
వాసాలమర్రిలో ఉద్రిక్తత
– బాధితులకు న్యాయం చేయాలని బంధువుల ఆందోళన
– ఫర్నిచర్ ధ్వంసం, బియ్యం పారబోత
– విషమంగానే లావణ్య, స్రవంతి ఆరోగ్య పరిస్థితి
తుర్కపల్లి
మండలంలోని వాసాలమర్రిలో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. భర్త దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లావణ్య, ఆమె కూతురుకు న్యాయం చేయాలని ఆదివారం బంధువులు ఆందోళనకు దిగారు. ముందుగా రామచంద్రం ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడవేశారు. బియ్యాన్ని రోడ్డుపై పారబోశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. నిందితుడు రామచంద్రం అతడి కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం వాసాలమర్రి నుంచి కొండాపూర్ రోడ్డు మధ్యలో బైఠాయించారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకుని ఎస్‌ఐ మసియెుద్దీన్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు.