- తక్కువ మొత్తానికి విలువైన వస్తువులను ఎర
- డబ్బులు కట్టించుకుని ఉడాయించిన నిర్వాహకులు
- ఆందోళనల్లో లబ్ధిదారులు
చిలమత్తూరు : ‘తక్కువ మొత్తం.. విడతల వారీగా చెల్లిస్తే చాలు... విలువైన వస్తువులు మీ సొంతం’ అంటూ వల విసిరారు. ఇది నిజమని నమ్మిన అమాయకులకు చివరకు కుచ్చు టోపీ పెట్టారు. లక్కీ స్కీమ్ పేరుతో ప్రజలను బురిడీ కొట్టించిన ఓ సంస్థ నిలువునా ముంచి బోర్డు తిప్పేసిన ఉదంతం చిలమత్తూరులో వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు... హిందూపురం షిరిడీసాయి నగర్, శ్రీకంఠపురం, ఆర్.వి.రెడ్డి పేరుతో కొన్ని కార్డులు ముద్రించి హిందూపురం సహా పరిసర మండలాల్లోని గ్రామాల్లో లక్కీ స్కీం గురించి విస్తృత ప్రచారం చేశారు.
స్కీం ఏంటంటే...
మొదటి రోజు రూ.2, రెండో రోజు రూ.3, మూడో రోజు రూ.4, ఇలా రోజుకో రూపాయి వంతున పెంచుకుంటూ నెల రోజల పాటు చెల్లించాలి. మూడో రోజు డబ్బు కట్టకపోతే డ్రాలో పేరు ఉండదు. స్కీమ్ మధ్యలో ఏ కారణంగా డబ్బులు కట్టకపోతే అప్పటి వరకు కట్టిన మొత్తం వాపసు ఇచ్చేది ఉండదు. ఇదీ ఆ స్కీం కథ. రెండ్రోజులకోసారి డ్రా తీసినప్పుడు విజేతలకు విలువైన స్టీల్ సామానులు, కాపర్ డిష్ సెట్, ప్రెషర్ కుక్కర్, సీలింగ్ ఫ్యాన్, రైస్ కుక్కర్, అల్యూమినియం పాత్ర... ఇలా ఇస్తామని నమ్మ బలికారు. డ్రాలో లక్కీగా రాని వారికి నెల రోజుల్లో సామానులు ఇస్తామని మాటిచ్చారు. 1, 2, 3, 4 రూపాయాలే కదా చెల్లిద్దామనుకుని పేద, మధ్య తరగతి వర్గాల వారు వేలాది మంది ఎగబడ్డారు.
నమ్మకంతో ఉంటూనే..
మొదట్లో ప్రజలను నమ్మించడానికి కొంత మందికి విలువైన సామానులను నిర్వాహకులు పంపిణీ చేశారు. ఇలా చేయడంతో మరింత మంది నమ్మి డబ్బులు కట్టేందుకు ముందుకు వచ్చారు. అంతే ఆ తరువాత స్కీమ్ నిర్వాహకులు అదృశ్యమయ్యారు. తామంతా మోసపోయామని బాధితులు గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
లక్కీ స్కీం ముంచింది!
Published Sat, Apr 1 2017 12:16 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
Advertisement
Advertisement