జేఎన్‌టీయూకే తీరుపై శివాజీ ఆగ్రహం
జేఎన్‌టీయూకే తీరుపై శివాజీ ఆగ్రహం
Published Fri, Jul 29 2016 10:01 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
కాకినాడ సిటీ:
జేఎన్‌టీయూకేలో ఎస్సీ, ఎస్టీలకు వర్తింపజేసిన రిజర్వేషన్లు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలకు సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణలో వైఫల్యంపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంక్షేమంపై నివేదిక అందజేయాలని జేఎన్‌టీయు అధికారులను ఆయన ఆదేశించారు. జేఎన్‌టీయూకే సమావేశ మందిరంలో వైస్‌చాన్సలర్ వీఎస్‌ఎస్ కుమార్, సంబంధిత అధికారులతో ఆయన ఎస్సీ, ఎస్టీ పోస్టుల నిర్వహణలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తదితర అంశాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు సంబంధించిన రికార్డులన్నింటినీ వారం రోజుల్లోగా సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకుల వద్దకు తీసుకువెళ్లి వారితో పరిశీలింపజేసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా లైజన్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించారు. ఆయన విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తారన్నారు. లైజన్ ఆఫీసర్‌కు ఇ–మెయిల్ అడ్రస్ క్రియేట్ చేయాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అప్పుడే విద్యార్థులకు ఏవిధమైన సమస్య వచ్చినా లైజన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళడానికి వీలుంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి. ఔట్ సోర్సింగ్‌లో రిజర్వేషన్ పాటిస్తున్నారా లేదా అనే అంశంపై శివాజీ ఆరా తీశారు. సంబంధిత రికార్డులను అధికారులు చూపకపోవడంతో 15–20 రోజుల్లో అన్ని రికార్డులు సిద్ధం చేసి, నివేదికలు పొందుపరచాలని అంటూ కమిషన్ చైర్మన్ శివాజీ సమావేశాన్ని వాయిదా వేశారు. నివేదికలను పరిశీలించిన అనంతరమే తదుపరి సమావేశం నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రార్ ప్రసాద్‌రాజు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, జేఎన్‌టీయూకే ప్రొఫెసర్లు పాల్గొన్నారు. జేఎన్‌టీయూకే ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సభ్యులు చైర్మన్ కారెం శివాజీని ఘనంగా సన్మానించారు.
Advertisement
Advertisement