మరోసారి కస్టడీకి కళానికేతన్ ఎండీ?
Published Sun, Jul 17 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
– నేడు కోర్టులో వెల్లడికానున్న వైనం
– మరిన్ని కీలక సమాచారం రాబట్టేందుకు పట్టణ పోలీసులు యత్నాలు
ధర్మవరం అర్బన్ : పట్టుచీరల వ్యాపారుల వద్ద చీరలు కొనుగోలు చేసి, డబ్బు ఎగ్గొట్టిన కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న కళానికేతన్ ఎండీ లీలాకుమార్‌ను మరోసారి పోలీసు కస్టడీకి తీసుకునేందుకు ధర్మవరం పట్టణ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. రిమాండ్‌లోనున్న ఎండీ లీలాకుమార్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ధర్మవరం కోర్టులో పట్టణ పోలీసులు దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జడ్జి పరిశీలించనున్నారు. జడ్జి పోలీసు కస్టడీకి అనుమతిస్తే కళానికేతన్ ఎండీ లీలాకుమార్‌ను పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విచారించనున్నారు.
గతంలో విచారణ చేసిన సమయంలో పలు కీలక సమాచారాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యాపారుల నుంచి కొనుగోలు చేసిన పట్టుచీరలు ఎక్కడున్నాయి, డబ్బు ఎక్కడుంది? అన్న సమాచారం పోలీసులు సేకరించారు. పట్టుచీరలను సైతం రికవరీ చేసినట్లు సమాచారం. రూ.9 కోట్లకు పైగా నగదు ఎగవేత కేసులో ఇరుక్కున్న ఎండీ లీలాకుమార్‌పై ధర్మవరం పోలీస్ స్టేషన్‌లో కేవలం రూ.4 కోట్లకుపైగా నగదు ఎగవేసినట్లు కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల కస్టడీకి మరోసారి ఎండీని అప్పగిస్తే కేసు ఓ కొలిక్కి వచ్చేలా ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు.
Advertisement
Advertisement