గిన్నిస్ బుక్‌లో మన ‘ఫేషియల్ యోగా’
సాక్షి, హైదరాబాద్: మహానగరం పేరు మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మారుమోగింది. గ్లామర్ రంగ ప్రముఖురాలు రుచికాశర్మ ఏక కాలంలో 1,764 మందితో ‘ఫేషియల్ యోగా’ సాధన చేయించి ప్రపంచ రికార్డు లిఖించారు. ‘బీయింగ్ ఉమెన్’ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఈ మెగా ఈవెంట్ జరిగింది. దీంతో గతంలో 295 మందితో థాయ్‌లాండ్‌లో నెలకొల్పిన రికార్డు బద్దలైంది. దీన్ని ప్రత్యక్షంగా తిల కించిన ‘గిన్ని స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ప్రతి నిధి ఎలోనారా గ్రీనాక్ రికార్డు నమోదు ప్రతిని రుచికాశర్మకు అందించారు. వయసుతో ము ఖంలో వచ్చే మార్పులను ఫేషియల్ యోగాతో నియంత్రించవచ్చని రుచిక చెప్పారు.
ఆమెకా అర్హత లేదు...
గిన్నిస్ రికార్డు సాధించిన రుచికాశర్మకు అసలు ఫేస్ యోగాతో ఏమాత్రం సంబంధం లేదని అంతర్జాతీయ ఫేస్ యోగా ట్రైనర్ మాన్సీ గులాటీ ఆరోపిం చారు. తాను జాతీయ స్థాయిలో అనేక శిక్షణలు, పరిశోధనల అనంతరం రూపొం దించిన ఫేస్ యోగా టిప్స్‌ను రుచిక కాపీ చేసి, గిన్నిస్ రికార్డ్ యాజమాన్యాన్ని సైతం తప్పుదోవ పట్టించారన్నారు. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో రుజువు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు.