ఎవరికీ లేని ఆంక్షలు కాపులకేనా?
- ∙కాపు ఉద్యమాల సమయంలోనే
- 144, 30 సెక్షన్లు అమలు
- ∙రాష్ట్ర కాపు జేఏసీ నేతల ధ్వజం
- ∙పాదయాత్ర జరిపి తీరుతామని స్పష్టీకరణ
అమలాపురంలోని కొల్లూరి వారి సత్రంలో రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించిన కాపు నాయకుల సమావేశంలో ఈ నెల 16 నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ చేపడుతున్న పాదయాత్ర సన్నాహాలపై చర్చించారు. రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, జిల్లా కాపునాడు పరిశీలకుడు, గుంటూరు జిల్లా పొన్నూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు కోట శ్రీనివాస్, నల్లా పవన్, మెండుగుదటి మోహన్, కల్వకొలను తాతాజీ, ముత్యాల రామదాసు తదితరులు ముద్రగడ పాదయాత్ర రూట్ మ్యాప్, ఏర్పాట్లపై చర్చించారు.
యాత్రకు దరఖాస్తు చేసుకుని, గొడవలు జరగవని హామీ ఇస్తే అనుమతి ఇస్తామని డీజీపీ చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. చంద్రబాబుతో పాటు రాజకీయ ప్రముఖులు చేస్తున్న యాత్రలకు అనుమతులు ఉంటున్నాయాని వారు ప్రశ్నించారు. తుని కాపు గర్జన సభకు బస్సులు కూడా ఏర్పాటు చేసుకోనివ్వకుండా ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఐక్యతతో పాదయాత్రను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాపు నాయకులు బసవా ప్రభాకర్, ఆర్వీ నాయుడు, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు, మోటూరి సాయి, సుంకర సుధ, నల్లా శివాజీ, బద్రి బాబ్జీ, అరిగెల నాని, కురసాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.