అగ్నికీలల్లో ఆరిపోయిన జ్యోతి
► కొల్లూరులో గృహం దగ్ధమైన ఘటనలో బాలిక సజీవ దహనం
► శోకసంద్రంలో కుటుంబం, బంధువులు
కొల్లూరు : చిన్నారులతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో అగ్ని ప్రమాదం ఆరని కుంపటిని రగిల్చింది. బుడిబడి నడకలతో, వచ్చీరాని మాటలతో ఇంట్లో సంతోషాలను పంచుతున్న బాలిక ప్రమాదవశాత్తు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొల్లూరులో సోమవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓ బాలిక సజీవ దహనం అవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
అప్పటివరకూ తోటి చిన్నారులతో ఆటపాటలతో గడిపిన ఆ బాలిక తమ బంధువుల ఇంట్లోకి వెళ్లి అగ్నిప్రమాదంలో చిక్కుకుని మంటలకు ఆహుతవడం కుటుంబ సభ్యులు, బంధువులను శోకసంద్రంలోకి నెట్టివేసింది. స్థానికుల కథనం మేరకు.. కొల్లూరు అంబేడ్కర్ కాలనీకి చెందిన కొలకలూరు గోపి, రజనిలకు ఇద్దరు కుమార్తెలు. విద్యుత్ పనులు చేసుకుంటూ జీవించే గోపి పని నిమిత్తం బయటకు వెళ్లగా, బాలిక తల్లి పొలం పనికి వెళ్లింది. పెద్ద కుమార్తె అయిన జ్యోతి (4) తోటి పిల్లలతో ఆడుకుంటూ తన మేనమామ అయిన చొప్పర ముసలయ్య ఇంటికి వెళ్లింది. ముసలయ్య, ఆయన భార్య శేషమ్మ సైతం పొలం పనులకు వెళ్లారు. అదే సమయంలో ఆ ఇంట్లో విద్యుత్ షార్టు సర్క్యూట్ సంభవించి తాటాకుల ఇంటికి మంటలు వ్యాపించాయి. బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించక బాలిక లోపలే చిక్కుకుపోయింది.
ఇంట్లో బాలిక ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు శతవిధాలా చిన్నారిని కాపాడే ప్రయత్నాలు చేసినా, అప్పటికే మంటల తాకిడికి బాలిక సజీవదహనమై మసిబొగ్గుగా మారిపోయింది. ఇంటి వెనుక గోడను కూల్చి జ్యోతి మృతదేహాన్ని వెలుపలికి తీశారు. అప్పటివరకూ బాలిక తప్పించుకుని ప్రాణాలతో ఉండవచ్చునన్న ఆశతో ఎదురు చూసిన తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు తీరా మసిబొగ్గుగా మారిన బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ ఇంటి దీపంగా బావించిన బాలిక అగ్నికి ఆహుతై చివరి చూపునకు కూడా దక్కకుండా పోవడం ఆ కుటుంబాన్ని తీరని వేదనకు గురిచేసింది. ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్, తహసీల్దార్ ఎ.శేషగిరిరావు బాలిక మృతిపై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.