own house scheme
-
సొంత జాగాల్లో ఇళ్లకు దసరా తరువాత ముహూర్తం
గజ్వేల్: సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3లక్షలు పంపిణీ చేసే పథకానికి దసరా తర్వాత శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ, శేర్పల్లి గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం పంపిణీ చేశారు. ఆ తర్వాత గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్ మాట్లాడుతూ.. కరోనా వల్ల రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గడం వల్ల సొంత జాగాల్లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించలేక పోయామన్నారు. దసరా తర్వాత నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సాగు పెట్టుబడి తగ్గించి, రాబడి పెంచుతామని చెప్పిన కేంద్రం డీజిల్, ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరిచిందని విమర్శించారు. రైతులకు గొప్పగా ఉపయోగపడుతున్న ఉచిత కరెంట్‌ను కూడా వద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చదవండి: రాష్ట్రంలోకి అడెల్లు, మంగులు దళాలు! కేసీఆర్ పర్యటన రూటుమార్పు? -
పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
ఏపీ బడ్జెట్: పేదల సొంతింటి కల సాకారం
సాక్షి, అమరావతి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇప్పటికే 25,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను 30.76 లక్షల మందికి పంపిణీ చేసిన ప్రభుత్వం.. వాటిలో మూడేళ్లలో ఇళ్లను నిర్మించి ఇవ్వడం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ప్రస్తుత బడ్జెట్లో రూ.5,661.57 కోట్లను కేటాయించి చిత్తశుద్ధి చాటింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు చొప్పున అర్హులైన 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలను ఇప్పటికే పంపిణీ చేశారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 4.63 లక్షల మందికి మాత్రమే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే గత సర్కార్ కంటే ఇప్పుడు ఆరు రెట్లు ఎక్కువ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్టు స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 17,005 లే–అవుట్లలో 28.30 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఈ లే–అవుట్లలో వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో తాగునీటి సరఫరా, విద్యుత్, మురుగునీటి కాలువలు, అంతర్గత రహదారులు, ప్రధాన రహదారులతో అనుసంధానం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి.. ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి రూ.50,940 కోట్లతో ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. 17,005 ఊళ్లను నిర్మిస్తున్నట్టు స్పష్టమవుతోంది. తక్కువ కాలంలో ఇంత భారీ ఎత్తున కొత్తగా ఊళ్లను నిర్మించిన దాఖలాల్లేవని సామాజికవేత్తలు చెబుతున్నారు. ఏపీ టిడ్కో నేతృత్వంలో 2.60 లక్షల ఇళ్లను నిర్మించి మహిళలకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు. -
నిరుపేదలకు త్వరలో శుభవార్త: మంత్రి హరీశ్‌రావు
సాక్షి,సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు సీఎం కేసీఆర్ త్వరలో శుభవార్త ప్రకటించనున్నారని, సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి సర్కార్ చేయూతగా నిలువనుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందుకోసం బడ్జెట్లో పది వేల కోట్ల రుపాయాలను కేటాయించిందని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని 8వ వార్డు హనుమాన్‌నగర్‌లో రూ. 15లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభించారు. స్థానిక 30 వ వార్డులో సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మరో రెండు నెలల్లో ఇండ్ల నిర్మాణం ప్రారంభం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల మంజూరీలో ఇబ్బందులు ఎదరవ్వకుండా బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయించామన్నారు. సెకండ్ వేవ్‌తో జాగ్రత్త.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి మరోసారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వీయనియంత్రణలో మెదలాలని సూచించారు. ఏప్రిల్ నుంచి కేంద్రం 45 సంవత్సరాల వారికి కూడా టీకా ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చిందన్నారు. అనంతరం తన నివాస గృహాంలో నియోజకవర్గంలోని లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సూడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, కౌన్సిలర్లు వజీర్, నర్సయ్య పాల్గొన్నారు. మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి హరీశ్‌రావు మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ పందిరి కూరగాయాల సాగు చేస్తున్న రైతులకు ఆదివారం సాయంత్రం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేశారు. నాబార్డు సహకారంతో సిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇబ్రహీంపూర్, గుర్రాలగొంది, ఇర్కొడు, పెద్ద లింగారెడ్డిపల్లి, వెంకటాపూర్, విఠలాపూర్ గ్రామాలకు చెందిన రైతులకు రెండో విడత కింద ఒక్కొక్కరికి రూ. 23,750 చెక్కులను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. తెలంగాణ సినిమాలను ఆదరించాలి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలంగాణ ప్రాంతంలో నిర్మించే సినిమాలను ఆదరించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శ్రీ లక్ష్మినర్సింహా ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్, అజయ్ నతారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెంకీ.. పింకీ.. జంప్ సినిమాకు హౌసింగ్‌బోర్డు కాలనీలో ఆదివారం ఉదయం మంత్రి మొదటి షాట్ కోసం క్లాప్ కొట్టగా, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, హీరో విక్రమ్, హీరోయిన్లు, ఇతర నటీనటులు పాల్గొన్నారు. హోలీ శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు మంత్రి హరీశ్‌రావు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని, అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖసంతోషాలతో జరుపుకొంటున్నారని అన్నారు. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. చదవండి: అత్తా కోడళ్ల పంచాయితీ: ఇంట్లోకి రానివ్వకపోవడంతో.. ఎమ్మెల్సీ సురభివాణికి కరోనా పాజిటివ్.. -
ఇళ్ల ధరలకు రెక్కలు!
సాక్షి, సిటీబ్యూరో: మహానగరం పరిధిలో ఇండిపెండెంట్‌గృహాల ధరలు ఇటీవలికాలంలో అమాంతం పెరిగాయి. దీంతో మధ్యతరగతి వేతన జీవులకు సొంతింటి కల దూరమవుతోంది. మహానగరం పరిధిలో ఇండిపెండెంట్ ఇళ్లు ,అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల ధరలు 10–15 శాతంపెరగడంతో సగటుజీవులకు ఇళ్ల కొనుగోలు భారంగా పరిణమించింది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా తాజా అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం సిమెంటు, స్టీలు ధరలు అనూహ్యంగా పెరగడం, నగరంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లక్షలాదిమంది వలసకూలీలు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లడంతో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడం నిర్మాణరంగ సంస్థలకు తలకు మించిన భారంలాపరిణమించింది. ఈ నేపథ్యంలో ధరలను పెంచక తప్పడంలేదని బిల్డర్లు వాపోతున్నారు. ధరల పెరుగుదలకు కారణాలివే.. ⇒ ప్రస్తుతం సిమెంట్, స్టీలు, రీఇన్ఫోర్స్డ్ సిమెంట్‌కాంక్రీట్, శానిటరీ, ఎలక్ట్రికల్ విడిభాగాల ధరలు అనూహ్యంగా పెరగడంతో బిల్డర్లు ఇళ్ల ధరలను పెంచేస్తున్నారు. ⇒ పలు రెడీమిక్స్ కాంక్రీటు ప్లాంట్లకు సిమెంటు, ఇసుక కొరత తీవ్రంగా ఉండడంతో సకాలంలో ఇంటి నిర్మాణాలకు కాంక్రీటు సరఫరా జరగడంలేదు. ⇒ సిమెంట్ కంపెనీలకు సైతం కూలీల కొరత ఉండడంతో సిమెంటు ఉత్పత్తి తగ్గింది. దీంతో ధరలు కూడా భారీగా పెరిగాయి. ఉదాహరణకు కోవిడ్‌కంటే ముందు రూ.260కి లభించిన బస్తా సిమెంటు..ఇప్పుడు రూ.345 ధర పలకుతోంది. ⇒ స్టీలు ధర కూడా టన్నుకు రూ.1000 మేర పెరిగినట్లు బిల్డర్లు చెబుతున్నారు. ⇒ నగరంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న యూపీ, బీహార్, రాజస్థాన్, ఒడిస్సా తదితర రాష్ట్రాలకు చెందిన వలసకూలీలు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లడంతో లేబర్ కొరత తీవ్రంగా ఉంది. ఇప్పుడిప్పుడే నగరానికి కూలీలు చేరుకున్నప్పటికీ డిమాండ్‌కు సరిపడా కూలీలు అందుబాటులో లేరు. ⇒ ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేబర్ ఛార్జీలు కోవిడ్ కంటే ముందు పరిస్థితితో పోల్చుకుంటే 25 శాతం అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ⇒ గతంలో ఒక రోజు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారికి రూ.800 చెల్లిస్తే..ఇప్పుడు రూ.1000 నుంచి రూ.1200 వరకు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం.. సాధారణంగా నిర్మాణ రంగంలో సిమెంటు, స్టీలు, ఇటుకలు, కలప, శానిటరీ, ఎలక్ట్రికల్ సామాను ధరలతోపాటు లేబర్ ఛార్జీలు 70–80 శాతం మేర ఉంటాయి. వీటి ధరలు ప్రస్తుతం అనూహ్యంగా పెరగడంతో ఈ ఏడాది చివరి వరకు ఇళ్ల ధరలు దిగివచ్చే అవకాశాలు లేవని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ఇండియా తాజా అధ్యయనంలో వెల్లడించింది. అయితే మన దేశంలోని ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ధర వరకు కాస్త తక్కువేనని..పెరుగుదల కూడా అంతగా ఉండదని స్పష్టంచేసింది. మరోవైపు హైటెక్‌సిటీ, కోకాపేట్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో కోవిడ్ టైమ్స్‌లోనూ భూముల ధరలు దిగిరాకపోవడంతో ఇళ్ల ధరల పెరుగుదలకు మరో కారణమని తెలిపింది. ఇక నగరంలో హైటెక్‌సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో చదరపు అడుగు నిర్మాణాలకు రూ.6500 నుంచి రూ.7000, గచ్చిబౌలిలో రూ.6000–6300, కొండాపూర్‌లో రూ.6200–6500, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రూ.10,000–12000 మేర ధరలు పలుకుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవు ప్రస్తుతం సిమెంట్, స్టీలు, శానిటరీ, ఎలక్ట్రికల్ విడిభాగాల ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో ఇళ్ల ధరలు తగ్గే అవకాశాలు లేవు. ధరలు పెంచడం అనివార్యమౌతోంది. మరోవైపు లేబర్ కొరత తీవ్రంగా ఉండడంతో నూతన ప్రాజెక్టులు చేపట్టే విషయంలో వెనుకంజవేస్తున్నాం. – కందాడి జైపాల్‌రెడ్డి. బిల్డర్ -
పక్కా(పచ్చ) మోసం!
సొంతింటి నిర్మాణం అనేది ప్రతి మనిషి కల. నిరుపేదలకు మాత్రం అది‘కల’గానే మారింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా పూరి గుడిసె కనిపించకూడదని.. ప్రతి ఒక్కరికి సొంతిళ్లు నిర్మించి ఇవ్వాలని కంకణబద్ధులయ్యారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే జిల్లాలో 2,24,929 గృహాలను మంజూరు చేశారు. తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టాక నిరుపేదలకు గూడు..గోడు బాధలు ఎక్కువయ్యాయి. సాక్షి, కడప రూరల్: ప్రతి మనిషికి కూడు..గూడు..గుడ్డ అవసరం. అందులో పక్కా గృహం ఎంతో కీలకం. పక్కా భవనం ఆ కుటుంబానికి నీడలా ఉంటుంది. భద్రతను ఇస్తుంది. మరి నిరుపేదలు సొంతిళ్లు కట్టుకోవాలంటే సాధ్యమయ్యే పనేనా...?. కలలో కూడా అది సాధ్యం కాదు. అలాంటిది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధ్యమైంది. అన్ని వర్గాలకు చెందిన నిరుపేదలకు సొంతింటి కల సాకారమైంది. 2004కు ముందు సొంతింటి నిర్మాణం కలే.! 2004 సంవత్సరానికి ముందు పట్టణాల్లో సైతం బోద కొట్టాలు కనిపించేవి. ఇక గ్రామాల్లోనైతే దాదాపుగా అన్నీ బోద కొట్టాలు..పూరి గుడిసెలు కనిపించేవి. అరుదుగా మాత్రమే పక్కా భవనాలు కనిపించేవి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కాలనీల్లో అయితే దాదాపుగా మచ్చుకు కూడా పక్కా భవనం కనిపించేది కాదు. నాడు ఆ ప్రాంతానికి చెందిన ఒక శాసన సభ్యుడికి ఒక ఏడాదికి కేవలం 300 నుంచి 400 పైబడి గృహాలను కేటాయించేవారు. అప్పుడు ఆ ఎమ్మెల్యే తనకు ఇష్టమైన వారికి మాత్రమే గృహాన్ని మంజూరు చేసేవారు. ఆ కేటాయింపులు కూడా అత్తెసరుగా జరిగేవి. దీంతో ప్రధానంగా నిరుపేదలకు సొంతింటి కల..కలగానే మిగిలిపోయింది. 2004 తరువాత వైఎస్సార్ వచ్చాక.. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004వ సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ‘సంక్షేమ రాజ్యం’ ప్రారంభమైంది. సొంతిళ్లు లేని ప్రతి నిరుపేదకు ప్రభుత్వం తరఫున గృహాలు మంజూరు చేశారు. అందుకు బిల్లుల చెల్లింపులు తదితర అంశాలకు ఎలాంటి కొరత లేకుండా పటిష్టవంతంగా చర్యలు చేపట్టారు. 2014లో సీఎంగా చంద్రబాబు వచ్చాక..కొంప కొల్లేరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 2014లో బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి సంక్షేమ రంగంలో సంక్షోభం ఏర్పడింది. ఆ ప్రభావం ప్రభుత్వ గృహ నిర్మాణ రంగంపై పడింది. దీంతో నిరుపేదల సొంతింటి కల సాకారం..మళ్లీ కలగానే మారింది. ఈ పథకాన్ని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంగా మార్పు చేశారు. పథకం సమస్తం అస్తవ్యస్తంగా సాగింది. లబ్ధిదారులకు రూ. కోట్లలో బకాయిలు.. ఎన్టీఆర్ గ్రామీణ పథకం (కేంద్ర ప్రభుత్వ నిధులతో) కింద ఒక గృహ నిర్మాణానికి రూ. 2 లక్షలు మంజూరు చేయాలి. అలాగే ఎన్టీఆర్ రూరల్ కింద ఒక గృహ నిర్మాణానికి రూ. 1.50 లక్షలు మంజూరు చేయాలి. ఈ ఎన్టీఆర్ రూరల్ స్కీంకు సంబంధించి సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం, కేంద్ర ప్రభుత్వం 30 శాతం భరించాలి. అలాగే ఈ పథకాల కింద ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఒకరికి రూ. 50 వేల చొప్పున అందజేయాలి. కాగా ఎన్టీఆర్ గ్రామీణ యూనిట్ విలువ రూ. 2 లక్షలు, ఎన్టీఆర్ రూరల్ యూనిట్ విలువ రూ. 1.50 లక్షలు. ఒక యూనిట్లో రూ. 55 వేల చొప్పున ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఉంటాయి. ఈ రూ. 55 వేల బిల్లు చాలా మంది లబ్ధిదారులకు అందలేదు. అంటే ఒక యూనిట్ విలువ రూ. 2 లక్షలు, రూ. 1.50 లక్షల్లో , రూ. 55 వేలు అందకుండానే చాలా మంది లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు ఈ నిధులే దాదాపు రూ. 30 కోట్లకు పైగా లబ్ధిదారులకు బిల్లుల రూపంలో అందాలి. అలాగే మిగతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న బిల్లులు రూ. 60 కోట్లను కలుపుకుంటే మొత్తం రూ. 100 కోట్లకు పైగా జిల్లాలోని లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం రూ. 30 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు. సంక్షేమం పేరుతో పాలకులు అంకెల గారడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బ్యాంకర్ల రుణం ఏదీ.? రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అని నామకరణం చేశాక ఆర్భాటంగా గృహ కేటాయింపులు చేపట్టింది. అయితే నిధులను సకాలంలో మంజూరు చేయకుండా ఇబ్బందులు పెట్టింది. అర్బన్ పథకం కింద ఒక గృహ నిర్మాణం విలువ రూ. 3.50 లక్షలు కాగా అందులో రూ. ఒక లక్ష బ్యాంకర్లు రుణం కింద అందజేయాలి. మిగతా రూ. 2.50 లక్షలు సబ్బిడీ కింద 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. బ్యాంకర్లు ఎంతమంది లబ్ధిదారులకు రూ. లక్ష రుణంగా మంజూరు చేసింది తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో లబ్ధిదారులు బ్యాంకర్లను ప్రసన్నం చేసుకోలేక అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు. నాలుగేళ్లుగా దరఖాస్తు చేస్తున్నాఇల్లు ఇవ్వలేదు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఎన్టీఆర్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నాను. మంజూరు కాలేదు. రెండు సార్లు జన్మభూమి కమిటీల వద్దకు అధికారులే వెళ్లమన్నారు. వారి వద్దకు వెళ్లినప్పటికీ వారి పార్టీ వాడిని కాదని నాకు ఇల్లు మంజూరు చేయలేదు. – చక్రపాణి, బాధితుడు, రేకలకుంట, బ్రహ్మంగారిమఠం మండలం జగన్ ప్రభుత్వం వస్తుందని ఆశతో.. ఇప్పటి వరకూ మా ఊర్లో జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో ఇంటి కోసం అర్జీలు పెట్టాను. అధికారుల చుట్టూ తిరిగాను. ఇల్లు మంజూరు కాలేదు. ఎన్నికలు అయిపోగానే జగన్ ప్రభుత్వంలోనైనా ఇల్లు వస్తుందేమోనని ఆశతో ఉన్నాను. ప్రభుత్వం అందరికీ ఇల్లు ఇస్తేనే బాగుంటుంది. – వీరబోయిన వెంకటలక్షుమ్మ, బాధితురాలు, ఉత్సలవరం, మైదుకూరు మండలం -
‘డబుల్’ హ్యాపీ
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు త్వరలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. దీని ప్రకారం ఇక ‘డబుల్’ ఇంటికి దరఖాస్తు చేసుకునేందుకు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. దరఖాస్తు ఫారాల కోసం హైరానా పడకుండా ఎవరికి వారు తమ కాలనీల్లో ఉన్న మీ–సేవ కేంద్రాల్లో ఆన్లైన్లో దరఖాస్తుచేసుకునేలా అధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు. దరఖాస్తుతో పాటు నిర్ణీత రుసుం రూ.35 మాత్రమే చెల్లించి రశీదు తీసుకుంటే చాలు. ఆపై ఎవరికీ ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించకుండా.. పైరవీలకు తావు లేకుండా ఈ విధి విధానాలు ఉండనున్నాయి. లబ్ధిదారులు మీ–సేవా ద్వారా ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాక ఓ క్రమ సంఖ్య జారీ అవుతుంది. ఓ కుటుంబం ఒకటికి మించి దరఖాస్తు చేసుకోకుండా చర్యటలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం రూపొందిస్తున్నారు. రెండు మూడు చోట్ల దరఖాస్తు చేసుకుంటే ఆధార్ నంబర్ ఆధారంగా సాఫ్ట్వేర్ గుర్తించి అదనపు దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతాయి. దరఖాస్తులో ఆహార భద్రత(రేషన్) కార్డు నంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, అడ్రస్ తదితర వివరాలు పేర్కొనాలి. వాటి ఆధారంగా అధికార యంత్రాంగం దరఖాస్తులను పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ అనంతరం అర్హులను ఎంపిక పక్రియ కొనసాగుతుంది. . పెండింగ్‌లో ఆఫ్‌లైన్, ఆన్లైన్ దరఖాస్తులు మహా నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా రెవెన్యూ యంత్రాంగాల వద్ద ఆఫ్‌లైన్, ఆన్లైన్లో కలిపి సుమారు మూడు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల దరఖాస్తుల తాకిడి మరింత అధికమైంది. ఇప్పటికే ప్రభుత్వం మొదటి విడత కింద మురికివాడల్లోని నివాస ప్రాంతాల్లో స్థల లభ్యతను బట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. స్థానిక నివాస లబ్ధిదారులందరికీ ఇళ్లను మంజూరు చేసి పొజిషియన్ సర్టిఫికెట్లను కూడా అందజేసింది. కొందరికి ఇళ్లు కూడా మంజూరు చేసి స్వాధీనం చేసింది. మొదటి విడత పూర్తవడంతో, రెండో విడత డబుల్ ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. చిగురిస్తున్న ఆశలు కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరడంతో ‘డబుల్’ ఇళ్లపై పేదలకు ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు.. దరఖాస్తులు ఆహ్వానించ లేదు. సాధారణంగా ప్రభుత్వపరంగా మంజూరు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే విధానం అమల్లో ఉండడంతో డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులు మీ–సేవా, ఈ–సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఆ ప్రతులతో అభ్యర్థులు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. అధికారులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ‘ఆన్లైన్’లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారవర్గాలు స్పష్టం చేశాయి. -
ఇల్లు అడిగేందుకు వెళితే అరెస్ట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమకు సొంత ఇల్లు లేదని, ఇల్లు కేటాయించాలని దరఖాస్తు తీసుకుని ముఖ్యమంత్రి సమావేశానికి వెళితే పోలీసులు అరెస్ట్ చేశారని ముస్లిం రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేత సయ్యద్ నూరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. రామవరప్పాడుకు చెందిన నూరుద్దీన్ గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఎన్టీఆర్ గృహప్రవేశాలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనగా, తమకు ఇల్లు కేటాయించాలని కోరేందుకు నూరుద్దీన్ అక్కడకు వెళ్లారు. గత నెలలో జరిగిన రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత కూల్చిన మసీదులు నిర్మించండి అంటూ ప్రశ్నించడంతో, ఈ రోజు కూడా ఇంటికోసం ప్రశ్నిస్తాడనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రి సదస్సు అయ్యే వరకూ వదలకుండా చీకటి గదిలో బంధించడంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఒక సాధారణ ముస్లిం తనకు ఇళ్లు కేటాయించాలని అడిగేందుకు వెళితే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముస్లింల పట్ల ప్రభుత్వం చూపే ప్రేమ ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. మాచవరం స్టేషన్లో నూరుద్దీన్ ఉన్నట్లు తెలుసుకున్న ముస్లింలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి సభ ముగిసిన తర్వాత స్టేషన్‌కు వచ్చిన సీఐ సహేరాబేగం నూరుద్దీన్ నుంచి సంతకాలు సేకరించి విడుదల చేశారు. ట్రాఫిక్ కష్టాలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి సభ సందర్భంగా బందరు రోడ్డులోని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డులో ఒకవైపు జామ్ చేసి, రెండో వైపు నుంచే వాహనాలను అనుమతించడంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. చెన్నుపాటి పెట్రోల్ బంకు నుంచి అమెరికన్ ఆస్పత్రి జంక్షన్ వరకూ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల రెండు రోజులకు ఒక సదస్సు నిర్వహించడం, ముఖ్యమంత్రి పాల్గొనడంతో బందరు రోడ్డుపై వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. -
పోరాడి...సాధించారు
ఏడేళ్ల కిందట పట్టాలు ఇచ్చారు...ఆ పట్టాల స్థలంలో ఇళ్లు కట్టుకోలేదని తాజాగా నోటీసులు ఇవ్వడం ప్రారంభించడంతో లబ్ధిదారుల్లో అలజడి ప్రారంభమయింది. వందలాది మంది బాధితులకు అండగా వైఎస్సార్సీపీ నిలిచింది. అనపర్తి కో ఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. ఉద్రిక్తతను గమనించిన మండల అధికారులు ఆర్డీఓతో చర్చించి లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. అనపర్తి: నిరుపేదలకు సొంత గూడు కల్పించే దిశగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంతో అధికారులు దిగిరాక తప్పలేదు. బాధితులకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవడంతో ఆందోళనను విరమించారు. అనపర్తి గ్రామ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం సేకరించిన స్థలంలో 2011లో 1709 మందికి ఇళ్లు పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చినా ఇళ్లు కట్టుకోకపోవడంతో ‘పట్టాలు ఎందుకు రద్దు చేయకూడదంటూ’ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయటంతో వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న లబ్ధిదారులు అధికారులు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణానికి మంజూరైన రుణాలు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, అప్పటి నుంచి రుణాలు మంజూరు కాకపోవటంతో నిరుపేదలైన లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టలేదని వివరించారు. వెంటనే ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్డీవో హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పరిస్థితిని అధికారులు రామచంద్రపురం ఆర్డీఓ రాజశేఖర్‌ను ఫోన్లో సంప్రదించారు. అనంతరం 2011లో మంజూరు చేసిన ఇళ్ల పట్టాల్లో అర్హులైన లబ్ధిదారుల పట్టాలు రద్దు చేసేదిలేదని, అయితే గ్రామంలో లేని వారి పట్టాలను దర్యాప్తు చేసిన అనంతరం రద్దు చేస్తామని అధికారులు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఐదున్నర గంటలపాటు సాగిన నిరసన కార్యక్రమానికి తెరపడింది. వైఎస్సార్సీపీ నాయకులు సత్తి వీర్రెడ్డి, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మల్లిడి ఆదినారాయణరెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, అధిక సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎవరైతే మాకేంటి!
– ‘సొంతింటి’పై జన్మభూమి కమిటీల పెత్తనం – కలెక్టర్ ఆదేశాలూ బేఖాతరు – కేటాయించిన ఇళ్లకు ఒక్క ప్రతిపాదనా రానివైనం – ఎక్కడికక్కడ మితిమీరుతున్న రాజకీయ జోక్యం అనంతపురం టౌన్ : = జిల్లాకు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద కేటాయించిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను రెండ్రోజుల్లో సిద్ధం చేయండి. ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పని చేయండి. – గత నెల 29న అధికారులకు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశం. = జన్మభూమి కమిటీలను సీఎం చంద్రబాబు మా కోసమే ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో ఎవరు ఏ రాజకీయ పార్టీ నేతలో, సానుభూతిపరులో గుర్తించాకే ‘సంక్షేమం’ సంగతి చూస్తాం. మన వాళ్లు కాకుంటే ఇళ్లు ఎలా మంజూరు చేస్తాం. ప్రసక్తే లేదు. ఎవరి మాటా వినేది లేదు. అది కలెక్టరైనా..ఇంకోరైనా..! – జన్మభూమి కమిటీ సభ్యుల తీరిది. పేదవాడి సొంతింటి కలపై ‘పచ్చ’ రాజకీయం స్వారీ చేస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న వాళ్లకే ‘సంక్షేమ’ పథకాలు అందాలన్న ధోరణిలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో నేతలు, కార్యకర్తలకు సర్వాధికారాలు ఇస్తూ ‘జన్మభూమి’ కమిటీల పేరుతో పెత్తనం చెలాయిస్తున్నారు. సాక్షాత్తూ కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేసినా అటు అధికారులు, ఇటు జన్మభూమి కమిటీ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా నిరుపేదలు ‘సొంతింటి’కి దూరమవుతున్నారు. జిల్లాకు 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం గత నెలలో 14 నియోజకవర్గాలకు కలిపి 29,500 ఇళ్లు కేటాయించింది. ఒక్కో ఏడాదికి గాను 14,750 ఇళ్లకు ప్రతిపాదనలు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందులో ఎస్సీ వర్గాలకు 2573, ఎస్టీలకు 602, మైనార్టీలకు 850, బీసీలు, ఇతరులకు 10,725 చొప్పున ఇళ్ల కేటాయించారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో మితిమీరిన రాజకీయం చోటు చేసుకుంటోంది. గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్న వారు, పార్టీ కార్యకర్తలకే పెద్ద పీట వేస్తున్నారు. ఇళ్లు లేని నిరుపేదలు ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఏ అధికారిని సంప్రదించినా ముందుగా ‘జన్మభూమి’ని ప్రసన్నం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అన్ని అర్హతలున్నా నిలువనీడ లేక పేదలు అవస్థలు పడుతున్నారు. కలెక్టర్ ఆదేశాలూ బేఖాతర్ : రెండేళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితా పంపడంలో నిర్లక్ష్యంపై గత నెల 29న ‘అనుగృహమేదీ’ శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన కలెక్టర్ వీరపాండియన్ అదే రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండల స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మే 31వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితా పంపాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో హౌసింగ్ అధికారులు కూడా ఎంపీడీఓ, తహశీల్దార్లకు జాబితాను త్వరగా పంపాలని ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయినా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం నుంచి కూడా ప్రతిపాదనలు రాలేదంటే ఉన్నతాధికారుల ఆదేశాలను ఏ మేరకు అమలుచేస్తున్నారో అర్థమవుతుంది.