కణేకల్లు : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ, రాష్ట్రీయ రహదారులకు దూరంగా మద్యం షాపులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అనంతపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిల్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కణేకల్లు ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌ను శనివారం ఆయన సందర్శించారు. అంతకుముందు కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లోని వైన్స్‌షాపుల్ని ఆయన పరిశీలించారు. స్థానిక ఎక్సైజ్ పోలీసుస్టేషన్‌లో సీఐ దశరథరామిరెడ్డితో కలిసి ఈఎస్ విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక ప్రమాదాలు మద్యం తాగుడు వల్ల జరుగుతున్నాయని ఈ ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలనే ఉద్ధేశంతో నేషనల్ హైవే, స్టేట్ హైవే రోడ్ల పక్కన మద్యం దుకాణలు పెట్టరాదని సుప్రీం కోర్టు ఆదేశించినట్లు తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి ఎన్‌హెచ్, ఎస్‌హెచ్ రోడ్లకు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతపురం ఎక్సైజ్ డివిజన్ పరిధిలో మొత్తం 139 మద్యం షాపులు ఉండగా హైవే రోడ్లలో 91 షాపులున్నట్లు గుర్తించామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ షాపులను దూరంగా పెట్టుకోవాలని ఆదేశిస్తూ ఆయా షాపు యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. షాపులను షిప్ట్ చేయకపోతే వారి లైసెన్స్‌లను రద్దు చేసి కొత్తషాపులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గుత్తి ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధిలో 17, గుంతకల్లులో 3, ఉరవకొండలో 5, శింగనమలలో 5, తాడిపత్రిలో 14, అనంతపురంలో 33, కణేకల్లులో 5, రాయదుర్గంలో 7 షాపులు రోడ్డు పక్కలో ఉన్నాయన్నారు.
మద్యం షాపులు మరోచోటికి డమ్మిగా షిఫ్ట్ చేసి రోడ్ల పక్కలో దుకాణాలు తీసి విక్రయించే అవకాశముందా అన్న ప్రశ్నకు సివిల్ పోలీసులు, రెవెన్యూ, ఎక్సైజ్ పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తుంటారని ఆ విధంగా ఎవరైనా చేస్తే వారి లైసైన్స్‌లు కూడా రద్దు చేస్తామని ఆయన సమాధానమిచ్చారు. అలాగే దాబా, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. అనంతపురం ఎక్సైజ్ డివిజన్‌లో నాటుసారాను పూర్తిగా నిర్మూలించడంతో మద్యం వ్యాపారం బాగా పుంజుకుందన్నారు. మద్యం డిపోలో నెలకు రూ. 30 నుంచి రూ.32 కోట్ల విలువ చేసే మద్యం లిఫ్ట్ అవుతున్నట్లు తెలిపారు.
‘ఏప్రిల్ నుంచి హైవేకు దూరంగా వైన్స్ షాపులు’
Published Sat, Mar 11 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
Advertisement
Advertisement