
హైడ్రామా
- కొత్త మలుపు తిరిగిన ఎంపీహెచ్‌ఏల వివాదం
– ఆందోళనలతో అట్టుడికిన డీఎంహెచ్‌ఓ కార్యాలయం
– కౌన్సెలింగ్ వద్దని కొందరు.. కావాలని మరికొందరు
– వాయిదా వేస్తున్నట్లు అధికారుల ప్రకటన
– కలెక్టర్ వచ్చాక తుది నిర్ణయం
– తెరపైకి మరో ‘మెరిట్’ వివాదం
అనంతపురం మెడికల్ : మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ల (ఎంపీహెచ్‌ఏల) తొలగింపు..నియామకాల వివాదం కొత్త మలుపు తిరిగింది. ఉదయం నుంచి డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద హైడ్రామా నడవగా.. సాయంత్రం కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇటీవల కొత్తగా ఎంపీహెచ్‌ఏలుగా విధుల్లో చేరిన వారి నియామకాలు, పోస్టింగ్ ఆర్డర్లను సోమవారం రద్దు చేసిన విషయం విదితమే. కౌన్సెలింగ్ చేసి రీపోస్టింగ్ ఇస్తామని చెప్పడంతో మంగళవారం ఉదయం 10 గంటలకు డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి అభ్యర్థులు వచ్చారు. అయితే.. కౌన్సెలింగ్ చేపట్టరాదంటూ తొలగించబడిన 24 మంది ఆందోళనకు దిగారు. ముందుగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి తీసుకొచ్చిన ఆర్డర్ కాపీని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణకు అందించారు. డిసెంబర్ 27వ తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని అందులో ఉంది. దీన్ని పరిశీలించిన డీఎంహెచ్‌ఓ ‘సరే’ అంటూ అభ్యర్థులకు చెప్పారు. కౌన్సెలింగ్ రద్దు చేయాలని కోరగా.. కుదరదని చెప్పారు. విధుల్లోకి తీసుకోవాలని ఆర్డర్‌లో లేదు కదా అనడంతో అభ్యర్థులు కంగుతిన్నారు.
డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో బైఠాయింపు
మధ్యాహ్నం 3.30 గంటలకు కౌన్సెలింగ్ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని తెలియడంలో తొలగించబడిన ఉద్యోగులు ఆందోళన చేశారు. వామపక్ష నేతలు, కుల సంఘాల నాయకులను ఆశ్రయించడంతో వారు మద్దతుగా నిలిచారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, నగర అధ్యక్ష, కార్యదర్శులు జమీర్, సంతోష్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరేష్, అధ్యక్ష, కార్యదర్శులు మధు, జాన్సన్, ఏఐటీయూసీ నేత నరసింహులు, బీసీ సంఘం నేతలు డీఎంహెచ్‌ఓ చాంబర్‌లో అభ్యర్థులతో కలిసి బైఠాయించారు.
ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా ఉద్యోగాల్లోంచి ఎలా తొలగిస్తారని రమణ ప్రశ్నించారు. అవినీతి అధికారుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, తక్షణం అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సెలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తేనే అక్కడి నుంచి వెళ్తామని భీష్మించుకు కూర్చున్నారు. ఇదే సమయంలో తనను కలవాలని జేసీ–2 ఖాజామొహిద్దీన్ నుంచి కబురు రావడంతో డీఎంహెచ్‌ఓ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. ఉదయం బీసీ సంఘం నేత చక్రధర్ యాదవ్ డీఎంహెచ్‌ఓతో సమావేశమై బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
కౌన్సెలింగ్ చేపట్టాల్సిందే..
వాయిదా ప్రకటన చేయగానే రీ పోస్టింగ్ కోసం వచ్చిన అభ్యర్థులు ఆందోళన చేశారు. చాంబర్‌లోకి వచ్చి డీఎంహెచ్‌ఓను చుట్టుముట్టారు. ఇప్పటికే 14 ఏళ్లు వేచి చూశామని, ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చి మళ్లీ ఇలా చేయడమేంటని ప్రశ్నించారు. తక్షణం కౌన్సెలింగ్ చేపట్టాలని అక్కడే బైఠాయించారు. దీంతో టూటౌన్ ఎస్‌ఐ శివగంగాధర్‌రెడ్డి కలుగజేసుకుని జేసీ–2ని కలిసేందుకు వెళ్తున్నారని, అడ్డుకోవడం మంచిది కాదని అన్నారు. అనంతరం డీఎంహెచ్‌ఓ.. జేసీ–2 వద్దకు వెళ్లారు. కలెక్టర్ కోన శశిధర్ వచ్చాక చర్చించాలని నిర్ణయానికి వచ్చారు.
తెరపైకి మరో వివాదం
తొలగింపు.. కొత్త నియామకాల సమస్య సద్దుమణగకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. మెరిట్ లేని కారణంగా తొలగించామని చెబుతున్న 24 మందిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటే వారికంటే మెరిట్‌లో ముందున్న తమకు న్యాయం చేయాలని కొందరు అభ్యర్థులు ఆందోళన చేశారు.