![Many government properties were destroyed](/styles/webp/s3/article_images/2024/06/15/attacks.jpg.webp?itok=ujOuOFo_)
పలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం
జేసీబీతో జగనన్న లేఔట్‌లో విధ్వంసం
శిలాఫలకాలను పగలకొట్టిన టీడీపీ కార్యకర్తలు
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన దాష్టీకాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో అధికార మత్తుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ ఆస్తులను, అభివృద్ధి పథకాల శిలాఫలకాలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ విధ్వంసం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పలుచోట్ల విధ్వంసానికి దిగారు.
అనంతపురం రూరల్ మండలం రాచానపల్లిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వీటి పక్కనే ఉన్న జగనన్న పాలవెల్లువ ‘నేమ్ బోర్డు’ను తొలగించారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెర్వు గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని పగులకొట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల సచివాలయం, ఆర్‌బీకే, హెల్త్ క్లినిక్ భవనాలపై దాష్టీకానికి పాల్పడ్డారు.
వైఎస్సార్ హెల్త్‌క్లినిక్ పేరుతో వేసిన శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకపాటి విక్రమ్‌రెడ్డి చిత్రాలను బండరాయితో తుడిచే ప్రయత్నం చేశారు. రైతు భరోసా కేంద్రం, సచివాలయం భవనాలకు ఉన్న కిటికీ అద్దాలను పగులగొట్టారు. అలాగే ఏఎస్‌పేట మండలం చౌటభీమవరంలో జగనన్న లేఔట్‌ను టీడీపీ నాయకుడు రాంబాబు జేసీబీతో తవ్వేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో సచివాలయాలు, ఆర్‌బీకే భవనాల శిలాఫలకాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. కీలపల్లిలో గ్రామ సచివాలయం, ఆర్‌బీకే భవనాలకు అమర్చిన శిలాఫలకాలు, బోర్డు దిమ్మెలను గునపాలు, సమ్మెటతో పగులకొట్టారు.
అలాగే గండ్రాజుపల్లి పంచాయతీ ఆలకుప్పంలో బీఎంసీ సెంటర్‌కు అమర్చిన శిలాఫలకాన్ని ఆ గ్రామ టీడీపీ నాయకులు తొలగించారు. శ్రీరంగరాజపురం మండలం నెలవాయి సచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ వద్ద, జీఎంఆర్ పురం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నవరత్నాలు, డిజిటల్ లైబ్రరీ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల మెట్ట సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment