people strikes
-
పాఠశాలకు తాళం
రాంపురం (పెనుకొండ రూరల్) : గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు తాళం వేసి రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ పాఠశాలలో 140 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడన్నారు. ఒక్కరే విద్యార్థులకు బోధించలేకపోతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో పిల్లలు పాఠశాలలో చేరడం లేదని మండిపడ్డారు. విద్యార్థులు లేక పాఠశాలలు మూతపడుతుండగా, తమ గ్రామంలో విద్యార్థులు ఉన్నా ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడే దుస్థితి వచ్చిందని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు మహిధర్ ఒక్కడే ఉండడం వల్ల విద్యార్థులకు టీసీలు, నూతన విద్యార్థులను చేర్చుకోవడం తదితర వాటితో విద్యార్థులకు బోధన దూరం అవుతోందన్నారు. ఉపాధ్యాయులను నియమించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరారు. లేకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామన్నారు. -
మాగోడు పట్టించుకోరా !
హిందూపురం అర్బన్ : ‘తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా అధికారులు మాగోడు పట్టించుకోరా’ అని కొట్నూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం వారు పెనుకొండ రహదారిలో ఖాళీబిందెలతో బైఠాయించి నీళ్లు కావాలంటూ నినాదాలు చేశారు. అధికారులు సమస్య తీర్చే వరకూ కదలమంటూ భీష్మించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, కౌన్సిలర్ దాదాపీర్ వారికి మద్దతుగా నిలిచారు. రోడ్డుపై బైఠాయించడంతో పెనుకొండ రహదారి, కొట్నూరుకట్టపై పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు గ్రామస్తులకు సర్ధిచెప్పడానికి ప్రయత్నించారు. నీళ్లు ఇవ్వనిదే తాము వెళ్లేదిలేదని తేల్చి చెప్పారు. దీంతో మున్సిపల్ డీఈ వన్నూరుస్వామి అక్కడికి చేరుకుని కోట్నూరు ప్రాంతంలో అవసరమైన నీటిని ట్యాంకర్ల ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు శాంతించి రాస్తారోకో విరమించారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు
చిలమత్తూరు (హిందూపురం) : తాగునీటి సమస్య పరిష్కారం కోసం చిలమత్తూరు మండలం వడ్డిచెన్నంపల్లి గ్రామస్తులు శుక్రవారం రోడ్డెక్కారు. గ్రామంలో దాదాపు 160 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. తాగునీటి అవసరాలు తీర్చడానికి రెండు బోర్లు ఉన్నాయి. ఇందులో ఒకటి పూర్తిగా పాడైంది. మరొక బోరుకు మోటారు సక్రమంగా లేకపోవడంతో నీటి ఎద్దడి నెలకొంది. ట్యాంకరు ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న అధికారులు ఇంతవరకూ దాని గురించి పట్టించుకోలేదు. ఓపిక నశించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన తెలిపారు. ట్యాంకరు ద్వారా నీరు ఎందుకు సరఫరా చేయలేదంటూ సర్పంచ్ శ్రీకల, కార్యదర్వి సతీష్‌ను నిలదీశారు. నూతన బోరు వేయించే వరకు కదిలేది లేదని భీష్మించారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని నచ్చజెప్పడానికి ప్రయత్నించినా గ్రామస్తులు వినలేదు. సర్పంచ్, కార్యదర్శి గ్రామ పెద్దలతో మాట్లాడి ప్రస్తుతానికి ట్యాంకర్లు పంపుతామని, వారం రోజుల్లో కొత్త బోరు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. సమస్య పరిష్కరించండి చిలమత్తూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కాలనీకి ఇంతవరకు బోరు ఏర్పాటు చేయలేదని అధికారులతో వాగ్వాదం చేశారు. కొత్త బోరు వేయిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. -
బస్సు కోసం రోడ్డెక్కిన ప్రజలు
పుట్టపర్తి అర్బన్ : ఒకటి కాదు.. రెండు కాదు సుమారు పదేళ్లుగా ఆర్టీసీ బస్సులు నడపక పోవడంతో ఆటోల్లో తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పుట్టపర్తి మండలం మార్లపల్లి, కోనాపురం గ్రామస్తులు వాపోయారు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం పెనుకొండ–పెడపల్లి రోడ్డుపై ధర్నా చేశారు. రహదారికి అడ్డంగా కట్టెలు, కంపలు అడ్డుపెట్టి వచ్చి పోయే ఆటోలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల వారు మాట్లాడుతూ పెనుకొండ–పెడపల్లి ప్రధాన రహదారి వెంబడి సుమారు 15 గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల వెంబడి తారు రోడ్డు పాడై సుమారు పదేళ్లవుతోందన్నారు. రోడ్డు పాడైనప్పటి నుంచి ఆర్టీసీ వారు బస్సులు తిప్పకుండా ఆపి వేశారన్నారు. దీంతో రోజు రోజుకూ ఆటోల సంఖ్య అ«ధికమైందన్నారు. అధిక లోడుతో వచ్చే ఆటోలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ధర కూడా అధికంగా వసూలు చేస్తున్నారని, ఇదేంటని అడిగితే ఆటోలు తిప్పకుండా మానేస్తున్నారన్నారు. గత్యంతరం లేక ఆటోల్లో ప్రయాణిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు ప్రమాదాల బారిన పడ్డామన్నారు. బస్సులు నడపాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఇటీవల మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెప్పినా చేసిందేమి లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.