భవిష్యత్‌లో ఎగిరేది వైఎస్సార్ సీపీ జెండానే
శ్రీరామవరం (దెందులూరు) : రాష్ట్రంలో వచ్చేది వైఎస్సార్ స్వర్ణయుగమేనని, దెందులూరు నియోజకవర్గంలో ఎగిరేది వైఎస్సార్ సీపీ జెండాయేనని తెలుగుదేశం ప్రభుత్వం మునిగిపోయే నావని, వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోటగిరి శ్రీధర్ అన్నారు. శనివారం శ్రీరామవరం గ్రామంలో వైఎస్సార్ సీపీ మండల మహిళా నేత కామిరెడ్డి జలజాక్షి, కామిరెడ్డి యూత్ అధ్యక్షుడు కామిరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి బహిరంగ సభ జరిగింది.
ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు, రైతులు, మేధావులతో పాటు యువతరం టీడీపీకి చరమగీతం పాడనున్నారన్నారు. విదేశాల్లో దెందులూరు అని చెబుతుంటే కోడిపందేలు, ఇసుక మాఫియా, పేకాట అంటూ హేళన చేస్తున్నారన్నారు. దివంగత వైఎస్సార్, కోటగిరిల పాలన అందిస్తామన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్సార్ సీపీ యూకే, యూరప్ దేశాల కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెట్టే పెట్టీ కేసులకు భయపడేది లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం చేయకుండా అధికారులను, ఉద్యోగులను తిట్టడం, కొట్టడం మానుకోవాలన్నారు. ఇసుక మాఫియా కోడిపందేలు, పేకాట, మట్టి, గ్రావెల్ అమ్ముకోవడంలో దెందులూరు నియోజకవర్గం రాష్ట్రంలో మారుమోగిపోతోందన్నారు. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని తానేంటో చూపిస్తానని కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తానని, ప్రజల సమస్యల తెలుసుకుని అండగా ఉంటానన్నారు. తొలుత దెందులూరు చెక్‌పోస్ట్ నుంచి వందలాది వాహనాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీరామవరం వరకు ర్యాలీ నిర్వహించారు. దెందులూరు, శ్రీరామవరం గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులరి్పంచారు. శ్రీరామవరంలో గడపగడపకూ వైఎస్సార్ నిర్వహించారు, మండల మహిళానేత కామిరెడ్డి జలజాక్షి, కోటగిరి, కొఠారులకు హారతులిచ్చి ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో దెందులూరు, పెదవేగి మండల కన్వీనర్లు బొమ్మనబోయిన నాని, మెట్లపల్లి సూరిబాబు, వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు సూర్యనారాయణ, పార్టీ నాయకులు జానంపేటబాబు, ఆళ్ల సతీష్, చెలికాని రాజబాబు, ఎమ్మార్డీ బలరామ్, జిల్లా కమిటీ సభ్యులు తొత్తడి వేధకుమారి, ఎలమర్తి రామకృష్ణ పాల్గొన్నారు.