‘జల్లు’మంది
- తడిసి.. మురిసిన మెతుకుసీమ
- జిల్లాలో పలుచోట్ల భారీగా వర్షం
- రెండేళ్ల తర్వాత నిండిన ‘రాచకట్టు’
- సిద్దిపేటలో చెరువులు, చెక్‌డ్యాంలలోకి నీరు
- వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు మేలు
సాక్షి, సంగారెడ్డి: మెతుకుసీమ తడిసి ముద్దయ్యింది. సీజన్‌లో బుధవారం అతి పెద్ద వర్షం నమోదైంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జిల్లాలో కురిసిన భారీ వర్షం ఇదే. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట రెవెన్యూ డివిజన్లలో భారీ వర్షం కురవగా మెదక్ డివిజన్‌లో మోస్తరుగా పడింది.
జిల్లా వ్యాప్తంగా 21.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి డివిజన్‌లో 29.3, సిద్దిపేట డివిజన్‌లో 31.3, మెదక్‌లో 8.8 మిల్లీమీటర్ల మేర సాధారణ వర్షం కురిసింది. గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్‌పూర్ మండలంలో అత్యధికంగా 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నిండిన రాచకట్ట రియర్వాయర్
జగదేవపూర్ మండలంలోని రాచకట్టు రిజర్వాయర్ రెండేళ్ల విరామం తర్వాత నిండింది. రిజర్వాయర్ కాలువ ప్రవహించటంతో తీగుల్-రాయవరం గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. రోజంతా వర్షం కురవడంతో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గంలోని పలు చెరవులు, చెక్‌డ్యాంలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. సిద్దిపేట పట్టణంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రధాన రోడ్లు నీట మునిగాయి.
పంటలకు మేలే..
ప్రస్తుత వర్షాలతో పంటలకు మేలు జరగుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మాధవీ శ్రీలత తెలిపారు. వరి, మొక్కజొన్న, జొన్న, ధాన్యం పంటలకు జీవం పోసినట్టేనన్నారు. ఇటీవల వర్షాభావం కారణంగా అక్కడక్కడా మొక్కజొన్న పంట కొంత దెబ్బతిందని, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పంటకు ప్రాణం పోసినట్టయిందని తెలిపారు. అలాగే వరి పంటకు సైతం మేలు జరుగుతుందని వివరించారు. చాలా రోజుల తర్వాత వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
జగదేవ్‌పూర్‌లో అత్యధికం..
జిల్లాలోని ఒక మండలంలో ఆశించిన స్థాయి కంటే బుధవారం అధికవర్షం కురవగా, 17 మండలాల్లో సాధారణ, 27 మండలాల్లో తక్కువ, ఒక మండలంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. జిల్లా వ్యాప్తంగా 213.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా నెలాఖరు వరకు 75.7 మి.మీ మాత్రమే నమోదైంది. 64.5 మిల్లీమీటర్ల మేర లోటు నెలకొంది.
ఇదిలా ఉంటే జిల్లాలో అత్యధికంగా జగదేవ్‌పూర్‌లో 86.4 మిల్లీమీటర్ల మేర వర్షం కురవగా గజ్వేల్‌లో 69.6, న్యాల్‌కల్‌లో 67, ఝరాసంగంలో 57.8, పటాన్‌చెరులో 54.4, వర్గల్, రామచంద్రపురం మండలాల్లో 46 మి.మీ. మేర వర్షం కురిసింది. అలాగే కంగ్టిలో 44.2, ములుగులో 34.6, సదాశివపేటలో 33.2. సంగారెడ్డిలో 32.8, నర్సాపూర్‌లో 32 మి.మీటర్ల వర్షం కురిసింది.