ఏడేళ్ల కిందట పట్టాలు ఇచ్చారు...ఆ పట్టాల స్థలంలో ఇళ్లు కట్టుకోలేదని తాజాగా నోటీసులు ఇవ్వడం ప్రారంభించడంతో లబ్ధిదారుల్లో అలజడి ప్రారంభమయింది. వందలాది మంది బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలిచింది. అనపర్తి కో ఆర్డినేటర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. ఉద్రిక్తతను గమనించిన మండల అధికారులు ఆర్డీఓతో చర్చించి లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
అనపర్తి: నిరుపేదలకు సొంత గూడు కల్పించే దిశగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంతో అధికారులు దిగిరాక తప్పలేదు. బాధితులకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవడంతో ఆందోళనను విరమించారు. అనపర్తి గ్రామ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం సేకరించిన స్థలంలో 2011లో 1709 మందికి ఇళ్లు పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చినా ఇళ్లు కట్టుకోకపోవడంతో ‘పట్టాలు ఎందుకు రద్దు చేయకూడదంటూ’ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయటంతో వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులు సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న లబ్ధిదారులు అధికారులు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణానికి మంజూరైన రుణాలు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, అప్పటి నుంచి రుణాలు మంజూరు కాకపోవటంతో నిరుపేదలైన లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టలేదని వివరించారు. వెంటనే ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్డీవో హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పరిస్థితిని అధికారులు రామచంద్రపురం ఆర్డీఓ రాజశేఖర్‌ను ఫోన్‌లో సంప్రదించారు.
అనంతరం 2011లో మంజూరు చేసిన ఇళ్ల పట్టాల్లో అర్హులైన లబ్ధిదారుల పట్టాలు రద్దు చేసేదిలేదని, అయితే గ్రామంలో లేని వారి పట్టాలను దర్యాప్తు చేసిన అనంతరం రద్దు చేస్తామని అధికారులు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడంతో ఐదున్నర గంటలపాటు సాగిన నిరసన కార్యక్రమానికి తెరపడింది. వైఎస్సార్‌సీపీ నాయకులు సత్తి వీర్రెడ్డి, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మల్లిడి ఆదినారాయణరెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, ఒంటిమి సూర్యప్రకాష్, అధిక సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment