తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
చిలమత్తూరు (హిందూపురం) : తాగునీటి సమస్య పరిష్కారం కోసం చిలమత్తూరు మండలం వడ్డిచెన్నంపల్లి గ్రామస్తులు శుక్రవారం రోడ్డెక్కారు. గ్రామంలో దాదాపు 160 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. తాగునీటి అవసరాలు తీర్చడానికి రెండు బోర్లు ఉన్నాయి. ఇందులో ఒకటి పూర్తిగా పాడైంది. మరొక బోరుకు మోటారు సక్రమంగా లేకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న అధికారులు ఇంతవరకూ దాని గురించి పట్టించుకోలేదు. ఓపిక నశించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన తెలిపారు.
ట్యాంకరు ద్వారా నీరు ఎందుకు సరఫరా చేయలేదంటూ సర్పంచ్ శ్రీకల, కార్యదర్వి సతీష్‌ను నిలదీశారు. నూతన బోరు వేయించే వరకు కదిలేది లేదని భీష్మించారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని నచ్చజెప్పడానికి ప్రయత్నించినా గ్రామస్తులు వినలేదు. సర్పంచ్, కార్యదర్శి గ్రామ పెద్దలతో మాట్లాడి ప్రస్తుతానికి ట్యాంకర్లు పంపుతామని, వారం రోజుల్లో కొత్త బోరు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనుదిరిగారు.
సమస్య పరిష్కరించండి
చిలమత్తూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కాలనీకి ఇంతవరకు బోరు ఏర్పాటు చేయలేదని అధికారులతో వాగ్వాదం చేశారు. కొత్త బోరు వేయిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.