చిలమత్తూరు : మండలంలోని వితంతు, వృద్ధాప్య, చేనేత, వికలాంగ పింఛన్ల పంపిణీలో భారీ స్థాయిలో గోల్‌మాల్ జరిగింది. ఈ విషయం బయటకు పొక్కకుండా డీఆర్‌డీఏ అధికారులు రహస్యంగా విచారిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల వ్యాప్తంగా 11 పంచాయతీల్లో 5,900 మంది పింఛన్‌దారులకు రూ.63,40,500 నెలకు పంపిణీ చేస్తున్నారు. అయితే కార్యాలయంలో పింఛన్లు పంపిణీ చేసే ఉద్యోగి అధికారులను, కార్యదర్శులను బురిడీ కొట్టించి మిగిలిన సొమ్మును వెనక్కి పంపుతున్నట్టు నమ్మిస్తూ వచ్చాడు. ఇలా మూడు నెలలుగా సుమారు రూ.7.50 లక్షలు స్వాహా చేసినట్లు సమాచారం. ఉదాహరణకు గత నెల రూ.4,70,200 మిగిలి ఉంటే జమ చేసే స్లిప్‌లో రూ.200 రాసి స్టాంప్ పడిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రాసుకునే విధానం పాటించినట్టు తెలుస్తోంది.
బయట పడిందిలా
సదరు ఉద్యోగి కుంభకోణం మండలంలోని దేమకేతేపల్లి పంచాయతీలో పింఛన్లు పంపిణీలో బయట పడింది. పింఛన్లు పంపిణీ చేసే కార్యదర్శి, అసిస్టెంట్ వద్ద నుంచి రూ.2 లక్షల మొత్తాన్ని పంపిణీ 10వ తేదీ వరకు జరుగుతుందని అంతలోపు ఇస్తానని బదులు తీసుకున్నాడు. పంపిణీ తేదీ ముగుస్తున్నా చెల్లించకపోతే బండారం బయట పడింది. దీంతో గత నెలల నుంచి బ్యాంకుకు సరిగా చెల్లించాడా లేదా అని రసీదు, స్టేట్‌మెంట్‌లు తీసుకుని ఆరా తీస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు రోజులుగా సదరు ఉద్యోగి కార్యాలయానికి రావడం లేదు. దీనిపై డీఆర్‌డీఏ అధికారులు రహస్యంగా కార్యాలయానికి వచ్చి వారం రోజుల క్రితం విచారణ చేపట్టినట్లు తెలిసింది.
కొసమెరుపు
సదురు ఉద్యోగి స్థానిక ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన పొందిన ప్రధానోపాధ్యాయుడికి సంబంధించిన రెండు నెలల జీతం కూడా డ్రా చేయడం విడ్డూరం. అధికారులు విచారణలో ఉద్యోగి రూ.లక్ష కట్టినట్లు సమాచారం.
పింఛన్ల పంపిణీలో ‘గోల్‌మాల్’
Published Tue, Mar 28 2017 11:13 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
Advertisement
Advertisement