vidyut theft
-
విద్యుత్ చౌర్యంపై విస్తృత దాడులు
అనంతపురం అగ్రికల్చర్: విద్యుత్ అక్రమ వాడకం (చౌర్యం)పై సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆకస్మిక దాడులు కొనసాగించినట్లు ఎస్పీడీసీఎల్ తిరుపతి జోన్ విజిలెన్స్ ఎస్ఈ వి.రవి, ఎస్పీ మనోహర్‌రావు, జిల్లా ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎస్ఈ కార్యాలయ అతిథి గృహంలో విజిలెన్స్ డీఈ జయరాజ్, టౌన్ ఏడీఈ శ్రీనివాసులుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. విజిలెన్స్ జేఎండీ ఉమాపతి, సీఎండీ హెచ్‌వై దొర ఆదేశాల మేరకు విద్యుత్ ఎక్కువగా వాడుతున్న శింగనమల, చెన్నేకొత్తపల్లి, గార్లదిన్నె, మడకశిర, అమరాపురం, రాప్తాడు, గుంతకల్లు రూరల్, గుత్తి రూరల్, యల్లనూరు, తాడిపత్రి రూరల్, తలుపుల మండలాల్లో అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన విద్యుత్ అధికారులు దాడులు చేశారన్నారు. మీటర్ ఉండి బైపాస్ ద్వారా అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్న వారు 157 మంది, మీటర్ లేకుండా కొక్కీలు తగిలించుకుని వాడుతున్న వారు 240 మంది, గృహ విద్యుత్ కనెక్షన్ ద్వారా వ్యాపార అవసరాలకు వాడుతున్న వారు 13 మంది, మీటర్ అవతకతవకలకు సంబంధించి ఆరు మంది, అధిక లోడుకు సంబంధించి 36 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. మొత్తం 11 మండలాల పరిధిలో 452 మందిపై కేసులు నమోదు చేసి రూ.22.42 లక్షలు అపరాధ రుసుం విధించామన్నారు. విద్యుత్‌ను అక్రమంగా ఎవరు వాడినా వదలిపెట్టేది లేదని తెలిపారు. మొదటి సారి పట్టుబడితే అపరాధ రుసుంతో సరిపెడతామని, రెండో సారి దొరికితే మాత్రం అరెస్టులు, రిమాండ్లు కూడా ఉంటాయని హెచ్చరించారు. భవిష్యత్తులో మూకుమ్మడిగా దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
ఇష్టారాజ్యంగా విద్యుత్ చౌర్యం
– అనధికారంగా విద్యుత్ కనెక్షన్లు.. అక్రమ వసూళ్లు – రూ.వేలు చెల్లించినా రశీదులు ఇవ్వని వైనం – లైన్ ఇన్స్పెక్టర్ నిర్వాకం చిలమత్తూరు : మండల కేంద్రంలోని ట్రాన్స్‌కో కార్యాలయంలో ట్రాన్స్ కో ఉద్యోగి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి రశీదులు చెల్లించకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిపారు. వివరాలు.. మండలంలోని వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురం, భూపసముద్రం గ్రామాలకు చెందిన పలువురు రైతులతో ఆ ఉద్యోగి అనధికారంగా రూ.వేలు వసూలు చేశారు. వారికి ఎలాంటి రశీదులు, సర్వీసు నంబర్లు ఇవ్వలేదు. హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన పురుషోత్తం, శోభ వద్ద రూ.75 వేలు, నాగభూషణరెడ్డితో రూ.40 వేలు, రామాంజితో రూ.24 వేలు, గంగప్పతో రూ.25 వేలు, నరసిరెడ్డితో రూ.25 వేలు వసూలు చేశారు. అదేవిధంగా భూపసముద్రం గ్రామానికి చెందిన పోస్టు శివారెడ్డి వద్ద రూ.40 వేలు, నారాయణస్వామి, రామప్ప, గంగిరెడ్డి, బి.గంగప్ప, ఆదినారాయణ, నాగభూషణరెడ్డి తదితరులతో రూ.25 వేలకు పైగా వసూళ్లు చేసి ఎలాంటి రశీదులు ఇవ్వలేదు. దీంతో సుమారు రెండు నెలలు గడిచినా ఇంతవరకు సర్వీసు కనెక్షన్లకు నంబర్లు కూడా ఇవ్వలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న లైన్ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. సర్వీసు నంబర్లు ఇవ్వలేదు : రైతు నరసింహారెడ్డి బోరు కింద విద్యుత్ క¯ð క్షన్ కోసం కుమారుడు గంగిరెడ్డి పేరు మీద రూ.23 వేలు చెల్లించాను. దీనికి సంబంధించిన ఎలాంటి రశీదులు, సర్వీసు నంబర్లు ఇంతవరకు ఇవ్వలేదు. ఇదెక్కడి న్యాయం. అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం : ప్రభాకర్, విద్యుత్ శాఖ ఏఈ హెచ్‌వీడీఎస్ పథకం కింద లోఓల్టేజీ సమస్య పరిష్కరించడం కోసం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా వీరాపురం పంచాయతీ హుస్సేన్‌పురం, భూపసముద్రం గ్రామాలకు చెందిన రైతుల వద్ద అనధికారికంగా అక్రమ వసూళ్లు చేసినట్లు రైతుల వద్ద నుంచి ఫిర్యాదు అందింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతాం.