ముఖ్యమంత్రి సభలో ముస్లిం నేత నూరుద్దీన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమకు సొంత ఇల్లు లేదని, ఇల్లు కేటాయించాలని దరఖాస్తు తీసుకుని ముఖ్యమంత్రి సమావేశానికి వెళితే పోలీసులు అరెస్ట్ చేశారని ముస్లిం రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేత సయ్యద్ నూరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. రామవరప్పాడుకు చెందిన నూరుద్దీన్ గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఎన్టీఆర్ గృహప్రవేశాలు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనగా, తమకు ఇల్లు కేటాయించాలని కోరేందుకు నూరుద్దీన్ అక్కడకు వెళ్లారు.
గత నెలలో జరిగిన రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత కూల్చిన మసీదులు నిర్మించండి అంటూ ప్రశ్నించడంతో, ఈ రోజు కూడా ఇంటికోసం ప్రశ్నిస్తాడనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముఖ్యమంత్రి సదస్సు అయ్యే వరకూ వదలకుండా చీకటి గదిలో బంధించడంపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఒక సాధారణ ముస్లిం తనకు ఇళ్లు కేటాయించాలని అడిగేందుకు వెళితే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముస్లింల పట్ల ప్రభుత్వం చూపే ప్రేమ ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. మాచవరం స్టేషన్‌లో నూరుద్దీన్ ఉన్నట్లు తెలుసుకున్న ముస్లింలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి సభ ముగిసిన తర్వాత స్టేషన్‌కు వచ్చిన సీఐ సహేరాబేగం నూరుద్దీన్ నుంచి సంతకాలు సేకరించి విడుదల చేశారు.
ట్రాఫిక్ కష్టాలు
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి సభ సందర్భంగా బందరు రోడ్డులోని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డులో ఒకవైపు జామ్ చేసి, రెండో వైపు నుంచే వాహనాలను అనుమతించడంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. చెన్నుపాటి పెట్రోల్ బంకు నుంచి అమెరికన్ ఆస్పత్రి జంక్షన్ వరకూ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల రెండు రోజులకు ఒక సదస్సు నిర్వహించడం, ముఖ్యమంత్రి పాల్గొనడంతో బందరు రోడ్డుపై వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment