హిందూపురం అర్బన్ : హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో చెలరేగిన అసమ్మతి జ్వాలలు చిలమత్తూరు, లేపాక్షి మండలాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈరెండు మండలాల ఎంపీపీలు ఎమ్మెల్యే పీఏ శేఖర్‌కు మద్దతుగా నిల్వడంతో అతడి అవినీతిలో వీరికి భాగముందని అసమ్మతి టీడీపీ నాయకులు వీరిపై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో చిలమత్తూరులో రాజకీయం రసవత్తరంగా మారింది.
చిలమత్తూరు ఎంపీపీ నౌజియాబానుతో మండలంలో 15 మంది ఎంపీటీసీలు ఉండగా వీరిలో 11 మంది ఎంపీటీసీల మద్దతుతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే రాజకీయ పరిణామాలతో ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఎంపీటీసీలు కొందరు జారిపోయే అవకాశం ఉండటంతో ఎంపీపీ మరిది అన్సార్ ఎంపీటీసీల మద్దతును కూడగట్టుకుని బలంగా ఉన్నట్లు నిరూపించుకోవడానికి క్యాంపు రాజకీయానికి తెరలేపుతున్నారు. తనకు మద్దతుగా ఉన్న ఎంపీటీసీలందరినీ చిత్తూరు జిల్లా పీఏ శేఖర్ స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లి సమీపంలోకి రెండు, మూడురోజుల్లో తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసున్నట్లు తెలిసింది.
కాగా జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణరెడ్డి ప్రెస్‌మీట్‌లో రెండున్నరేళ్లు పాలన పూర్తి చేసిన నౌజియాబానును తొలగించి మరొకరికి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానానికి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చిన తర్వాత పార్టీ ఎంపీటీసీలందరూ తనకు అనుకూలంగా ఉన్నట్లు చూపించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే రీతిలో లేపాక్షి ఎంపీపీ హనోక్‌కు రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్నారని అక్కడ కూడా మార్చాలని కొందరు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదేరీతిలో వీరిని కూడా క్యాంపు రాజకీయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
చిలమత్తూరులో క్యాంపు రాజకీయం
Published Wed, Feb 8 2017 11:30 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement