సొంతింటి నిర్మాణం అనేది ప్రతి మనిషి కల. నిరుపేదలకు మాత్రం అది‘కల’గానే మారింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా పూరి గుడిసె కనిపించకూడదని.. ప్రతి ఒక్కరికి సొంతిళ్లు నిర్మించి ఇవ్వాలని కంకణబద్ధులయ్యారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే జిల్లాలో 2,24,929 గృహాలను మంజూరు చేశారు. తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టాక నిరుపేదలకు గూడు..గోడు బాధలు ఎక్కువయ్యాయి.
సాక్షి, కడప రూరల్: ప్రతి మనిషికి కూడు..గూడు..గుడ్డ అవసరం. అందులో పక్కా గృహం ఎంతో కీలకం. పక్కా భవనం ఆ కుటుంబానికి నీడలా ఉంటుంది. భద్రతను ఇస్తుంది. మరి నిరుపేదలు సొంతిళ్లు కట్టుకోవాలంటే సాధ్యమయ్యే పనేనా...?. కలలో కూడా అది సాధ్యం కాదు. అలాంటిది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధ్యమైంది. అన్ని వర్గాలకు చెందిన నిరుపేదలకు సొంతింటి కల సాకారమైంది.
2004కు ముందు సొంతింటి నిర్మాణం కలే.!
2004 సంవత్సరానికి ముందు పట్టణాల్లో సైతం బోద కొట్టాలు కనిపించేవి. ఇక గ్రామాల్లోనైతే దాదాపుగా అన్నీ బోద కొట్టాలు..పూరి గుడిసెలు కనిపించేవి. అరుదుగా మాత్రమే పక్కా భవనాలు కనిపించేవి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కాలనీల్లో అయితే దాదాపుగా మచ్చుకు కూడా పక్కా భవనం కనిపించేది కాదు. నాడు ఆ ప్రాంతానికి చెందిన ఒక శాసన సభ్యుడికి ఒక ఏడాదికి కేవలం 300 నుంచి 400 పైబడి గృహాలను కేటాయించేవారు. అప్పుడు ఆ ఎమ్మెల్యే తనకు ఇష్టమైన వారికి మాత్రమే గృహాన్ని మంజూరు చేసేవారు. ఆ కేటాయింపులు కూడా అత్తెసరుగా జరిగేవి. దీంతో ప్రధానంగా నిరుపేదలకు సొంతింటి కల..కలగానే మిగిలిపోయింది.
2004 తరువాత వైఎస్సార్ వచ్చాక..
వైఎస్ రాజశేఖరరెడ్డి 2004వ సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ‘సంక్షేమ రాజ్యం’ ప్రారంభమైంది. సొంతిళ్లు లేని ప్రతి నిరుపేదకు ప్రభుత్వం తరఫున గృహాలు మంజూరు చేశారు. అందుకు బిల్లుల చెల్లింపులు తదితర అంశాలకు ఎలాంటి కొరత లేకుండా పటిష్టవంతంగా చర్యలు చేపట్టారు.
2014లో సీఎంగా చంద్రబాబు వచ్చాక..కొంప కొల్లేరే
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 2014లో బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి సంక్షేమ రంగంలో సంక్షోభం ఏర్పడింది. ఆ ప్రభావం ప్రభుత్వ గృహ నిర్మాణ రంగంపై పడింది. దీంతో నిరుపేదల సొంతింటి కల సాకారం..మళ్లీ కలగానే మారింది. ఈ పథకాన్ని ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంగా మార్పు చేశారు. పథకం సమస్తం అస్తవ్యస్తంగా సాగింది.
లబ్ధిదారులకు రూ. కోట్లలో బకాయిలు..
ఎన్టీఆర్ గ్రామీణ పథకం (కేంద్ర ప్రభుత్వ నిధులతో) కింద ఒక గృహ నిర్మాణానికి రూ. 2 లక్షలు మంజూరు చేయాలి. అలాగే ఎన్టీఆర్ రూరల్ కింద ఒక గృహ నిర్మాణానికి రూ. 1.50 లక్షలు మంజూరు చేయాలి. ఈ ఎన్టీఆర్ రూరల్ స్కీంకు సంబంధించి సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం, కేంద్ర ప్రభుత్వం 30 శాతం భరించాలి. అలాగే ఈ పథకాల కింద ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఒకరికి రూ. 50 వేల చొప్పున అందజేయాలి. కాగా ఎన్టీఆర్ గ్రామీణ యూనిట్ విలువ రూ. 2 లక్షలు, ఎన్టీఆర్ రూరల్ యూనిట్ విలువ రూ. 1.50 లక్షలు. ఒక యూనిట్‌లో రూ. 55 వేల చొప్పున ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు ఉంటాయి.
ఈ రూ. 55 వేల బిల్లు చాలా మంది లబ్ధిదారులకు అందలేదు. అంటే ఒక యూనిట్ విలువ రూ. 2 లక్షలు, రూ. 1.50 లక్షల్లో , రూ. 55 వేలు అందకుండానే చాలా మంది లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు ఈ నిధులే దాదాపు రూ. 30 కోట్లకు పైగా లబ్ధిదారులకు బిల్లుల రూపంలో అందాలి. అలాగే మిగతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న బిల్లులు రూ. 60 కోట్లను కలుపుకుంటే మొత్తం రూ. 100 కోట్లకు పైగా జిల్లాలోని లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం రూ. 30 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు. సంక్షేమం పేరుతో పాలకులు అంకెల గారడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
బ్యాంకర్ల రుణం ఏదీ.?
రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం అని నామకరణం చేశాక ఆర్భాటంగా గృహ కేటాయింపులు చేపట్టింది. అయితే నిధులను సకాలంలో మంజూరు చేయకుండా ఇబ్బందులు పెట్టింది. అర్బన్ పథకం కింద ఒక గృహ నిర్మాణం విలువ రూ. 3.50 లక్షలు కాగా అందులో రూ. ఒక లక్ష బ్యాంకర్లు రుణం కింద అందజేయాలి. మిగతా రూ. 2.50 లక్షలు సబ్బిడీ కింద 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. బ్యాంకర్లు ఎంతమంది లబ్ధిదారులకు రూ. లక్ష రుణంగా మంజూరు చేసింది తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో లబ్ధిదారులు బ్యాంకర్లను ప్రసన్నం చేసుకోలేక అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు.
నాలుగేళ్లుగా దరఖాస్తు చేస్తున్నాఇల్లు ఇవ్వలేదు
చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఎన్టీఆర్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నాను. మంజూరు కాలేదు. రెండు సార్లు జన్మభూమి కమిటీల వద్దకు అధికారులే వెళ్లమన్నారు. వారి వద్దకు వెళ్లినప్పటికీ వారి పార్టీ వాడిని కాదని నాకు ఇల్లు మంజూరు చేయలేదు.
– చక్రపాణి, బాధితుడు, రేకలకుంట, బ్రహ్మంగారిమఠం మండలం
జగన్ ప్రభుత్వం వస్తుందని ఆశతో..
ఇప్పటి వరకూ మా ఊర్లో జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో ఇంటి కోసం అర్జీలు పెట్టాను. అధికారుల చుట్టూ తిరిగాను. ఇల్లు మంజూరు కాలేదు. ఎన్నికలు అయిపోగానే జగన్ ప్రభుత్వంలోనైనా ఇల్లు వస్తుందేమోనని ఆశతో ఉన్నాను. ప్రభుత్వం అందరికీ ఇల్లు ఇస్తేనే బాగుంటుంది.
– వీరబోయిన వెంకటలక్షుమ్మ, బాధితురాలు, ఉత్సలవరం, మైదుకూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment