టపాసులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
నెల్లూరు (పొగతోట) : దీపావళి టపాసులు అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. లైసెన్స్‌లు లేకుండా టపాసులు విక్రయించే వారి షాపులను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలన్నారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు నిబంధనల ప్రకారం విక్రయాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాల నిర్వహణలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసే టపాసుల దుకాణాలు అనుమతులు తప్పని సరిగా పొందలన్నారు. దుకాణాల వద్ద వాటర్ డ్రమ్ము, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. షాపుల మధ్య 15 అడుగుల దూరం ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. దుకాణాల వద్ద ప్రజలు అధికంగా గుమిగుడకుండా, చిన్నపిల్లలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించి దుకాణాలు నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. డీఆర్‌ఓ మార్కండేయులు, కావలి ఆర్డీఓ నరసింహం, నెల్లూరు డీఎస్పీ వెంకటరాయుడు, జిల్లా అగ్నిమాక శాఖ అధికారి ఆర్. జ్ఞానసుందరం, కలెక్టరేట్ పరిపాలనాధికారి మధుసూదనశర్మ, నెల్లూరు తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డి, హోల్‌సేల్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.