
123 జీఓ రద్దుపై హర్షం
కందుకూరు: ఇటీవల 123 జీఓను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల పరిధిలోని ముచ్చర్ల సర్వే నంబర్ 288లోని సర్టిఫికెట్‌దారులు ఆదివారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ పేదల భూములను లాక్కొంటూ సరైన పరిహారం ఇవ్వడం లేదని, ఈతీర్పు ప్రభుత్వానికి ఓ చెంప పెట్టులాంటిదన్నారు. గ్రామ పరిధిలోని 221 మంది పేదలకు గతంలో ఎకరం చొప్పున ఇచ్చిన సర్టిఫికెట్లను పట్టించుకోకుండా, కనీస పరిహారం చెల్లించకుండా అన్యాయంగా భూములను గుంజుకున్నారని విమర్శించారు. ఆ భూముల్నే నమ్ముకున్న తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములను సేకరించాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు వెంకటరమణ, యాదయ్య, లక్ష్మమ్మ, బుగ్గమ్మ తదితరులు పాల్గొన్నారు.