గుడిసె దేవానంద్‌ను అరెస్టు చేయాలి | want to arrest Director of SC Corporation Gudise Devanand | Sakshi
Sakshi News home page

గుడిసె దేవానంద్‌ను అరెస్టు చేయాలి

Published Tue, Oct 17 2017 7:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:59 PM

want to arrest Director of SC Corporation Gudise Devanand - Sakshi

ఎస్పీ అశోక్‌కుమార్‌కు వినతి పత్రం ఇస్తున్న జర్నలిస్టు నాయకులు

అనంతపురం సెంట్రల్‌: కదిరి సాక్షి విలేకరి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గుడిసె దేవానంద్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టి రక్షణ కల్పించాలని కోరారు. జిల్లా కేంద్రంతో పాటు బత్తలపల్లి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, మడకశిర, నల్లమాడ, పుట్టపర్తి, పెనుకొండ, రాయదుర్గం, ఆత్మకూరు, రాప్తాడు, పుట్లూరు, ఉరవకొండ తదితర మండాల్లోనూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. రాస్తారోకో, ర్యాలీలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగి4ంది. ఈ సందర్భంగా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించే జర్నలిస్టులపై దాడులు బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. పోలీసులు కూడా బాధ్యులను వెంటను అరెస్టు చేసి విలేకరులకు రక్షణ కల్పించాలన్నారు.

ఏపీడబ్లూజేఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు తలారి రామాంజనేయులు మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులను వార్తగా రాయడం నేరమా అని ప్రశ్నించారు. సదరు వార్తతో ఏమైనా ఇబ్బందులుంటే న్యాయబద్ధంగా పరిష్కరించుకోవాలన్నారు. అంతేకానీ హత్యాయత్నాలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. జాప్‌ జిల్లా అధ్యక్షుడు ఆజాద్‌ మాట్లాడుతూ గుడిసె దేవానంద్‌ను వెంటనే అరెస్టు చేసి జర్నలిస్టుల్లో మనోధైర్యం నింపాలన్నారు. ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు మారుతి మాట్లాడుతూ.. గుడిసె దేవానంద్‌కు నేరచరిత్ర ఉందని, రాష్ట్ర డైరెక్టర్‌ హోదాలో ఉన్నప్పటికీ ఆయన వ్యవహార శైలి మారలేదన్నారు. ఇలాంటి వ్యక్తులను అరెస్టు చేసే విషయంలో పోలీసులు ఎంతమాత్రం ఉపేక్షించరాదన్నారు. నిరసన కార్యక్రమంలో వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు రామ్మూర్తి, ఫోటోగ్రాఫర్స్‌ జిలాన్, ప్రసాద్, చిన్నపత్రికల సంఘం నాయకులు చౌడప్ప తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీకి జర్నలిస్టు ఫోరం నాయకుల వినతి
గుడిసె దేవానంద్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ జర్నలిస్టు ఫోరం నాయకులు డిమాండ్‌ చేశారు. ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ను ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement