విద్యుత్ చౌర్యంపై విస్తృత దాడులు
అనంతపురం అగ్రికల్చర్: విద్యుత్ అక్రమ వాడకం (చౌర్యం)పై సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్) విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆకస్మిక దాడులు కొనసాగించినట్లు ఎస్పీడీసీఎల్ తిరుపతి జోన్ విజిలెన్స్ ఎస్‌ఈ వి.రవి, ఎస్పీ మనోహర్‌రావు, జిల్లా ఎస్‌ఈ ఆర్‌ఎన్ ప్రసాదరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎస్‌ఈ కార్యాలయ అతిథి గృహంలో విజిలెన్స్ డీఈ జయరాజ్, టౌన్ ఏడీఈ శ్రీనివాసులుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
విజిలెన్స్ జేఎండీ ఉమాపతి, సీఎండీ హెచ్‌వై దొర ఆదేశాల మేరకు విద్యుత్ ఎక్కువగా వాడుతున్న శింగనమల, చెన్నేకొత్తపల్లి, గార్లదిన్నె, మడకశిర, అమరాపురం, రాప్తాడు, గుంతకల్లు రూరల్, గుత్తి రూరల్, యల్లనూరు, తాడిపత్రి రూరల్, తలుపుల మండలాల్లో అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన విద్యుత్ అధికారులు దాడులు చేశారన్నారు. మీటర్ ఉండి బైపాస్ ద్వారా అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్న వారు 157 మంది, మీటర్ లేకుండా కొక్కీలు తగిలించుకుని వాడుతున్న వారు 240 మంది, గృహ విద్యుత్ కనెక్షన్ ద్వారా వ్యాపార అవసరాలకు వాడుతున్న వారు 13 మంది, మీటర్ అవతకతవకలకు సంబంధించి ఆరు మంది, అధిక లోడుకు సంబంధించి 36 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
మొత్తం 11 మండలాల పరిధిలో 452 మందిపై కేసులు నమోదు చేసి రూ.22.42 లక్షలు అపరాధ రుసుం విధించామన్నారు. విద్యుత్‌ను అక్రమంగా ఎవరు వాడినా వదలిపెట్టేది లేదని తెలిపారు. మొదటి సారి పట్టుబడితే అపరాధ రుసుంతో సరిపెడతామని, రెండో సారి దొరికితే మాత్రం అరెస్టులు, రిమాండ్‌లు కూడా ఉంటాయని హెచ్చరించారు. భవిష్యత్తులో మూకుమ్మడిగా దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.