సాక్షి, అమరావతి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. ఇప్పటికే 25,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను 30.76 లక్షల మందికి పంపిణీ చేసిన ప్రభుత్వం.. వాటిలో మూడేళ్లలో ఇళ్లను నిర్మించి ఇవ్వడం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చాలని నిర్ణయించింది. ఆ దిశగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.5,661.57 కోట్లను కేటాయించి చిత్తశుద్ధి చాటింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు చొప్పున అర్హులైన 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలను ఇప్పటికే పంపిణీ చేశారు. టీడీపీ హయాంలో ఐదేళ్లలో 4.63 లక్షల మందికి మాత్రమే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం గమనార్హం.
దీన్ని బట్టి చూస్తే గత సర్కార్ కంటే ఇప్పుడు ఆరు రెట్లు ఎక్కువ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్టు స్పష్టమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 17,005 లే–అవుట్లలో 28.30 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఈ లే–అవుట్లలో వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో తాగునీటి సరఫరా, విద్యుత్, మురుగునీటి కాలువలు, అంతర్గత రహదారులు, ప్రధాన రహదారులతో అనుసంధానం వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి.. ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి రూ.50,940 కోట్లతో ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. 17,005 ఊళ్లను నిర్మిస్తున్నట్టు స్పష్టమవుతోంది. తక్కువ కాలంలో ఇంత భారీ ఎత్తున కొత్తగా ఊళ్లను నిర్మించిన దాఖలాల్లేవని సామాజికవేత్తలు చెబుతున్నారు. ఏపీ టిడ్కో నేతృత్వంలో 2.60 లక్షల ఇళ్లను నిర్మించి మహిళలకు అందజేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment