అక్రమాల ‘బ్రాండ్‌’! | illegal brand | Sakshi
Sakshi News home page

అక్రమాల ‘బ్రాండ్‌’!

Oct 28 2016 12:27 AM | Updated on Sep 4 2017 6:29 PM

రాయలసీమ యూనివర్సిటీ అధికారులు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మూడు నెలలకే మూతపడిన కొత్తమెస్‌
– లోకల్‌ బ్రాండు వంట సామగ్రి కొనుగోలు! 
– స్టీమ్‌కుక్కర్లు వెడేక్కుతుండడంతో పనిచేయడానికి సిబ్బంది నిరాకరణ
– రూ.60 లక్షలు వృథా
– మెస్‌హాల్‌ సరిపోకనే మూసినట్లు అధికారుల వివరణ
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రాయలసీమ యూనివర్సిటీ అధికారులు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వంట సామగ్రి కొనుగోలులో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామగ్రి లోకల్‌ మేడ్‌ కావడం, అవి వెడేక్కిపోతుండడంతో సిబ్బంది పని చేయలేక చేతులు ఎత్తేసినట్లు సమాచారం. దీంతో రూ.60 లక్షలతో నూతంగా నిర్మించిన మెస్‌ మూడు నెలలకే మూతపడింది. అయితే అధికారులు మాత్రం విద్యార్థుల సంఖ్యకు మెస్‌హాల్‌ సరిపోవకపోవడంతోనే మూసేసినట్లు చెబుతున్నారు.
లోకల్‌ బ్రాండు సామగ్రి కొనుగోలు..
 వర్సిటీలో బాల బాలికలకు వేర్వేరు హాస్టళ్లు, మెస్‌ హాళ్లు ఉన్నాయి. బాలికలు భ్రమరాంబ హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. వీరికి అక్కడే మెస్‌ హాల్‌ ఉంది. బాలురుకు తుంగభద్ర, సంగమేశ్వరం, కృష్ణా హాస్టళ్లున్నాయి. గతేడాది వరకు మూడు హాస్టళ్ల విద్యార్థులు తుంగభద్ర హాస్టల్‌లోని మెస్‌లో భోజనం చేసేవారు. మూడు హాస్టళ్లలో కలిపి ఏటా దాదాపు 350–400 మంది విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో వేమన హాస్టల్‌ సమూదాన్ని కొత్తగా మెస్‌గా మార్చారు. ఇందులో అధునాతన పరికరాల కొనుగోలు కోసం రూ.60 లక్షలను కేటాయించారు. వీటితో మినరల్‌ వాటర్‌ ప్లాంటు, సీసీ కెమెరాలు, వైఫై సౌకర్యం, స్టీమ్‌కుక్కర్లు, కూర్చోని భోజనం చేయడానికి కుర్చీలు, బెంచీలు, ప్లేట్లు, గ్లాసులతోపాటు వంట సామగ్రిని కొనుగోలు చేశారు.
వేడెక్కుతున్న స్టీమ్‌కుక్కర్లు.. 
రూ.60 లక్షలతో కొత్త మెస్‌ కోసం ప్రముఖ బ్రాండ్‌ కంపెనీల వస్తువులను హైదరాబాద్‌లో కొనుగోలు చేసినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. స్వయంగా రిజిస్ట్రార్, వార్డెన్‌ సామగ్రిని పరిశీలించినట్లు చెప్పారు. అయితే వాటిని లోకల్‌గానే కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. స్టీమ్‌ కుక్కర్లు వంట సమయంలో వేడెక్కుతుండడంతో సిబ్బంది పనిచేయడానికి విముఖతను చూపడంతో మెస్‌ను మూసివేసినట్లు సమాచారం. మెస్‌లోని మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఒక్కరోజూ చుక్క నీరివ్వలేదని సిబ్బందే పేర్కొంటున్నారు. 
విద్యార్థులకు సరిపోవడం లేదని...
 జూలై నుంచి ప్రారంభమైన కొత్త మెస్‌ హాల్‌లో ఫస్టియర్‌ విద్యార్థులు భోజనం చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. బాలుర విభాగంలో ఫస్టియర్‌ విద్యార్థులు దాదాపు 150 మంది ఉన్నారు. కొత్త మెస్‌ హాల్‌ సీటింగ్‌ క్యాపాసిటీ 70–75 మందికి సరిపోతుంది. అంటే రెండు బంతుల్లో వారంతా భోజనం చేయవచ్చు. దీంతో విద్యార్థులకు పెద్ద ఇబ్బందేమీ లేదు. కేవలం లోకల్‌ బ్రాండ్‌ సామగ్రి కారణంగానే మెస్‌కు తాళం పడినట్లు అర్థమవుతోంది. 
 
విచారణ జరపాలి
నూతన మెస్‌హాల్‌ వస్తువుల కొనుగోలు భారీ అవినీతి జరిగింది. స్థానికంగా దొరికే వంట సామగ్రిని   కొనుగోలు చేసి ఎక్కువ బిల్లులు పెట్టకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఆడిట్‌ను పక్కాగా చేపట్టాలి. లేదంటే ఆందోళన తప్పదు. – రాఘవేంద్ర, అంబేద్కర్‌ విద్యార్థి అసోసియేషన్‌
 
ఎలాంటి అవినీతి లేదు
కొత్త మెస్‌ హాల్‌ వంట సామగ్రి కొనుగోలులో ఎలాంటి అవినీతి లేదు. లోకల్‌గా కొన్నట్లు వస్తున్న ఆరోపణలు నిరాధారం. సిబ్బంది తక్కువగా ఉండడంతోనే తాత్కాలికంగా బంద్‌ చేశాం. అంతేకాక కొన్ని మైనర్‌ రిపేర్లు ఉన్నాయి. త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తాం. – వై.నరసింహులు, వీసీ, రాయలసీమ యూనివర్సిటీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement