దార్శనికుడు.. జయశంకర్‌ సార్‌ | Jaya Shankar sir is a Visionary | Sakshi
Sakshi News home page

దార్శనికుడు.. జయశంకర్‌ సార్‌

Published Fri, Aug 5 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

దార్శనికుడు.. జయశంకర్‌ సార్‌

దార్శనికుడు.. జయశంకర్‌ సార్‌

  • నేడు తెలంగాణ సిద్ధాంతకర్త జయంతి 
  • ఏకశిలా పార్కులో కార్యక్రమాలు
  • హన్మకొండ : తెలంగాణ సిద్ధాంతకర్త, నిత్య అధ్యయనశీలి, గొప్ప విశ్లేషకుడు. అద్భుత బోధకుడు, కడ వరకు ఒక్కమాటపై నిలిచినవాడు, తెలంగాణ సాధన ఉద్యమ దిక్చూచి.. అందరూ సార్‌ అని హప్యాయంగా పిలిచే గొప్ప వ్యక్తి ప్రొఫెసర్‌ కొత్తపెల్లి జయశంకర్‌. దేశవ్యాప్తంగా తెలంగాణ వాణి వినిపించిన సార్‌ మనల్ని వీడిపోయి ఐదేళ్లు దాటుతుండగా.. ఆయన జయంతి శనివారం జరగనుంది. ఆత్మకూరు మండలం అక్కంపేటలో మధ్యతరగతి కుటుంబంలో 1934 ఆగస్టు 6న జయశంకర్‌ జన్మించారు. ప్రాథమిక విద్యను హన్మకొండ మర్కజీ ఉన్నతపాఠశాలలో పీయూసీ మల్టిపర్పస్‌ హైస్కూల్‌లో, ఉన్నత విద్యను బనారస్, అలీఘర్, ఉస్మానియా యూనివర్సిటీల్లో అభ్యసించారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రావీణ్యులైన జయశంకర్‌ కొంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1991–94 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా, 1979–81 వరకు రిజిస్ట్రార్‌గా, 1982–91 వరకు సీఫెల్‌ రిజిస్టార్‌గా పనిచేశారు. అధ్యాపకుడిగా పనిచేస్తున్న కాలంలో ఉన్నత విద్యారంగంతో పాటు పాటు అసోసియేషన్‌లో పలు పదవులు నిర్వహించారు. 
     
    తెలంగాణ శ్రామికుడు 
    మర్కజీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న నాటి నుంచి తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్‌ అలుపెరుగని శ్రామికుడిలా పనిచేశారు. 1952లో విద్యార్థి దశలోనే నాన్‌ముల్కీ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించారు. రాష్ట్రాల పున్వరిభజన కోసం ఏర్పాటు చేసిన ఫజల్‌ అలీ కమిషన్‌ ముందు 1954లోనే హాజరై ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను చాటిచెప్పిన గొప్ప వ్యక్తి జయశంకర్‌. 1968–69లో ఉవ్వెత్తున ఎగిసిపడిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో  సంపూర్ణ భాగస్వామ్యమయ్యారు. తెలంగాణ ఉద్యమ క్రమంలో ఆయన అనేక సభలు, సమావేశాల్లో పాల్గొని ప్రజలను చైతన్యం చేసేందుకు తోడ్పడ్డారు. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ అనేక పుస్తకాలు వెలువరించారు. ముఖ్యంగా 610 జీవోపై జయశంకర్‌ రాసిన పుస్తకమే అనేక కమిషన్లకు మార్గదర్శిగా నిలిచింది. 2000–2002లో ప్రాంతీయ అసమానతలపై ఆయన ‘ఆటా’ ఆహ్వానం మేరకు అమెరికాలో అనేక సమావేశాల్లో ప్రసంగించారు. టీడీఎఫ్‌ ఆధ్వర్యంలో అమెరికాలో అనేక సభల్లో పాల్గొన్నారు. 
     
    తెలంగాణ సిద్ధాంతకర్త...
    తొలి నుంచి ప్రత్యేక రాష్ట్ర వాదిగా నిలిచిన జయశంకర్‌ తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ సిద్ధాంతకర్తగా అందరూ కొనియాడారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పనిచేశారు. కీలకమైన సందర్భాలు, సంక్షోభాలు, సమస్యలప్పుడు వాటిని విడమర్చిచెప్పి ఆంధ్రా సంపన్నవర్గాల కుట్రలపై అప్రమత్తత అవసరమంటూ చైతన్యపరిచేవారు. టీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా 2004, 2008, 2009లో ఎదుర్కొన్న ఎత్తుపల్లాల్లో కేసీఆర్‌కు గుండె ధైర్యాన్ని ఇచ్చారనడంలో సందేహం లేదు. తెలంగాణ కోసం రాజకీయాలకు అతీతంగా ఏ సంస్థ, సంఘం, వ్యక్తులు కార్యక్రమాలు ఏర్పాటు చేసినా అందులో జయశంకర్‌ పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉండేదంటే అతిశయోక్తి కాదు.
     
    రాజకీయ పదవులకు దూరం...
    జయశంకర్‌ తొలి నుంచి నిరాడంబర జీవితం గడిపారు. ఉన్నతపదవుల్లో ఉన్నప్పటికీ సాదాసీదా జీవితంతో పాటు ఆయన వేషధారణ సైతం సాధారణంగానే ఉండేది. ఎప్పుడూ ఆర్భాటాలకు తావివ్వలేదు. ఆజన్మ బ్రహ్మచారిగా నిలిచిన ఆయన బ్రహ్మం అనే యువకున్ని దత్తత చేసుకున్నారు. కేసీఆర్‌కు సన్నిహితుడిగా, సిద్ధాంతకర్తగా గుర్తింపు పొందినప్పటికీ విద్యాపరమైన పదవులు తప్ప రాజకీయ పదవులకు జయశంకర్‌ దూరంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన లక్ష్యమంటూ ప్రకటిస్తూ వచ్చారు. 
     
    జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు
    – టి.రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు
    తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి కార్యక్రమాలను శనివారం జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు సూచించారు. గ్రామ, మండల స్థాయిలో జయశంకర్‌ జయంతిని నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను, నేతలను కోరారు. అన్ని స్థాయిల్లోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. కాగా, హన్మకొండలోని ఏకశిలాపార్కు(జయశంకర్‌ స్మృతివనం)లో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు జరిగే జయశంకర్‌ జయంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని చెప్పారు. అలాగే, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, జెడ్పీ చైర్‌పర్సన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు.
     
    అక్కంపేటలో వేడుకలు
    హన్మకొండ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జయంతి వేడుకలు ఆయన స్వగ్రామమైన అక్కంపేటలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో జయంతి కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో ఉదయం 10 గంటలకు జయశంకర్‌ జయంతి వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్, హరితహారం కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరం, జయశంకర్‌ సంస్మరణ సభ ఉంటాయని కలెక్టర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement