మిర్యాలగూడ టౌన్: జాతీయ జెండాను అవమానించిన కేసులో మహిళకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ సోమవారం మిర్యాలగూడ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎ. నాగరాజు తీర్పు నిచ్చారు.
వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో గల మాతృశ్రీ మహిళా మండలి భవనం వద్ద 2011లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఆ మండలి నాయకురాళ్లు వచ్చారు. ఆ సమయంలో అదే భవనంలో నివసిస్తున్న దర్శనం నిర్మల అనే మహిళ జెండాను కట్టిన కర్రను విరగగొట్టి అసభ్యంగా మాట్లాడి జాతీయ జెండాను అవమానించింది. దీంతో మాతృశ్రీ మహిళా మండలి నాయకురాళ్లు మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు అప్పటి ఏఎస్‌ఐ జిలానీ కేసు నమోదు చేయగా అప్పటి ఎస్‌ఐ జి. రవి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీంతో జాతీయ జెండాను అవమానించినందుకు దర్శనం నిర్మలపై నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానాను జడ్జి విధించారు. ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల పాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తీర్పు చెప్పారు.
జాతీయ జెండాను అవమానించి మహిళకు..
Published Mon, Nov 23 2015 10:28 PM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM
Advertisement
Advertisement