మోదీజీ.. సమయమివ్వండి
♦ ప్రధాన మంత్రికి జగన్ లేఖ
♦ ప్రత్యేక హోదా రాష్ర్ట ప్రజల ఆకాంక్ష
♦ అందుకోసం నిరంతరంగా పోరాడుతున్నాం
♦ ఆ వివరాలతో వినతిపత్రం సమర్పిస్తాం
♦ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా కలుస్తాం
♦ గన్నవరం లేదా తిరుపతిలో... మీ ఇష్టం..
సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మిమ్మల్ని కలసి వివరించేందుకు సమయమివ్వండి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ నెల 22 వ తేదీన రాజధాని శంకుస్థాపనకు వస్తున్నందున ఆ సమయంలో ప్రత్యేక హోదా అంశంపై వినతిపత్రం సమర్పించడానికి తమకు సమయం కేటాయించాలని కోరారు. ఈ మేరకు జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 14 న ప్రధానమంత్రి మోదీకి ఒక లేఖ రాశారు. ఏపీ శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ లేఖను విడుదల చేశారు.
కీలకమైన ప్రత్యేక హోదా గురించి వివరించేందుకు తమకు ప్రధానమంత్రి తప్పకుండా సమయం కేటాయిస్తారన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదాను నెరవేర్చడానికి తాము అనేక రకాలుగా పోరాడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అదే విషయాన్ని తాము వ్యక్తిగతంగా కలిసి వివరించాలని భావిస్తున్నట్టు జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలన్న రాష్ట్ర ప్రజల ప్రగాఢమైన ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర శాసనసభలో ఏకైక, ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్సార్‌సీపీ శాయశక్తులా కృషి చేస్తోంది.
ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాతో పాటుగా పార్టీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఇటీవల నేను గుంటూరులో ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశాను. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మా ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగించడం తప్ప మాకు మరో మార్గం కనిపించడంలేదని మనవి చేస్తున్నాను. నేను, మా పార్టీకి చెందిన 66 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్సీలు అందరం ఈ నెల 22 వ తేదీన మీ రాక సందర్భంగా మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని భావిస్తున్నాం.
సాధ్యమైనంత త్వరగా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఒక వినతిపత్రం మీకు సమర్పించాలని అభిలషిస్తున్నాం. అందువల్ల ఈ నెల 22 న గన్నవరం విమానాశ్రయం వద్ద గాని, లేదా తిరుపతిలో గాని మీకు వీలున్న చోట మాకు సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను.’ అని జగన్ ప్రధానమంత్రికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
సమయమిస్తారన్న నమ్మకముంది
తాము రాసిన లేఖకు స్పందించి తమకు ప్రధాని తప్పకుండా సమయం కేటాయిస్తారనే నమ్మకం ఉందని ఉమ్మారెడ్డి అన్నారు. విభజన బిల్లులో ఇచ్చిన పలు హామీలకు అందజేస్తున్న సహకారానికే ‘ప్యాకేజీ’ అనే పేరు పెడుతున్నారన్న విషయాన్ని తాము ప్రధాని దృష్టికి తేవాలనుకుంటున్నామని, ప్రజలకు హక్కుగా లభించిన ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయదల్చుకున్నామని ఆయన అన్నారు. రాజధాని శంకుస్థాపనకు వెళ్ల రాదని తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏనాడూ ప్రతిపక్షాన్ని పట్టించుకోలేదని, రాజధానికి స్థలాన్ని ఎంపిక చేసేటపుడు గాని, భూమిపూజ చేసేటపుడు గాని, అసలు భూసేకరణకు సంబంధించిన నిర్ణయం తీసుకునేటపుడు గాని ప్రతిపక్షనేతను అసలు భాగస్వామిని చేయలేదని ఉమ్మారెడ్డి అన్నారు. ప్రతిపక్షనేతను ప్రొటోకాల్ ప్రకారం గౌరవించలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బలవంతంగా రైతుల నుంచి సేకరించిన భూములను సింగపూర్ వారి చే తుల్లో పెట్టి అభివృద్ధి కోసం ఇస్తున్నామన్నట్లుగా ప్రభుత్వం చెప్పడం పట్ల తమ పార్టీకి అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. రాజధానికి రైతులే తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారని ప్రభుత్వం చెప్పడం శుద్ధ అబద్ధమని, రైతులను పోలీసు స్టేషన్లకు బలవంతంగా పిలిపించుకుని బెదిరించి సంతకాలు చేయించుకున్నారని ఉమ్మారెడ్డి అన్నారు.