ఇష్టారాజ్యంగా విద్యుత్ చౌర్యం
– అనధికారంగా విద్యుత్ కనెక్షన్లు.. అక్రమ వసూళ్లు
– రూ.వేలు చెల్లించినా రశీదులు ఇవ్వని వైనం
– లైన్ ఇన్‌స్పెక్టర్ నిర్వాకం
చిలమత్తూరు : మండల కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయంలో ట్రాన్స్ కో ఉద్యోగి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి రశీదులు చెల్లించకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. వివరాలు.. మండలంలోని వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురం, భూపసముద్రం గ్రామాలకు చెందిన పలువురు రైతులతో ఆ ఉద్యోగి అనధికారంగా రూ.వేలు వసూలు చేశారు. వారికి ఎలాంటి రశీదులు, సర్వీసు నంబర్లు ఇవ్వలేదు.
హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన పురుషోత్తం, శోభ వద్ద రూ.75 వేలు, నాగభూషణరెడ్డితో రూ.40 వేలు, రామాంజితో రూ.24 వేలు, గంగప్పతో రూ.25 వేలు, నరసిరెడ్డితో రూ.25 వేలు వసూలు చేశారు. అదేవిధంగా భూపసముద్రం గ్రామానికి చెందిన పోస్టు శివారెడ్డి వద్ద రూ.40 వేలు, నారాయణస్వామి, రామప్ప, గంగిరెడ్డి, బి.గంగప్ప, ఆదినారాయణ, నాగభూషణరెడ్డి తదితరులతో రూ.25 వేలకు పైగా వసూళ్లు చేసి ఎలాంటి రశీదులు ఇవ్వలేదు. దీంతో సుమారు రెండు నెలలు గడిచినా ఇంతవరకు సర్వీసు కనెక్షన్లకు నంబర్లు కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న లైన్ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
సర్వీసు నంబర్లు ఇవ్వలేదు : రైతు నరసింహారెడ్డి
బోరు కింద విద్యుత్ క¯ð క్షన్ కోసం కుమారుడు గంగిరెడ్డి పేరు మీద రూ.23 వేలు చెల్లించాను. దీనికి సంబంధించిన ఎలాంటి రశీదులు, సర్వీసు నంబర్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఇదెక్కడి న్యాయం. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం : ప్రభాకర్, విద్యుత్ శాఖ ఏఈ
హెచ్‌వీడీఎస్ పథకం కింద లోఓల్టేజీ సమస్య పరిష్కరించడం కోసం ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా వీరాపురం పంచాయతీ హుస్సేన్‌పురం, భూపసముద్రం గ్రామాలకు చెందిన రైతుల వద్ద అనధికారికంగా అక్రమ వసూళ్లు చేసినట్లు రైతుల వద్ద నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం.