– నియోజకవర్గాల సమావేశాలకు ముఖ్యనేతలు గైర్హాజరు
– తూతూ మంత్రంగా సమన్వయ కమిటీ సమీక్ష
– ఉపన్యాసంతో మమ అనిపించిన ఇంచార్జి మంత్రి
– గోడ దూకినవారికే పట్టం కడతారా అంటూ కార్యకర్తల ఆవేదన
కర్నూలు: జిల్లాలో తెలుగుతమ్ముళ్లను ఏకతాటిపై నడిపించడం ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడకు తలనొప్పిగా మారింది. ఇటీవల గోడదూకిన ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కాయి. జిల్లాలోని శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, కోడుమూరు, కర్నూలు ఎమ్మెల్యేలు ఇటీవల టీడీపీలో చేరడంతో ఆధిపత్యపోరు మొదలైంది. జిల్లాలో నాయకులందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడుకు పార్టీ అధినేత అప్పగించారు. రెండు రోజుల పాటు నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి అందరిని సమన్వయం చేసేందుకు ‘అచ్చెన్న’ కర్నూలులో తిష్టవేశారు. మొదటి రోజు శుక్రవారం శ్రీశైలం, నంద్యాల, పత్తికొండ, కోడుమూరు,కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో స్థానిక మౌర్యాఇన్ హోటల్‌లోని దర్భార్ హాలులో సమన్వయ పేరుతో సమీక్ష నిర్వహించారు. పార్టీ జిల్లా ఇంచార్జి వర్లరామయ్య, రాష్ట్ర కమిటీ పరిశీలకులు గోవర్థన్‌రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్యనేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో అచ్చెన్నాయుడుకు వ్యవహారం తలనొప్పిగా మారింది.
ముఖ్యనేతల గైర్హాజరు
సమన్వయ సమీక్షకు జిల్లాకు సంబంధించిన ముఖ్యనేతలు గైర్హాజరు అయ్యారు. హాజరైన వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో సమస్య మరింత జటిలమైంది. సమన్వయంతో పనిచేసి పార్టీని మరింత అభివద్ధి చేయాలని ఇంచార్జి మంత్రి స్వయంగా ఆదేశించినప్పటికీ నాయకులు మాత్రం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో పాటు ముఖ్యనేతలంతా గైర్హాజరు కావడంతో సమావేశం తూతూ మంత్రంగా సాగింది. శ్రీశైలం నియోజకవర్గ సమీక్షకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి హాజరైనప్పటికీ, పార్టీ ఇంచార్జి శిల్పా చక్రపాణిరెడ్డి గైర్హాజరు కావడంతో తూతూ మంత్రంగా సమావేశం సాగింది. అలాగే నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ ఇంచార్జి శిల్పా మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి హాజరు కాలేదు. జడ్పీ మాజీ చైర్మెన్ పీపీ నాగిరెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచనతో పాటు కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే హాజరయ్యారు. పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి కేవలం 20 మంది కార్యకర్తలతో అరగంట వ్యవధిలో సమీక్షను ముగించారు.
నిరుత్సాహం...
కోడుమూరు నియోజకవర్గ సమావేశానికి ఎమ్మెల్యే మణిగాంధీతో పాటు ఇంచార్జి విష్ణువర్థన్‌రెడ్డి, తమ అనుచరవర్గంతో పెద్ద ఎత్తున హాజరైనప్పటికీ కార్యకర్తల సమస్యలు పట్టించుకోకుండానే సమావేశాన్ని ముగించడంతో చాలా మంది నిరుత్సాహానికి గురయ్యారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జిల గురించి మాత్రమే పట్టించుకుంటారా.. ఏళ్లతరబడి పార్టీని నమ్ముకొని జెండా మోసిన కార్యకర్తల గురించి పట్టించుకోరా అంటూ కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన పలువురు ముఖ్య కార్యకర్తలు ఇంచార్జి మంత్రిని నిలదీశారు. దీంతో కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యకర్తల సమస్యల గురించి చర్చిద్దామంటూ ఇన్‌చార్జి మంత్రి దాటవేశారు. కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల సమావేశాలకు కేవలం పార్టీ ఫిరాయించిన వారి అనుచరవర్గం మాత్రమే ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా న్యాయం జరగడం లేదంటూ ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ సమన్వయంతో పనిచేయండి, సమస్యలు పరిష్కారమవుతాయంటూ తూతూ మంత్రంగా సమీక్ష సమావేశాలన్ని ముగించడంపై కార్యకర్తలు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వర్‌రావు యాదవ్, కేడీసీసీ చైర్మెన్ మల్లికార్జునరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
నేడు 8 నియోజకవర్గాల సమీక్ష
ఎమ్మిగనూరు, డోన్, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, బనగానపల్లె, పాణ్యం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు శనివారం నిర్వహిస్తున్నట్లు నాగేశ్వర్‌రావు యాదవ్ తెలిపారు.