సాక్షి,సిటీబ్యూరో: నగరంలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు త్వరలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. దీని ప్రకారం ఇక ‘డబుల్’ ఇంటికి దరఖాస్తు చేసుకునేందుకు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. దరఖాస్తు ఫారాల కోసం హైరానా పడకుండా ఎవరికి వారు తమ కాలనీల్లో ఉన్న మీ–సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకునేలా అధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు. దరఖాస్తుతో పాటు నిర్ణీత రుసుం రూ.35 మాత్రమే చెల్లించి రశీదు తీసుకుంటే చాలు. ఆపై ఎవరికీ ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించకుండా.. పైరవీలకు తావు లేకుండా ఈ విధి విధానాలు ఉండనున్నాయి.
లబ్ధిదారులు మీ–సేవా ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించాక ఓ క్రమ సంఖ్య జారీ అవుతుంది. ఓ కుటుంబం ఒకటికి మించి దరఖాస్తు చేసుకోకుండా చర్యటలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సైతం రూపొందిస్తున్నారు. రెండు మూడు చోట్ల దరఖాస్తు చేసుకుంటే ఆధార్ నంబర్ ఆధారంగా సాఫ్ట్‌వేర్ గుర్తించి అదనపు దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోతాయి. దరఖాస్తులో ఆహార భద్రత(రేషన్) కార్డు నంబర్, కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, అడ్రస్ తదితర వివరాలు పేర్కొనాలి. వాటి ఆధారంగా అధికార యంత్రాంగం దరఖాస్తులను పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ అనంతరం అర్హులను ఎంపిక పక్రియ కొనసాగుతుంది. .
పెండింగ్‌లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ దరఖాస్తులు
మహా నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా రెవెన్యూ యంత్రాంగాల వద్ద ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో కలిపి సుమారు మూడు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల దరఖాస్తుల తాకిడి మరింత అధికమైంది. ఇప్పటికే ప్రభుత్వం మొదటి విడత కింద మురికివాడల్లోని నివాస ప్రాంతాల్లో స్థల లభ్యతను బట్టి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. స్థానిక నివాస లబ్ధిదారులందరికీ ఇళ్లను మంజూరు చేసి పొజిషియన్ సర్టిఫికెట్లను కూడా అందజేసింది. కొందరికి ఇళ్లు కూడా మంజూరు చేసి స్వాధీనం చేసింది. మొదటి విడత పూర్తవడంతో, రెండో విడత డబుల్ ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.
చిగురిస్తున్న ఆశలు
కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరడంతో ‘డబుల్’ ఇళ్లపై పేదలకు ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు.. దరఖాస్తులు ఆహ్వానించ లేదు. సాధారణంగా ప్రభుత్వపరంగా మంజూరు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించే విధానం అమల్లో ఉండడంతో డబుల్ బెడ్రూమ్ దరఖాస్తులు మీ–సేవా, ఈ–సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఆ ప్రతులతో అభ్యర్థులు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. అధికారులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ‘ఆన్‌లైన్’లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారవర్గాలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment