బైక్‌ను ఢీకొన్న బస్సు
భర్తతో పాటూ మహిళా పోలీసు దుర్మరణం
అన్నానగర్: వివాహమైన రెండు నెలలకే బైక్‌ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో భర్తతో పాటూ మహిళా పోలీసు దుర్మరణం చెందిన ప్రమాదం సోమవారం చిదంబరంలో కలకలం రేపింది. వివరాలు.. కడలూరు జిల్లా చిదంబరం సమీపంలో ఉన్న జయంకొండాన్‌కు చెందిన మహిళ ఇలవరసి. ఈమె చిదంబరం సమీపంలో కుమరాట్చి పోలీసు స్టేషన్‌లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె భర్త కలైవేందన్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు.
ఈ స్థితిలో ఇలవరసి తన భర్తతో కలిసి చిదంబరం సమీపంలోని వీరన్‌కోవిల్‌దిట్టు గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యక్రమంలో పాల్గొనడం కోసం బైకులో వెళ్లారు. వారు చిత్తాలపట్టి గ్రామం సమీపంలో వెళుతుండగా ఎదురు వైపుగా కొడియంపాళయం గ్రామం నుంచి చిదంబరం వైపుగా వచ్చిన ప్రభుత్వ బస్సు అకస్మాత్తుగా ఇలవరసి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌తో పాటు ఇద్దరిని బస్సు ఈడ్చుకెళ్లింది.
దీంతో తీవ్రంగా గాయపడి ఇలవరసి, కలైవేందన్ ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న వెంటనే అన్నామలైనగర్ పోలీసులు బస్సు కింద శిథిలాల్లో చిక్కుకున్న దంపతుల మృతదేహాలను శవపంచనామా నిమిత్తం చిదంబరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా వీరికి గత నవంబర్ నెలలో వివాహం కావడం గమనార్హం. వివాహమైన రెండు నెలలకే నవ దంపతులు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతం వారిని శోకంలో ముంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment