దాహంపై గరం..గరం! | hot hot on water | Sakshi
Sakshi News home page

దాహంపై గరం..గరం!

Published Sun, Mar 26 2017 9:45 PM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM

దాహంపై గరం..గరం! - Sakshi

దాహంపై గరం..గరం!

- వాడివేడిగా జెడ్పీ సమావేశం 
- దాహార్తి తీర్చాలని సభ్యుల పట్టు
- అనర్హులకు జన్మభూమి కమిటీల వత్తాసు
- చర్చకు రాని అజెండాలోని అంశాలు
 
కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర దాహార్తిని ఎదుర్కొంటున్నారని ఆయా ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాని మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్, జాయింట్‌ కలెక్టర్‌ సీ హరికిరణ్, జెడ్పీ సీఈఓ బీఆర్‌ ఈశ్వర్‌ హాజరయ్యారు.
 
ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం పూర్తి అయిన వెంటనే తాగునీటి సమస్యపై చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలుగోడు జెడ్పీటీసీ లాలిస్వామి మాట్లాడుతూ.. మండలంలోని పాత స్కీంకు 200 మీటర్ల పైప్‌లైన్‌ వేసి మోటారు ఫిట్‌ చేస్తే వెలుగోడుకు కొంత మేర నీటి సమస్య తీరుతుందన్నారు. కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడికి గురవుతున్నాయని, కొండమీదిపల్లె గ్రామం ఇంకా ఇబ్బంది పడుతోందని జెడ్పీటీసీ సభ్యురాలు సరస్వతి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా నీరు లేదని చెప్పగానే కలెక్టర్‌ జోక్యం చేసుకుంటూ.. ఆయా గ్రామాలను పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. చిప్పగిరి జెడ్పీటీసీ సభ్యుడు మీనాక్షినాయుడు మాట్లాడుతూ.. మండలంలోని ఏరూరు గ్రామంలో ప్రజలందరు కుంటలోని నీటినే తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఖాజీపురం రిజర్వాయర్‌ వరకు పైప్‌లైన్‌ వేసి ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మించాలని రూ.40 లక్షలతో ఎస్టిమేట్లు వేయించి రెండు సంవత్సరాలు అవుతున్నా అతీగతీ లేదన్నారు. వెంటనే కలెక్టర్‌ విజయమోహన్‌ జోక్యం చేసుకుంటూ తనకు ప్రతిపాదనలు పంపారా? అని ఎస్‌ఈ హరిబాబును ప్రశ్నించారు. దీంతో ఎస్‌ఈ పంపలేదని సమాధానం ఇవ్వడంతో కలెక్టర్‌ అసహనానికి గురై, వెంటనే సంబంధిత ప్రతిపాదనలను పంపాలని ఆదేశించారు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు ఫిల్టర్‌ బెడ్లు పనిచేయడం లేదని మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
 
ఆలూరులో కూడా తీవ్ర మంచినీటి సమస్య ఉందని జెడ్పీటీసీ రాంభీంనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చింతకుంట ఎస్‌ఎస్‌ ట్యాంకులో నీరు నిల్వ లేదని, వెంటనే ఎల్‌ఎల్‌సీ నీటితో ట్యాంకు నింపేందుకు చర్యలు చేపట్టాలని హాలహర్వి జెడ్పీటీసీ కోరారు. తర్తూరు, కిష్టదొడ్డి జాతర్లు ఉన్నందున నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని జూపాడుబంగ్లా జెడ్పీటీసీ సభ్యుడు కోరారు.  సి. బెళగల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో టాయ్‌లెట్ల సౌకర్యం కల్పించాలని జెడ్పీటీసీ చంద్రశేఖర్‌ కోరారు. కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో నీటి కరువు అధికంగా ఉందని జెడ్పీటీసీ సభ్యురాలు వాకిటి మాధవీ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఉపాధి బిల్లులకు లంచం ఇవ్వాలంట ...!
గూడురు మండలం పెంచికలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వర్మికంపోçస్టు యూనిట్‌ బిల్లులు ఇవ్వమంటే సంబంధిత ఏపీఓ 10 శాతం మామూళ్లు ఇస్తే చేస్తామని చెబుతున్నారని గూడురు జెడ్పీటీసీ సభ్యురాలు నాగజ్యోతి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌..డ్వామా పీడీ పుల్లారెడ్డిని ఆదేశించారు. మండలంలోని పెంచికలపాడు, కే నాగలాపురం గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడికి గురవుతున్నాయని, వెంటనే ఆయా గ్రామాల దాహార్తి తీర్చేందుకు చర్యలు చేపట్టాలని నాగజ్యోతి కోరారు. గాజులదిన్నె నీటితో పెంచికలపాడు చెరువు నింపేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నీటి పారుదల శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. 
 
అనర్హులకు జన్మభూమి కమిటీల వత్తాసు ...
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదని, అనర్హులను జన్మభూమి కమిటీలు రెకమెండ్‌ చేస్తున్నాయని సంజామల జెడ్పీటీసీ సభ్యురాలు బాబు తదితరులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎన్‌టీఆర్‌ భరోసా కింద అందజేస్తున్న పెన్షన్లలో అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. పాలేరు వాగుకు అవుకు రిజర్వాయర్‌ నుంచి నీరు వచ్చేలా చూడాలని బాబు కోరారు. 
చర్చకు రాని అజెండాలోని అంశాలు ...
జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో అనేక అంశాలు చర్చకు వస్తాయని భావించినా, పాలకవర్గం మాత్రం త్రాగునీరు, సాగునీరు, వ్యవసాయం, పశు సంవర్ధకశాఖ, విద్యుత్‌ శాఖలపై సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. అయితే వ్యవసాయం, పశు సంవర్ధకశాలను వదిలేశారు. కేవలం తాగునీరు, సాగునీటిపై సమీక్ష ఆశించిన స్థాయిలో చర్చ జరిగినా, మిగిలిన శాఖలపై చర్చ జరపకపోవడం పట్ల సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిల్లాలో కరువు తాండవిస్తున్నా, కరువుపై చర్చ జరపకపోవడాన్ని పలువురు సభ్యులు తప్పుపడుతున్నారు. 
ఒక్కొక్కరికి రూ.5 లక్షల నిధులు
జిల్లాలోని అందరు జెడ్పీటీసీ, ఎంపీపీలకు తమ ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ప్రకారం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ప్రకటించారు. ఆదివారం జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపీపీలకు గత ఏడాది ఇచ్చిన విధంగానే ఒక్కొక్కరికి రూ.5 లక్షలు కేటాయించాలని జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ కోరారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్‌.. ఒక్కో జెడ్పీటీసీ, ఎంపీపీలకు ఉపాధి నిధులు రూ.2.50 లక్షలు, ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.2.50 లక్షలు కలిపి మొత్తం రూ.5 లక్షలు విడుదల చేసేందుకు అంగీకరించారు. అలాగే 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 16 మంది జెడ్పీటీసీలకు ఇవ్వాల్సిన బడ్జెట్‌ను కూడా రెండు రోజుల్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement