసింది. కొసమెరుపు సదురు ఉద్యోగి స్థానిక ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన పొందిన ప్రధానోపాధ్యాయుడికి సంబంధించిన రెండు నెలల జీతం కూడా డ్రా చేయడం విడ్డూరం. అధికారులు విచారణలో ఉద్యోగి రూ.లక్ష కట్టినట్లు సమాచారం. -
కరుణించు లక్ష్మీనారసింహా..
చిలమత్తూరు : కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన బ్రహ్మ రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. భక్తుల గోవింద నామస్మరణతో చిలమత్తూరు పులకించిపోయింది. మధ్యాహ్నం 1.45 గంటలకు రథోత్సవాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. -
చిలమత్తూరులో క్యాంపు రాజకీయం
హిందూపురం అర్బన్ : హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో చెలరేగిన అసమ్మతి జ్వాలలు చిలమత్తూరు, లేపాక్షి మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈరెండు మండలాల ఎంపీపీలు ఎమ్మెల్యే పీఏ శేఖర్‌కు మద్దతుగా నిల్వడంతో అతడి అవినీతిలో వీరికి భాగముందని అసమ్మతి టీడీపీ నాయకులు వీరిపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో చిలమత్తూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. చిలమత్తూరు ఎంపీపీ నౌజియాబానుతో మండలంలో 15 మంది ఎంపీటీసీలు ఉండగా వీరిలో 11 మంది ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే రాజకీయ పరిణామాలతో ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఎంపీటీసీలు కొందరు జారిపోయే అవకాశం ఉండటంతో ఎంపీపీ మరిది అన్సార్ ఎంపీటీసీల మద్దతును కూడగట్టుకుని బలంగా ఉన్నట్లు నిరూపించుకోవడానికి క్యాంపు రాజకీయానికి తెరలేపుతున్నారు. తనకు మద్దతుగా ఉన్న ఎంపీటీసీలందరినీ చిత్తూరు జిల్లా పీఏ శేఖర్ స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లి సమీపంలోకి రెండు, మూడురోజుల్లో తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసున్నట్లు తెలిసింది. కాగా జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి ప్రెస్మీట్లో రెండున్నరేళ్లు పాలన పూర్తి చేసిన నౌజియాబానును తొలగించి మరొకరికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానానికి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చిన తర్వాత పార్టీ ఎంపీటీసీలందరూ తనకు అనుకూలంగా ఉన్నట్లు చూపించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే రీతిలో లేపాక్షి ఎంపీపీ హనోక్‌కు రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్నారని అక్కడ కూడా మార్చాలని కొందరు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదేరీతిలో వీరిని కూడా క్యాంపు రాజకీయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
మదగలమ్మకు ప్రత్యేక హోమాలు
చిలమత్తూరు : స్థానిక ఎస్సీ కాలనీలో వెలసిన మదగలమ్మకు శుక్రవారం ప్రత్యేక హోమాలు జరిగాయి. అర్చకులు లక్ష్మీనరసింహప్రసాద్, కిశోర్‌శర్మ, మంజునాథ్ ¶కలశపూజ, పంచామృతాభిషేకాలు, దేవిమూల మంత్రహోమాలు, పూర్ణాహుతి, కుంభాభిషేకం, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం అన్నదాన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు కదిరెప్ప, లక్ష్మీనరసప్ప, సత్యనారాయణ, కదిరెప్ప తదితరులు తెలిపారు. -
31 మద్యం బాటిళ్ల స్వాధీనం
హిందూపురం రూరల్ : చిలమత్తూరు మండలంలో బెల్టుషాపులపై దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు 31 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు హిందూపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రతాప్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. డోరనాలపల్లిలో బెల్టుషాపు నిర్వహిస్తున్న పాపన్న వద్ద 10 మద్యం బాటిళ్లు, నల్లరాళ్లపల్లిలో 10, చిలమత్తూరులో 11 బాటిళ్లు పట్టుకున్నట్టు వివరించారు. గ్రామాల్లో అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్ సీఐతో పాటు ఎస్ఐ రామన్న గౌడ్, కానిస్టేబుల్ వెంకటేషులు, గోపాల్ నాయక్ పాల్గొన్నారు. -
హంద్రీనీవా కాలువ నిర్మాణానికి సర్వే
చిలమత్తూరు : మండలంలోని దేమకేతేపల్లి, డి.గొల్లపల్లి, బ్రహ్మేశ్వరంపల్లి, గాడ్రాళ్లపల్లి, కొర్లకుంట గ్రామాల పరిసరాల్లో హంద్రీనీవా కాలువ నిర్మాణానికి శుక్రవారం హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు ఇంజనీర్లు యోగానంద్, సుధాకర్, కాంట్రాక్టు సిబ్బంది సుదర్శన్, సతీష్, గౌతమ్ సర్వే నిర్వహించారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే సర్వే పనులు చేయాలని రైతులు చిన్నప్ప, నాగరాజు, మంజునాథ్, బాలాజీరావు, శంకరప్ప, సంజీవరెడ్డి, అశ్వర్థ తదితరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పనులు చేస్తున్నామని.. పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. మడకశిర నుంచి దేమకేతేపల్లి పంచాయతీలోని గ్రామాల వరకు 53 కిలోమీటర్ల కాలువ నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన 4 కిలోమీటర్ల కాలువ పనులకు సర్వే చేస్తున్నామని అధికారులు వివరించారు. 25 మంది రైతులకు నష్టపరిహారం పంపిణీ కాలేదన్నారు. ఎకరానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం లెక్కించి ఎన్ని సెంట్లు భూమి కాలువకు పోతుందో అంత పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాగా స్థానిక నాయకులు కల్పించుకుని కాలువ నిర్మాణాలకు సహకరించాలని కోరారు. తహశీల్దార్ ఇబ్రహీంసాబ్, ఎంపీపీ నౌజియాబాను తదితరులు కాలువ సర్వే పనులను ప్రారంభించారు. -
ఎక్కడికెళ్లాలో..
చిలమత్తూరు : చిలమత్తూరు మండలం యగ్నిశెట్టిపల్లికి చెందిన గంగమ్మ, నరసింహప్ప కుమారుడు అంజప్ప దివ్యాంగుడు. ఇతన పింఛన్ మొత్తం ఈ నెల బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఏ బ్యాంకులో జమ చేశారో మాత్రం తెలీదు. పంచాయతీ కార్యదర్శిని అడుగుదామంటే అందుబాటులో లేరు. దీంతో అతన్ని తల్లి గంగమ్మ శుక్రవారం ఇలా ఈడ్చే బండిపై మండల కేంద్రానికి తీసుకొచ్చింది. అయితే.. ఏ బ్యాంకుకు వెళ్లాలి.. పింఛన్ ఎక్కడ తీసుకోవాలి.. ఏయే ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలనే అంశాలు తెలియక తల్లి, కుమారుడు రోడ్లన్నీ తిరిగారు. దిక్కుతోచక చివరకు నిరాశతో స్వగ్రామానికి పయనమయ్యారు. ‘ఇంతకుముందు దేమకేతేపల్లికి వెళ్లి కార్యదర్శి చేతుల మీదుగా పింఛన్ తీసుకునేవాళ్లం. ఇప్పుడు బ్యాంకులో ఇస్తారంట. ఎక్కడిస్తారో మాత్రం తెలీదు. ఈ పద్ధతులేంటో మాకు అర్థం కావడం లేద’ని గంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నోట్ల రద్దు తర్వాత అన్ని వర్గాలఽతో పాటు దివ్యాంగులూ నానా అవస్థలు పడుతున్నారనడానికి ఈ సంఘటనే నిదర్శనం. -
అనారోగ్యంతో విశ్రాంత ఎంపీడీఓ మృతి
చిలమత్తూరు : మండలంలోని విశ్రాంత ఎంపీడీఓ రామారావు (72) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వ్యాధి తీవ్రత ఎక్కువై మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ రామారావు ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీఓగా రామారావు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నవీన్‌నిశ్చల్‌తో పాటు కన్వీనర్ సదాశివారెడ్డి, నాయకులు రంగారెడ్డి, నాగిరెడ్డి, రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి, నస్రూ, వెంకటేష్, రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. -
గుర్తింపు కార్డుల పంపిణీ
చిలమత్తూరు : నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం కన్వీనర్ ఎం.సదాశివారెడ్డి, సర్పంచ్ శ్రీకళ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేయడంతో పాటు, పార్టీ ఆశయాల సాధన కు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల వ్యాప్తంగా 965 మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు కార్డులు రాగా తొలివిడతగా 750 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రామచంద్రప్ప, నరసారెడ్డి, బాబురెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటేష్, గంగరాజు తదితరులు ఉన్నారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
చిలమత్తూరు : గురుకుల పాఠశాలల్లో బ్యాక్లాగ్ కేటగిరీకి సంబంధించిన 6,7,8, తరగతులకు చెందిన విద్యార్థులకు స్థానిక టేకులోడు గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. పేరూరు, పెన్నహోబిళం, నసనకోట, టేకులోడు, లేపాక్షి ప్రాంతాల పరిధిలోని 52 సీట్ల కోసం 177 మంది హాజరు కావాల్సి ఉండగా 162 మంది హాజరయ్యారు. ఫలితాలు రెండు రోజుల్లో వెల్లడించనున్నట్టు ప్రిన్సిపల్ వివరించారు. -
కన్నీటి కష్టాలు
చిలమత్తూరు : స్థానిక కేజీబీవీ (కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల)లో తాగునీటి ఎద్దడి నెలకొంది. పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థినులు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన బోరుకు సంబంధించిన మోటార్లు రెండు రోజుల క్రితం కాలిపోవడంతో సమస్య తలెత్తింది. దీంతో విద్యార్థులు నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. పాఠశాల ఎదురుగా ఉన్న ఇటుకల ఫ్యాక్టరీలోని బోరు వద్దకు వెళ్లి బిందెలు, బకెట్లతో నీరు తెచ్చుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే మోటారుకు మరమ్మతులు చేయించి నీటి సమస్య తీర్చాలని విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఇష్టారాజ్యంగా విద్యుత్ చౌర్యం
– అనధికారంగా విద్యుత్ కనెక్షన్లు.. అక్రమ వసూళ్లు – రూ.వేలు చెల్లించినా రశీదులు ఇవ్వని వైనం – లైన్ ఇన్స్పెక్టర్ నిర్వాకం చిలమత్తూరు : మండల కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయంలో ట్రాన్స్ కో ఉద్యోగి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి రశీదులు చెల్లించకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. వివరాలు.. మండలంలోని వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురం, భూపసముద్రం గ్రామాలకు చెందిన పలువురు రైతులతో ఆ ఉద్యోగి అనధికారంగా రూ.వేలు వసూలు చేశారు. వారికి ఎలాంటి రశీదులు, సర్వీసు నంబర్లు ఇవ్వలేదు. హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన పురుషోత్తం, శోభ వద్ద రూ.75 వేలు, నాగభూషణరెడ్డితో రూ.40 వేలు, రామాంజితో రూ.24 వేలు, గంగప్పతో రూ.25 వేలు, నరసిరెడ్డితో రూ.25 వేలు వసూలు చేశారు. అదేవిధంగా భూపసముద్రం గ్రామానికి చెందిన పోస్టు శివారెడ్డి వద్ద రూ.40 వేలు, నారాయణస్వామి, రామప్ప, గంగిరెడ్డి, బి.గంగప్ప, ఆదినారాయణ, నాగభూషణరెడ్డి తదితరులతో రూ.25 వేలకు పైగా వసూళ్లు చేసి ఎలాంటి రశీదులు ఇవ్వలేదు. దీంతో సుమారు రెండు నెలలు గడిచినా ఇంతవరకు సర్వీసు కనెక్షన్లకు నంబర్లు కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న లైన్ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. సర్వీసు నంబర్లు ఇవ్వలేదు : రైతు నరసింహారెడ్డి బోరు కింద విద్యుత్ క¯ð క్షన్ కోసం కుమారుడు గంగిరెడ్డి పేరు మీద రూ.23 వేలు చెల్లించాను. దీనికి సంబంధించిన ఎలాంటి రశీదులు, సర్వీసు నంబర్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఇదెక్కడి న్యాయం. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం : ప్రభాకర్, విద్యుత్ శాఖ ఏఈ హెచ్‌వీడీఎస్ పథకం కింద లోఓల్టేజీ సమస్య పరిష్కరించడం కోసం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా వీరాపురం పంచాయతీ హుస్సేన్‌పురం, భూపసముద్రం గ్రామాలకు చెందిన రైతుల వద్ద అనధికారికంగా అక్రమ వసూళ్లు చేసినట్లు రైతుల వద్ద నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం.