హంద్రీనీవా కాలువ నిర్మాణానికి సర్వే
చిలమత్తూరు : మండలంలోని దేమకేతేపల్లి, డి.గొల్లపల్లి, బ్రహ్మేశ్వరంపల్లి, గాడ్రాళ్లపల్లి, కొర్లకుంట గ్రామాల పరిసరాల్లో హంద్రీనీవా కాలువ నిర్మాణానికి శుక్రవారం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు ఇంజనీర్లు యోగానంద్, సుధాకర్, కాంట్రాక్టు సిబ్బంది సుదర్శన్, సతీష్, గౌతమ్ సర్వే నిర్వహించారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే సర్వే పనులు చేయాలని రైతులు చిన్నప్ప, నాగరాజు, మంజునాథ్, బాలాజీరావు, శంకరప్ప, సంజీవరెడ్డి, అశ్వర్థ తదితరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పనులు చేస్తున్నామని.. పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు.
మడకశిర నుంచి దేమకేతేపల్లి పంచాయతీలోని గ్రామాల వరకు 53 కిలోమీటర్ల కాలువ నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన 4 కిలోమీటర్ల కాలువ పనులకు సర్వే చేస్తున్నామని అధికారులు వివరించారు. 25 మంది రైతులకు నష్టపరిహారం పంపిణీ కాలేదన్నారు. ఎకరానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం లెక్కించి ఎన్ని సెంట్లు భూమి కాలువకు పోతుందో అంత పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాగా స్థానిక నాయకులు కల్పించుకుని కాలువ నిర్మాణాలకు సహకరించాలని కోరారు. తహశీల్దార్ ఇబ్రహీంసాబ్, ఎంపీపీ నౌజియాబాను తదితరులు కాలువ సర్వే పనులను ప్రారంభించారు.