బస్సు కోసం రోడ్డెక్కిన ప్రజలు
పుట్టపర్తి అర్బన్ : ఒకటి కాదు.. రెండు కాదు సుమారు పదేళ్లుగా ఆర్టీసీ బస్సులు నడపక పోవడంతో ఆటోల్లో తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పుట్టపర్తి మండలం మార్లపల్లి, కోనాపురం గ్రామస్తులు వాపోయారు. తమ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం పెనుకొండ–పెడపల్లి రోడ్డుపై ధర్నా చేశారు. రహదారికి అడ్డంగా కట్టెలు, కంపలు అడ్డుపెట్టి వచ్చి పోయే ఆటోలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల వారు మాట్లాడుతూ పెనుకొండ–పెడపల్లి ప్రధాన రహదారి వెంబడి సుమారు 15 గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల వెంబడి తారు రోడ్డు పాడై సుమారు పదేళ్లవుతోందన్నారు. రోడ్డు పాడైనప్పటి నుంచి ఆర్టీసీ వారు బస్సులు తిప్పకుండా ఆపి వేశారన్నారు.
దీంతో రోజు రోజుకూ ఆటోల సంఖ్య అ«ధికమైందన్నారు. అధిక లోడుతో వచ్చే ఆటోలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ధర కూడా అధికంగా వసూలు చేస్తున్నారని, ఇదేంటని అడిగితే ఆటోలు తిప్పకుండా మానేస్తున్నారన్నారు. గత్యంతరం లేక ఆటోల్లో ప్రయాణిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు ప్రమాదాల బారిన పడ్డామన్నారు. బస్సులు నడపాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. ఇటీవల మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెప్పినా చేసిందేమి లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.