మత్తుకు కొత్త మార్గాలు
శ్రీకాకుళం : కవితకు కాదేదీ అనర్హం.. అన్నట్లు యువకులు మత్తు కోసం కొత్త కొత్త మార్గాలను కొనుగొంటున్నారు. తాజాగా ఫెవికాల్‌ను ఇందుకు ఎంచుకుంటున్నారు. ఫెవికాల్‌ను ఓ ఫాలథిన్ కవర్లో వేసి వాసన చూస్తూ మత్తులో జోగిపోతున్నారు. ఇందులో మరేదైనా కలుపుతున్నారా, లేదా అన్నది యువకులు చెప్పడం లేదు. ఇటీవల ఆదివారంపేట నుంచి రిమ్స్ ఆస్పత్రి వరకు ఉన్న నాగావళి నది గట్టుపై ఇటువంటి యువకులను పలువురు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న సాక్షి అక్కడికి వెళ్లేసరికి పలువురు యువకులు నడవలేని స్థితిలో మత్తులో అచేతనంగా ఉండిపోయారు.
వారి పక్కన ఫెవికాల్ డబ్బాలు, పాలథిన్ కవర్లు ఉన్నాయి. దీనిని వాసన చూస్తే మత్తు వస్తోందని, దీనిని తాము మానలేకపోతున్నామని మత్తులో ఉన్న యువకులు అతి కష్టం మీద సాక్షికి తెలిపారు. ఫెవికాల్‌లో మరేదైనా కలుపుతున్నారా! అన్న దానికి వారు సమాధానం కూడా చెప్పలేకపోయారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇటువంటి వాటిపై నిఘా వేసి యువత ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.