సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలి
-
టీడీపీ సమన్వయ కమిటీలో తీర్మానం
వరంగల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నాయకులు పూర్తిస్థాయిలో పనిచేయాలని ఆ పార్టీ జిల్లా సమన్వయ కమి టీ సమావేశంలో తీర్మాణించారు. హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మిగిలిన ఉన్న పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేయాలని నిర్ణయించారు. సోమవారం జరిగిన భూపాలపల్లి, పరకాల నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని, రానున్న కాలంలో టీడీపీకి మంచి రోజులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మంగళవారం మహబూబాబాద్ మార్వాడీ గార్డెన్స్‌లో మహబూబాబాద్, మధ్యాహ్నం ఒంటిగంటకు మరిపెడ ఏఎన్‌ఆర్ గార్డెన్స్‌లో డోర్నకల్, 4న హన్మకొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 9గంటలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టాలని తీర్మాణించారు. 5న బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు, మధ్యాహ్నం 2గంటలకు ములుగులో, 6న వర్ధన్నపేట, 8న ఉదయం 10 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్, మధ్యాహ్నం జనగామలో ఆయా నియోజకవర్గ సమావేశాలు నిర్వహించాలని కమిటీలో నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సీతక్క, ఈగ మల్లేషం, అధికార ప్రతినిధి వేం నరేందర్‌రెడ్డి, గట్టు ప్రసాద్‌బాబు, బొట్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం పాల్గొన్నారు.