ఎవరైతే మాకేంటి! | janmabhumi committee involves on own house scheme | Sakshi
Sakshi News home page

ఎవరైతే మాకేంటి!

Published Wed, Jun 7 2017 11:11 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM

janmabhumi committee involves on own house scheme

– ‘సొంతింటి’పై జన్మభూమి కమిటీల పెత్తనం
– కలెక్టర్‌ ఆదేశాలూ బేఖాతరు
– కేటాయించిన ఇళ్లకు ఒక్క ప్రతిపాదనా రానివైనం
– ఎక్కడికక్కడ మితిమీరుతున్న రాజకీయ జోక్యం

అనంతపురం టౌన్‌ :
= జిల్లాకు ఎన్టీఆర్‌ రూరల్‌ హౌసింగ్‌ కింద కేటాయించిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను రెండ్రోజుల్లో సిద్ధం చేయండి. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పని చేయండి.
– గత నెల 29న అధికారులకు కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశం.

 
= జన్మభూమి కమిటీలను సీఎం చంద్రబాబు మా కోసమే ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో ఎవరు ఏ రాజకీయ పార్టీ నేతలో, సానుభూతిపరులో గుర్తించాకే ‘సంక్షేమం’ సంగతి చూస్తాం. మన వాళ్లు కాకుంటే ఇళ్లు ఎలా మంజూరు చేస్తాం. ప్రసక్తే లేదు. ఎవరి మాటా వినేది లేదు. అది కలెక్టరైనా..ఇంకోరైనా..!
– జన్మభూమి కమిటీ సభ్యుల తీరిది.


పేదవాడి సొంతింటి కలపై ‘పచ్చ’ రాజకీయం స్వారీ చేస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న వాళ్లకే ‘సంక్షేమ’ పథకాలు అందాలన్న ధోరణిలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో నేతలు, కార్యకర్తలకు సర్వాధికారాలు ఇస్తూ ‘జన్మభూమి’ కమిటీల పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారు. సాక్షాత్తూ కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశాలు జారీ చేసినా అటు అధికారులు, ఇటు జన్మభూమి కమిటీ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నిరుపేదలు ‘సొంతింటి’కి దూరమవుతున్నారు. జిల్లాకు 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం గత నెలలో 14 నియోజకవర్గాలకు కలిపి 29,500 ఇళ్లు కేటాయించింది.

ఒక్కో ఏడాదికి గాను 14,750 ఇళ్లకు ప్రతిపాదనలు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందులో ఎస్సీ వర్గాలకు 2573, ఎస్టీలకు 602, మైనార్టీలకు 850, బీసీలు, ఇతరులకు 10,725 చొప్పున ఇళ్ల కేటాయించారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో మితిమీరిన రాజకీయం చోటు చేసుకుంటోంది. గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్న వారు, పార్టీ కార్యకర్తలకే పెద్ద పీట వేస్తున్నారు. ఇళ్లు లేని నిరుపేదలు ఎంపీడీఓ, తహశీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఏ అధికారిని సంప్రదించినా ముందుగా ‘జన్మభూమి’ని ప్రసన్నం చేసుకోవాలని సూచిస్తున్నారు.  దీంతో అన్ని అర్హతలున్నా నిలువనీడ లేక పేదలు అవస్థలు పడుతున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలూ బేఖాతర్‌ :
రెండేళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితా పంపడంలో నిర్లక్ష్యంపై గత నెల 29న ‘అనుగృహమేదీ’ శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన కలెక్టర్‌ వీరపాండియన్‌ అదే రోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి మండల స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మే 31వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితా పంపాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో హౌసింగ్‌ అధికారులు కూడా ఎంపీడీఓ, తహశీల్దార్లకు జాబితాను త్వరగా పంపాలని ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయినా  ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ప్రతిపాదనలు రాలేదంటే ఉన్నతాధికారుల ఆదేశాలను ఏ మేరకు అమలుచేస్తున్నారో అర్థమవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement