
టిప్పర్ ఢీకొని బాలుడి మృతి
సుల్తాన్‌పూర్‌తండా (మఠంపల్లి):
టిప్పర్ ఢీకొని బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని సుల్తాన్‌పూర్‌తండాలో గురువారం చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌తండా పునరావాస కాలనీకి చెందిన భూక్యారెడ్య, బూలిల కుమారుడు భూక్యా విష్ణువర్థన్ (6) పెదవీడు విద్యాన్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు.రోజూ పాఠశాలకు చెందిన బస్సే విద్యార్థులను తీసుకెళ్లి మళ్లీ విడిచిపెడుతుంది. ఈ క్రమంలో ఉదయం విష్ణువర్ధన్ స్కూల్ బస్సు ఎక్కేందుకు తండాలోనే రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో పెదవీడు నుంచి మట్టపల్లి వైపు వేగంగా వెళ్తున్న టిప్పర్ విష్ణువర్ధన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని 108 వాహనం ద్వారా హుజూర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
సుల్తాన్‌పూర్‌తండాలో విషాదఛాయలు...
ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటంతో బాలుడి తల్లిదండ్రి గుండెలవిసేలా రోదించాడు. తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే పునరావాస కాలనీ మధ్యలో నుంచి ప్రధాన రహదారి వెళుతున్నప్పటికీ సంబంధిత అధికారులు రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.