రాజభాష.. హిందీ
రాజభాష.. హిందీ
Published Tue, Sep 13 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
నేడు 67వ హిందీ భాషా దినోత్సవం
నారాయణపేట: హిందీ.. తీయని భాష.. జా‘తీయ’ భాష. జనప్రియమైన. అతి సుందరభాష. భారతీయులెందరో భాషించే భాష. రాజభాషగా రాణించే రమ్య భాష. అమర ఖ్యాతిగన్న అద్వితీయ భాష. ఇలా హిందీ భాష గురించి ఎంతగానో చెప్పకోవచ్చు. ప్రపం^è భాషలలో ఇంగ్లిష్, చైనీస్ తరువాత హిందీ అత్యంత ప్రాచుర్యం ఉన్న భాష. జాతీయ సమైక్యత, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు హిందీ ఎంతో తోడ్పడుతోంది. రాజ్యాంగంలోని 360 ఆర్టికల్ అనుసారంగా హిందీని జాతీయభాషగా గుర్తించారు. బుధవారం (సెప్టెంబర్ 14) 67వ హిందీ భాషా దివాస్(హిందీ భాషా దినోత్సవం)ను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
‘పేట’ హిందీ ప్రచార సమితికి అంతర్జాతీయ ఖ్యాతి
దేశంలో చాలా రాష్ట్రాల్లో హిందీ అధికార భాషగా అమలవుతోంది. 1949 సెప్టెంబర్ 14న అధికారభాషగా రాజ్యాంగం ద్వారా గుర్తింపు పొందింది. ఆనాటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దివాస్ నిర్వహిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లో ఆదరణ పొందుతూ, అశేష జనుల అభిమానం చూరగొన్న హిందీకి స్వదేశంలోనే సరైన ఆదరణ లేదు. ప్రభుత్వ పాలన యంత్రాంగానికి ఆంగ్లభాషపై ఉన్న ప్రేమ స్వదేశీ భాష హిందీపై లేకపోవడం శోచనీయం. అయితే అక్కడక్కడ హిందీ ప్రచార్ సమితి ఆధ్వర్యంలో హిందీ ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి. అలాగే తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా 1961లో నారాయణపేటలో అప్పటి మాజీ ఎమ్మెల్యే బన్నప్ప గందె, జనార్దన్‌రావు కాంబ్లే ఆధ్వర్యంలో హిందీ ప్రచార్ సమితిని ప్రారంభించారు. 1964లో రిజిస్ట్రేషన్ అయిన ఈ హిందీ ప్రచార్ సమితికి ప్రస్తుతం మానవ వనరులు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి నిధులు అందుతున్నాయి. స్థానిక హిందీ ప్రచార సమితి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. సమితి కార్యకలాపాలు, భాషా ప్రావీణ్యాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. సాంస్కృతిక, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ విజ్ఞాన భాండాగారంగా విరాజిల్లుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఎంపీ కోటా నిధులతో పక్కా భవనం నిర్మాణంతో పాటు తులసీ వచనాలయం, రాజేంద్ర పుస్తకాలయం, నెహ్రు బాలమందిర్ విభాగాలను నెలకొల్పారు. కంప్యూటర్లు ఏర్పాట్లు చేశారు. దాదాపు 25వేల పుస్తకాలున్నాయి. 1950 నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచారసభ హైదరాబాద్ ద్వారా హిందీ నాగరిబోద్ నుంచి విద్వాన్ వరకు పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు.
ప్రస్థానమిదీ..
1957లో పంజాబ్‌లో నిర్వహించిన హిందీ రక్షా ఆందోళనలో నారాయణపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు రాంనాథ్ కల్యాణి, హన్మంతు జన్ను, శంకర్‌రావు సాఖరే, చెన్నప్ప, నర్సింగ్‌రావు సరోదే పాల్గొన్నారు. హిందీ నాగరిబోద్ నుంచి విద్వాన్ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 1986లో పీజీ స్థాయిలో సాహిత్య రత్న (ఎంఏ) పరీక్షకేంద్రాన్ని స్థాపించారు. 1987లో నాగరిబోద్ హిందీ పరీక్షలో రాష్ట్రంలోనే రెండోస్థానం సాధించారు. 1987లో న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారత టైప్‌రైటింగ్ పోటీల్లో దిలీప్‌కుమార్, విశ్వనాథ్ సరోదే ప్రశంసాపత్రాలను అందుకున్నారు. జిల్లాలోని అత్యధిక పుస్తకాలు గల గ్రంథాలయం రాష్ట్రస్థాయి ఉత్తమ లైబ్రరీగా ప్రశంసలు అందుకుంది. హిందీలో కంప్యూటర్ శిక్షణనిస్తున్నారు.
ప్రపంచ మహాసభల్లో..
1975లో మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, మారిషన్ ప్రధాని సర్‌రాం గులాంలు పాల్గొన్న ప్రపంచ మహాసభలకు, 1976లో మారిషన్‌లో నిర్వహించిన రెండో, న్యూఢిల్లీలో మూడో మహాసభలకు నారాయణపేట నుంచి 12మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 1993లో మారిషన్ రాజధాని పోర్టలూయిస్‌లో జరిగిన మహాసభలో ఇద్దరు పాల్గొన్నారు.
బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి
కేంద్ర ప్రభుత్వం 1949 సెప్టెంబర్ 14న హిందీ భాషాను జాతీయభాషగా గుర్తించింది. ఆశించిన మేర హిందీ భాష అభివృద్ధి చెందడం లేదు. హిందీ భాషాభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలి.
– అంబర్‌నాథ్ కాంబ్లే, హిందీ ప్రచార సమితి కార్యదర్శి, నారాయణపేట
ప్రభుత్వ తోడ్పాటు కరువైంది
స్థానిక హిందీ ప్రచార సమితిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా పరిజ్ఞానాన్ని పెంపొందిస్తున్న ప్రభుత్వ తోడ్పాటు కరువైంది. ప్రభుత్వం ద్వారా నిర్వహించే డీఎస్సీలో ప్రతి పాఠశాలలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు వేర్వేరుగా ఉపాధ్యాయులను నియమించాలి. ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షల్లో 35మార్కులు చేయాలి.
– సత్యనారాయణ కాంబ్లే, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నారాయణపేట
Advertisement